పాక్​సైన్యం తోలు బొమ్మలాట

పాక్​సైన్యం తోలు  బొమ్మలాట

పాకిస్తాన్​లో రాజకీయ అస్థిరత, కునారిల్లిన ఆర్థిక వ్యవస్థ, వివిధ టెర్రరిస్టు గ్రూపుల మధ్య వివాదాలు, కొన్నిచోట్ల వేర్పాటువాదం అక్కడి సైన్యానికి గతంలో కన్నా ఎక్కువ తలనొప్పిగా తయారయ్యాయి. సైన్యం కన్నా పౌర ప్రభుత్వానిదే పైచేయి అని చాటేందుకు ప్రయత్నించిన ఎటువంటి రాజకీయ నాయకులనైనా వారిని పాక్​సైన్యం శంకరగిరి మాన్యాలు పట్టిస్తూ ఉంటుంది. కొందరిని పరలోకానికి కూడా సాగనంపుతుందనే ఆరోపణలున్నాయి. 

 ప్రస్తుతం పాకిస్తాన్ లో అన్వర్- ఉల్-హక్ కాకర్ ఆపద్ధర్మ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఉన్నా పెత్తనమంతా సైన్యానిదే. బెలూచిస్తాన్ ప్రాంతానికి చెందిన సీనియర్ సెనేటర్ కాకర్ ఈ ఏడాది ఆగస్టు14న ప్రధానిగా నియమితులయ్యారు. వచ్చే జనవరిలో ఎన్నికలు నిర్వహించి, పేరుకి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందనిపించడానికి సైన్యం సన్నాహాలు మొదలుపెట్టింది. 

 అఫ్గాన్​ శరణార్థులపై పాక్ ​కన్నెర్ర

అమెరికాసేనలు  ఏ కారణాలతో అయితేనేం రెండు దశాబ్దాలకు పైగా అఫ్గానిస్తాన్ లో తిష్ట వేసిన తర్వాత.. 2021 ఆగస్టు 30న ఆ దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాయి. అవి వైదొలగడంతోనే అందరూ ఊహించినదానికన్నా వేగంగా అక్కడ తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. తాలిబన్ల రాక్షస పాలన తట్టుకోలేక పెద్ద సంఖ్యలో అఫ్గాన్ ప్రజలు పొరుగునఉన్న పాకిస్తాన్​కు వలస వచ్చారు.  వారిలో కొందరు పాకిస్తాన్ లో శరణార్థులుగా తమ పేర్లను నమోదు చేసుకోగా, అనధికారికంగా రోజులు దొర్లిస్తున్నవారూ ఉన్నారు. రికార్డులకెక్కని శరణార్థులు అఫ్ఘానిస్తాన్ కు తిరిగి వెళ్ళిపోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది.

శరణార్థులు స్వచ్ఛందంగా వెనక్కి వెళ్ళిపోవాలని ప్రభుత్వం పెట్టిన గడువు అక్టోబర్ నుంచి మొదలైంది. శరణార్థులు వారంతటవారు వెళ్ళకపోతే బలవంతంగా దేశం నుంచి బహిష్కరిస్తామని పాకిస్తాన్​లోని తాత్కాలిక ప్రభుత్వం హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రభుత్వం రికార్డులకు ఎక్కినవారిని కూడా పంపించేస్తోందని చెబుతున్నారు.  గతంలో కూడా అఫ్గాన్లు ఇలాగే బలవంతంగా స్వదేశానికి తిరిగి వెళ్ళిన దృష్టాంతాలు ఉన్నాయి. కానీ, ఇప్పటి పెద్ద సంఖ్యలో కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అఫ్గాన్​లో ఘర్షణల వల్ల లక్షలకొద్దీ అఫ్గాన్లు పాకిస్తాన్ లోకి ప్రవేశించడం 1970ల నుంచి ఉంది. ఇక 2021లో తాలిబాన్లు అఫ్గానిస్తాన్ ను గుప్పిట్లోకి తెచ్చుకున్నాక కనీసం ఆరు లక్షల మంది అఫ్గాన్లు పాకిస్తాన్ లో తలదాచుకున్నట్లు అంచనా. 

పాక్​లో అఫ్గాన్లపై వివక్ష

తమదీ పేద దేశమే అయినా అంతమందికి ఆశ్రయం ఇస్తున్నట్లు పాకిస్తాన్ పైకి గొప్పలు చెప్పుకుంటున్నా, పాక్​లో దైనందిన జీవితంలో అఫ్గాన్లు వివక్షకుగురవుతూనే ఉన్నారని మానవ హక్కుల సంస్థలవారి మాట. భూస్వాములు శ్రమదోపిడీకి పాల్పడితే, పోలీసులు,  భద్రతా దళాల చేతిలో అఫ్గాన్లు నానా అగచాట్లు పడిన ఘటనలు కోకొల్లలు. మినుకు మినుకుమంటున్న మానవతా దీపానికి ప్రతీకగా ఇటీవల  కొందరు పాకిస్తానీ విద్యార్థులు చెమ్మగిల్లిన కళ్ళతో తోటి అఫ్గాన్ విద్యార్థులకు వీడ్కోలు పలికిన వార్తలూ కొన్ని లేకపోలేదు. 

అఫ్గాన్లు అసలే అరకొరగా ఉన్న పనులు చేజిక్కించుకుని తమ కడుపు కొడుతున్నారని సగటు పాకిస్తానీయులు బాధపడితే,  మాదక ద్రవ్యాల రవాణా,  తీవ్రవాద చర్యల్లో పాల్గొంటూ అఫ్గాన్లు పెద్ద తలనొప్పిగా పరిణమిస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా నిష్క్రమించాక అఫ్గాన్లకు తిరిగి పాకిస్తానే  తేలిగ్గా తలదాచుకోగల ప్రాంతంగా మారింది. గతంలో  అమెరికా సైన్యానికి వివిధ సేవలందించి ప్రత్యేక ఇమిగ్రేషన్ వీసాల ద్వారా అమెరికా వెళ్ళాలనుకుంటున్న కొందరికి మాత్రం ప్రస్తుత పరిస్థితులు సంకటంగా మారాయి.

 అమెరికా సైన్యానికి పనిచేసినట్లు తేలినవారి తలలను తాలిబన్లు తెగనరికినా ఆశ్చర్యపోనవసరం లేదు. రికార్డులకెక్కని శరణార్థులు తిరిగి వెళ్ళిపోవాలనే ప్రభుత్వాదేశం  ఇరాన్, మయన్మార్, శ్రీలంకల నుంచి వచ్చినవారిపై కూడా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. 

పెచ్చుమీరిన టెర్రరిజం

దేశ వ్యతిరేక టెర్రరిస్టు చర్యలు ఇటీవల పాకిస్తాన్ లో పెచ్చుమీరాయి. అఫ్గానిస్తాన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తెహ్రీక్ –ఏ- తాలిబాన్ వ్యవస్థీకృత నేరాలు, టెర్రరిస్టు చర్యలకు పాల్పడుతోందని, దాంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కోలుకునే ప్రక్రియకు విఘాతం ఏర్పడుతోందని పాకిస్తాన్ తాత్కాలిక హోం మంత్రి సర్ఫరాజ్ బుగ్తి పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పాక్ సైనిక దళాల ప్రధానాధికారి బాహాటంగానే సమర్థించారు.  ప్రజా సంక్షేమాన్ని కాపాడేందుకు, పాకిస్తాన్​ను సురక్షితమైన ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు ఈ సామూహిక బహిష్కరణ అనివార్యమవుతోందని ప్రభుత్వం చెబుతోంది. 

 దేశీయ రాజకీయాలు, అఫ్ఘానిస్తాన్​లో తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వంతో  సంబంధాలు క్షీణించడం కూడా దానికి కారణాలుగా భావిస్తున్నారు. గడచిన రెండు నెలల్లో రెండు లక్షల మంది అఫ్గాన్లు వారి స్వదేశానికి తిరిగి వెళ్ళారని ప్రభుత్వమే చెబుతోంది. పెషావర్ నుంచి జలాలాబాద్ వెళ్ళే రోడ్డు శరణార్థుల వాహనాలతో నిండిపోయి కనిపిస్తోంది. ఖైబర్ పఖ్తూన్ ఖ్వవా రాష్ట్రంలోని ఖుర్మ్ జిల్లాలో ఇటీవల వేర్పాటువాద తీవ్రవాదం పడగ విప్పింది. ఎనిమిది రోజులపాటు సాగిన హింసాకాండలో దాదాపు 40 మంది మరణించారు. షియా వ్యతిరేక హింసకు పేరెన్నికగన్న ప్రాంతం అది. ఖుర్మ్ జిల్లాలోనే గత మే నెలలో జరిగిన దాడిలో ఏడుగురు షియా ఉపాధ్యాయులు హతులయ్యారు. జులై నెలలో భూవివాదాలతో రాజుకున్న హింసలో 11 మంది చనిపోయారు. 

ఆలమ్ ఎయిర్ బేస్​పై ఉగ్రదాడి

పాక్​లో పంజాబ్ రాష్ట్రంలోని మియాన్ వలీ వైమానిక స్థావరంపై తెహ్రీక్- ఏ- జిహాద్ పాకిస్తాన్ అనే తీవ్రవాద సంస్థ ఇటీవల దాడి చేసింది. ఇది తెహ్రీక్ -ఏ- తాలిబాన్ పాకిస్తాన్​కు అనుబంధ సంస్థ. ఈ దాడిలో ఎవరూ చనిపోలేదని, మూలనపడేసిన విమానాలు కొన్ని దెబ్బతిన్నాయని పాకిస్తాన్ సైనిక గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్​కు చెందిన పౌర సంబంధాల విభాగం పేర్కొంది. కానీ, ఈ దాడిలో 14 విమానాలు ధ్వంసమయ్యాయని,  కనీసం 8 ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్లు నేలమట్టమయ్యాయని ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా వెల్లడైంది. 

దాడికి తామే బాధ్యులమని చెప్పుకున్న తెహ్రీక్- ఏ- జిహాద్ 40 విమానాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. పాకిస్తాన్ వైమానిక దళానికి, సైన్యానికి చెందిన తొమ్మండుగురు ఈ దాడిలో చనిపోయినట్లు వారి బంధువులు పెట్టిన ఫేస్ బుక్ పోస్టుల ద్వారా కొందరు లెక్కగడుతున్నారు.  ఈ దాడిలో 35 మంది సైనిక సిబ్బంది చనిపోయినట్లు ఆయేషా సిద్దికీ అనే పాకిస్తానీ వ్యాసకర్త చెబుతున్నారు.  

అఫ్గాన్​లో అధ్వాన పరిస్థితులు

పెద్ద సంఖ్యలో స్వదేశానికి తిరిగి వస్తున్నవారికి తగిన నివాసం, మౌలిక వసతులు కల్పించగల స్థితిలో తాలిబన్లు లేరు. దుర్భిక్షం, వరదలు, భూకంపాల వల్ల  కోటి యాభై లక్షల మంది అఫ్గాన్లు తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. తాలిబన్ల అనాగరిక విధానాల కారణంగా అఫ్గానిస్తాన్​కు అంతర్జాతీయ సహాయ సహకారాలు చాలావరకు తగ్గిపోయాయి. అక్కడ పనిచేస్తున్న అంతర్జాతీయ సహాయ సంస్థలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. స్వదేశానికి తిరిగి వస్తున్న మహిళల్లో బాలికలు స్కూళ్ళకు వెళ్లడానికి లేదు. మిగిలినవారు పనులకు వెళ్ళడానికి లేదు. అఫ్గాన్ శరణార్థులు పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్న పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

నవాజ్ షరీఫ్​ పునరాగమనం

పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ నాలుగేండ్ల విరామం తర్వాత లండన్ నుంచి గత అక్టోబర్​లో స్వదేశానికి తిరిగి వచ్చారు.  జైలు కాదు బెయిలు అంటూ సైన్యంతో కుదుర్చుకున్న బేరం మేరకే  నవాజ్ మళ్ళీ పాకిస్తాన్​లో అడుగుపెట్టగలిగారని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), పాకిస్తాన్ తెహ్రీక్- ఏ- ఇన్సాఫ్ వంటి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సైన్యం 2017లో ఆయనను పదవీచ్యుతుడిని చేసింది.

 రెండు అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న నవాజ్ శిక్షాకాలం పూర్తి కాకుండానే వైద్య చికిత్స పేరుతో,  సైన్యం దయతో విదేశానికి ఉడాయించారు. సైన్యం ఆధిపత్యాన్ని ప్రశ్నించినందుకే ఆయనకు ఆ గతి పట్టిందని వేరే చెప్పనవసరం లేదు. పిఎంఎల్ (ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి అదే పార్టీకి చెందిన షాహిద్ అబ్బాసీ 2017లో  ప్రధాని అయ్యారు. నవాజ్ లేని ప్రభుత్వానికి సైన్యం ఆమోదం తెలిపిందన్నమాట. అబ్బాసీ మీర్ హజర్ ఖాన్ ఖోసో ఆపద్ధర్మ ప్రధాని అయ్యారు.  తర్వాత సైన్యం ఆశీస్సులతోనే ఇమ్రాన్ 2018 ఎన్నికల్లో గెలవగలిగారని చెబుతారు. 

ఇపుడు నవాజ్ ప్రత్యర్థి ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నారు. సైన్యంతో రాజీకి వస్తే ఆయనకు కూడా బెయిలు లభించవచ్చు. ఇమ్రాన్ ఖాన్​కు సైన్యానికి మధ్య మొదట్లో సంబంధాలు బాగానే నడిచాయి. తర్వాత, సైన్యంతో స్నేహం బెడిసికొట్టడంతో అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ ఓడిపోయారు. నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్ 2022 ఏప్రిల్ లో సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాని అయ్యారు.  ఆయన ఈ మధ్య పదవి నుంచి వైదొలగి, కాకర్ నాయకత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించారు. నవాజ్​ను పదవి నుంచి తొలగించడంలో ముఖ్యపాత్ర పోషించిన  సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ కమర్ బాజ్వా ఆరేండ్లు పదవిలో ఉన్నాక ఆయన స్థానంలో జనరల్ అసిమ్ మునీర్ ఏడాది క్రితం కొత్త సేనాపతి అయ్యారు.

– మల్లంపల్లి ధూర్జటి, సీనియర్​ జర్నలిస్ట్​