జాబ్ సెక్యూరిటీ, ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ఎంత పెద్ద ఉద్యోగమైనా ‘డోన్ట్ కేర్

జాబ్ సెక్యూరిటీ, ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ఎంత పెద్ద ఉద్యోగమైనా ‘డోన్ట్ కేర్

క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో మంచి జాబ్ కొట్టిన కిరణ్.. పేరున్న ఐటీ సంస్థలో చేరాడు. పెద్ద కంపెనీ, మంచి జీతం. అంతా బాగానే ఉంది. కానీ ఆరు నెలలు గడవక ముందే వేరే జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. మరొక పెద్ద సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కావ్య సంవత్సరం తిరగకముందే రిజైన్ లెటర్ ఇచ్చేసింది. అదేంటని అడిగితే..  ‘ఈ జాబ్‌లో ఫ్యూచర్ కనిపించడం లేదు’ అంటోంది. వీళ్లిద్దరే కాదు, దేశంలో మిలెనియల్స్.. అంటే 25 నుంచి 40 ఏండ్ల మధ్య వయసున్న వాళ్లంతా ఇలానే ఆలోచిస్తున్నారు.  ‘ఒకే ఉద్యోగం ఎన్ని రోజులు చేస్తాం. త్వరగా అప్‌డేట్ అవ్వాలి’ అనుకుంటున్నారు. 

మంచి ఉద్యోగం, ఐదంకెల జీతం ఉంటే చాలు, లైఫ్ సెటిల్ అనుకునే రోజులు పోయాయి. ఇప్పటి యువత వేరేలా ఆలోచిస్తోంది. జాబ్ సెక్యూరిటీ, ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ఎంత పెద్ద ఉద్యోగమైనా ‘డోన్ట్ కేర్’ అంటోంది. సేల్స్​మెన్​ నుంచి సాఫ్ట్​వేర్ డెవలపర్స్ వరకూ అన్ని రకాల ఉద్యోగుల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. యువత ఇలా ఆలోచించడానికి కారణాలేంటి? కెరీర్ పరంగా వాళ్లు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారో చూద్దాం.

1980–1998 మధ్య పుట్టిన వాళ్లను మిలెనియల్స్ జనరేషన్ అంటారు. ఈ జనరేషన్‌కు చెందిన ఉద్యోగుల్లో ఇటీవల కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. నిన్నటివరకూ ‘ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు’ అనుకున్న వాళ్లు కూడా ఉద్యోగంలో చేరాక ఆలోచన మార్చుకుంటున్నారు. నిలకడగా ఒకే ఉద్యోగం చేయడం కంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, కెరీర్‌‌ను అప్‌డేట్ చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొన్ని సర్వేల ప్రకారం 60 శాతం మంది మిలెనియల్స్ ఏడాది కంటే తక్కువ కాలంలోనే ఉద్యోగం మారుతున్నారు. అయితే జాబ్ మార్కెట్‌‌లో అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఎక్కువమంది రిజైన్ చేయడం కామన్. కానీ ఇప్పుడు జరుగుతున్నది అది కాదు. దీన్ని డిఫరెంట్‌గా చూడాలి.  ప్రస్తుతం ప్రపంచ ఎకానమీ పడిపోతూ వస్తోంది. కొత్త ఉద్యోగావకాశాలు అంతగా లేవు. ఇలాంటి టైంలో ఉద్యోగం వదిలేయడమంటే తక్కువ జీతాలతో పనిచేసేవాళ్లకి అంత ఈజీ కాదు. అందుకే దీనికి ‘ది గ్రేట్ రిజిగ్నేషన్’ అని పేరు పెట్టారు ఎకనమిస్ట్​లు.

ది గ్రేట్ రిజిగ్నేషన్ అంటే..
అమెరికాలో గత ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 40 లక్షల మంది తమ ఉద్యోగాలకు రిజైన్ చేశారు. నెలలు గడిచే కొద్దీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ‘బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్’ ప్రకారం క్లర్క్‌‌లు, రెస్టారెంట్ స్టాఫ్, డైలీ వర్కర్లు.. ఇలా ప్రతి 14 మందిలో ఒకరు ఒకే నెలలో తమ ఉద్యోగాలు వదిలేశారు. 2021 ఏప్రిల్‌ నుంచి 2022 ఏప్రిల్‌  మధ్య ఒక్క అమెరికాలోనే దాదాపు 7.16 కోట్ల మంది ఉద్యోగాలు మారారు. ఇదే ట్రెండ్‌  ప్రపంచవ్యాప్తంగా కనిపించింది. దీన్నే ‘గ్రేట్‌ రిజిగ్నేషన్‌’గా పిలుస్తున్నారు.అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, ఇంగ్లండ్​లలో 40 శాతం మంది ఉద్యోగులు రాబోయే మూడు నుంచి ఆరు నెలల్లోగా ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలు వదిలేసే అవకాశం ఉందని ‘మెకిన్సే అండ్‌‌ కంపెనీ’ నివేదిక చెప్తోంది. సుమారు 64 శాతం మంది తమ చేతిలో మరో జాబ్​ ఆఫర్​ లేకుండానే ఉన్న ఉద్యోగాన్ని వదిలేయాలి అనుకుంటున్నారట. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లు కూడా తమకిష్టంలేని ఉద్యోగాలను వదిలేయడానికి పెద్దగా ఆలోచించట్లేదు. ‘బ్యాంక్‌‌ రేట్ డాట్ కామ్’ అనే ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ చేసిన ‘ఆగస్ట్ జాబ్ సీకర్’ సర్వే ప్రకారం.. అమెరికాలోని వర్కర్లలో సగం కంటే ఎక్కువమంది కొత్త ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారని తెలిసింది. అయితే అమెరికాలో మొదలైన ఈ  రాజీనామాల ట్రెండ్ ఆ తర్వాత యూరప్, ఆసియా అంతా వ్యాపించింది. మనదేశంలో కూడా ప్రస్తుతం రిజిగ్నేషన్ ట్రెండ్ నడుస్తోంది.

మనదేశంలో ఇలా..
‘గ్రేట్ రిజిగ్నేషన్’ ట్రెండ్ మనదేశాన్ని కూడా ఒక కుదుపు కుదిపేస్తోంది. ‘మైఖేల్ పేజ్ ఇండియా టాలెంట్ ట్రెండ్స్ 2022’ రిపోర్ట్ ప్రకారం.. దేశంలో వచ్చే ఆరు నెలల్లో 86 శాతం మంది ఉద్యోగులు కొత్త కెరీర్‌ ఎంచుకోవాలని చూస్తున్నారట. కుటుంబంతో ఆనందంగా గడిపేందుకు, ఒత్తిడి తగ్గించుకునేందుకు చాలామంది తక్కువ జీతాలను తీసుకోవడానికి, అవసరమైతే ప్రమోషన్లను సైతం వదులుకునేందుకు రెడీగా ఉన్నారు. దేశంలో 25 నుంచి 40 ఏండ్ల వయసున్న మిలెనియల్స్​లో ఎక్కువమంది ఉద్యోగాలు మారే ఆలోచనలో ఉన్నట్టు పలు సర్వేల ద్వారా తెలుస్తోంది. కిందటేడాది 41 శాతం మంది మిలెనియల్స్ ఉద్యోగాలకు రిజైన్ చేయగా.. వచ్చే ఏడాది లోపు దేశంలో దాదాపు 50శాతం మంది మిలెనియల్స్ ఉద్యోగాలు మారాలనుకుంటున్నారని ‘ఈవై(ఎర్నెస్ట్ అండ్ యంగ్)’ సర్వే చెప్తోంది.‘నమన్ కన్సల్టెన్సీ’ సర్వే ప్రకారం దేశంలో ప్రతి పది మందిలో నలుగురు ఉద్యోగులు జాబ్ మానేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 37 శాతం మంది సర్వీస్ సెక్టార్ ఉద్యోగులు ఉంటే, 31 శాతం మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్​ ఉద్యోగులు, 27 శాతం ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు వదిలేస్తున్న మిలెనియల్స్​లో మాన్యుఫ్యాక్చరింగ్, బీపీఓ, ఫైనాన్షియల్ సెక్టార్, ఐటీ సెక్టార్, ట్రాన్స్​పోర్ట్, కమ్యూనికేషన్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ రంగాలకు చెందినవాళ్లు ఎక్కువగా ఉన్నారు. అమెరికా బేస్డ్  ఐటీ కంపెనీ ‘కాగ్నిజెంట్‌’లో రీసెంట్‌గా 1.2 లక్షల మంది ఉద్యోగులు రిజైన్ చేశారు. దాంతో మ్యాన్‌పవర్‌‌లో 36 శాతం లోటు ఏర్పడింది. ‘సంస్థ చరిత్రలో ఇలాంటి విపత్తు ఇదే మొదటిసారి’ అని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కాగ్నిజెంట్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 3,41,300 మంది ఉద్యోగులున్నారు. 18.5 బిలియన్ డాలర్ల సంపద ఉంది. ఫార్చూన్ జాబితా -2022లో కంపెనీ 154వ స్థానంలో ఉంది. ఇంతటి చరిత్ర ఉన్న ఈ కంపెనీ ప్రస్తుతం ఉద్యోగుల రాజీనామాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇది చూసి ఇతర కంపెనీలు జాగ్రత్త పడ్డాయి. టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్ర, జెన్‌ప్యాక్ట్, క్యాప్‌జెమిని వంటి ఐటీ సంస్థలు ఉద్యోగులకు శాలరీ ఇంక్రిమెంట్లు ఇచ్చాయి.

కొవిడ్ ఎఫెక్ట్


దేశంలో అన్ని రంగాలకు మల్లే ఉద్యోగుల పరిస్థితి కూడా.. ‘బిఫోర్‌ కరోనా.. ఆఫ్టర్‌ కరోనా’ అన్నట్టు మారిపోయింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఉద్యోగం చేసే స్టైల్‌ మారింది. ఇప్పటికీ కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కంటిన్యూ చేస్తున్నాయంటే దాని ఎఫెక్ట్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘వర్క్ చేయాలంటే ఆఫీసుకు కచ్చితంగా వెళ్లాల్సిందే’ అనే రూల్‌ని కరోనా కొట్టిపారేసింది. దీంతో చాలా దేశాల్లో ‘ఆఫీసుకు వచ్చి పని చేయాలి’ అని చెప్పగానే రిజైన్‌ ఇచ్చేస్తున్నారట. రిమోట్‌ వర్క్‌ కల్చర్‌ అందరికీ అలవాటైన ఈ రోజుల్లో ‘ఆఫీసు పని’ అనేది  ఓల్డ్‌ స్టైల్‌ అన్న ఆలోచనలో మిలెనియల్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే చాలామందికి రోజూ ఆఫీసుకు వెళ్లడానికి, తిరిగి రావడానికి కనీసం రెండు గంటలు పడుతుంది. దీంతో ఇంటి నుంచి పని చేసుకుంటే టైంతో పాటు ట్రాన్స్​పోర్ట్ ఖర్చులు కూడా మిగులుతాయన్న భావన కూడా ఉంది. అలాగే కొవిడ్‌కు ముందు రోజులతో పోలిస్తే ఇప్పుడు వర్క్ లోడ్ బాగా పెరిగిందని రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ‘మైఖేల్ పేజీ’  సర్వేలో పాల్గొన్న 57 శాతం ఉద్యోగులు చెప్పారు. ఉద్యోగుల వర్క్​లైఫ్ బ్యాలెన్స్​కు కంపెనీలు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని 88 శాతం మంది అభిప్రాయపడ్డారు.

మిలెనియల్స్ కొత్త ఆలోచనలు
అవసరం.. సౌకర్యం.. జీతం..  ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాలు చేస్తున్నారు మిలెనియల్స్. అవి లేకపోతే ఉద్యోగం మారుతున్నారు. కరోనా తర్వాత చాలామంది ఉద్యోగుల్లో వచ్చిన మార్పు ఇది. లాక్‌డౌన్ ఎఫెక్ట్​తో  చాలామంది పర్సనల్ లైఫ్‌కు తగిన ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. సాధారణంగా జీతం, బోనస్, రివార్డ్స్ వంటి వాటి కోసం జాబ్స్  మారుతుంటారు. అయితే ఇప్పుడు ఉద్యోగుల ఆలోచనలు మారాయి. వర్క్​లైఫ్​ బ్యాలెన్స్ కోసం శాలరీ తక్కువ ఇచ్చే ఉద్యోగాలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. దీనికోసం ఇంక్రిమెంట్లు, బోనస్‌లు సైతం వదులుకుంటున్నారు. సరైన కంపెనీలో జాబ్ వచ్చే వరకూ నిరుద్యోగులుగా ఉండటానికి కూడా చాలామంది రెడీ అయ్యారు. దీంతోపాటు కంపెనీపై అసంతృప్తి, జీతం, ఇండస్ట్రీ మార్పు కోరుకోవడం, కెరీర్ గ్రోత్ కోరుకోవడం లాంటివి చాలామందిని ఉద్యోగాలకు రిజైన్ చేసి కొత్తవాటిని వెతుక్కునేలా చేస్తున్నాయి. 

జాబ్ వదిలేసి ఏం చేస్తున్నారు? 
ఈ మధ్య కాలంలో ఐటీ ఉద్యోగుల్లో కూడా చాలా మార్పు కనిపిస్తోంది. జాబ్ నచ్చలేదంటే లక్షల ప్యాకేజీ ఇస్తామన్నా లైట్‌ తీసుకుంటున్నారు. క్లౌడ్‌ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొవైడర్‌ ‘డిజిటల్‌ ఓషన్‌’ ప్రకారం.. కొవిడ్ టైంలో ఉద్యోగాల్ని అంటిపెట్టుకొని ఉన్న 42 శాతం సాఫ్ట్​వేర్ డెవలపర్‌లు  మరో జాబ్‌కు మారే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. శాలరీ, రిమోట్ వర్క్ ప్లేస్‌లో పనిచేసేందుకు ఇష్టపడడమే అందుకు కారణాలని డిజిటల్ ఓషన్ నివేదిక చెప్తోంది. అంతేకాదు, సంవత్సరానికి పైగా వర్క్ ఎక్స్​పీరియెన్స్‌ ఉన్న డెవలపర్స్​లో నాలుగింట ఒక వంతు మంది కొత్త ఉద్యోగాల్ని ఎంపిక చేసుకున్నట్లు ‘కరెంట్ సర్వే’ పేర్కొంది. వీటితోపాటు ఐటీలో పనిచేసే చాలామంది టీమ్‌గా ఏర్పడి సొంత బిజినెస్‌లు పెడుతున్నారు. ఎంట్రప్రెనూర్స్​గా మారుతున్న ఐటీ వాళ్ల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. లక్షల జీతం వచ్చే ఉద్యోగాలు వదిలి స్టార్టప్స్ పెడుతున్నవాళ్లు కొందరైతే ఫ్రీలాన్సర్స్, డిజిటల్ నోమాడ్స్​లా మారిపోతున్నవాళ్లు మరికొందరు.

కొత్త ట్రెండ్స్
ఉద్యోగుల్లో ‘క్వైట్ క్విట్టింగ్’, ‘మూన్ లైటింగ్’ అనే కొత్త ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. మూన్ లైటింగ్ అంటే ఒక ఉద్యోగి రెండు కంపెనీల్లో ఉద్యోగం చేయడం. కరోనా టైంలో ఇంటి నుంచి పని చేసే అవకాశం రావడంతో చాలామంది పార్ట్ టైం జాబ్స్ లాంటివి మొదలుపెట్టారు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్‌తో పాటు సంపాదన కూడా పెరగడంతో అదే ట్రెండ్‌ను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. రెండు ఉద్యోగాలు చేయడం కుదరకపోతే సంస్థ లేదా జాబ్ రోల్‌ మార్చుకుంటున్నారు.మెరుగైన వర్క్​లైఫ్ బ్యాలెన్స్ కోసం చాలామంది ‘క్వైట్ క్విట్టింగ్’ అనే మరో ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. క్వైట్ క్విట్టింగ్ అంటే నెమ్మదిగా ఉద్యోగం నుంచి జారుకోవడం కాదు. అదనపు పని భారాన్ని తగ్గించుకొని.. కేవలం వాళ్ల పనికే పరిమితం అవ్వడం. అదనపు బాధ్యతల్ని తమ భుజాన వేసుకోకపోవడం. ఆఫీస్ గంటలు అయిపోయాక కాల్స్, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకపోవడం. తమకు అప్పగించిన పనిని మాత్రమే చేయడం ఈ ట్రెండ్. వీటితోపాటు ఈ జనరేషన్ యువతలో కనిపిస్తున్న మరో ట్రెండ్ ఎర్లీ రిటైర్‌‌మెంట్. యువతలో ఎక్కువ శాతం మంది యాభై ఏండ్లు వచ్చేసరికి రిటైర్ అవ్వాలనుకుంటున్నారని కొన్ని స్టడీల్లో తేలింది. దానికోసం సంపాదనలో యాభై శాతం వరకూ పొదుపు చేస్తున్నారు.

కారణాలివే
దేశంలో ఉద్యోగుల మైండ్‌సెట్ మారడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత దేశంలో మార్కెట్‌ అవసరాలు, డిజిటల్‌ ట్రాన్స్​ఫర్మేషన్​ టెక్నాలజీస్ మారిపోయాయి. దాంతో మార్కెట్‌లో కొత్తకొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఉద్యోగులు వాటిని దక్కించుకోవాలనుకుంటున్నారు. దానికోసం ప్రత్యేకంగా కోర్స్​లు నేర్చుకుంటున్నారు. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కొత్త కెరీర్‌‌కు షిఫ్ట్ అవుతున్నారు.  ప్రస్తుతం దేశంలో 38 శాతం మంది ఉద్యోగులు ఒకే కంపెనీలో రెండేళ్లకు మించి పనిచేయడం లేదు. ‘అమెజాన్ ఇండియా’ సర్వే ప్రకారం  ఉద్యోగాలు వెతికేవాళ్లలో 68 శాతం మంది సంస్థ మారే ఆలోచనలో ఉంటే..  51 శాతం మంది తమకు అనుభవం లేని కొత్త రంగాలను ఎంచుకుంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా వృత్తి పరంగా వేగంగా, పైకి ఎదగాలనే కోరిక మిలెనియల్స్ ఉద్యోగుల్లో ఎక్కువగా ఉంది. 25 ఏండ్ల లోపు (జనరేషన్‌ జెడ్‌) ఉద్యోగుల్లో కంపెనీ మారేందుకు ఆసక్తి చూపుతున్న వాళ్లు తక్కువే. అయితే వీళ్లలో మూడింట ఒక వంతు మంది పని గంటలు తగ్గించాలని మాత్రం కోరుకుంటున్నారు.ఉద్యోగాలు మారుతున్న మిలెనియల్స్‌లో 30 శాతం.. అంచనాలకు తగ్గట్టుగా జాబ్ రోల్ లేదని, 29 శాతం.. పని చేసే చోటు జాయ్​ఫుల్‌గా లేదని, 38 శాతం..  ప్రస్తుతం కంటే మంచి ఆఫర్ లభించిందని, సుమారు 50 శాతం..  కొత్త స్కిల్స్ నేర్చుకునేందుకు ఉద్యోగాలు మారుతున్నట్టు చెప్పారు. 43 శాతం మంది తమ రెజ్యుమెలోని వర్క్ ఎక్స్​పీరియెన్స్​ కాలమ్‌లో ఎక్కువ కంపెనీలు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు.  అలాగే చాలామంది కొలీగ్స్, బాస్ నుంచి కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉండట్లేదని అంటున్నారు.  

విమెన్ ఎంప్లాయిస్ ఇలా..


సర్వేల ప్రకారం ఆడవాళ్లలో చాలామంది ఐదేండ్లకు మించి ఉద్యోగాలు చేయడం లేదు. మగవాళ్లతో కలిసి సమానంగా పనిచేస్తున్నా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో సంస్థలు వారికి తగినన్ని అవకాశాలు ఇవ్వట్లేదని చెప్తున్నారు.హెచ్‌సీఎల్‌, ఇన్ఫోసిస్‌, విప్రోలో పనిచేసే ఉద్యోగుల్లో నలుగురిలో ఒక మహిళ ఉంటారు.  కానీ బాస్, టీం లీడర్ పదవుల్లో ఉన్న ఆడవాళ్లు మాత్రం అతికొద్ది మందే. ఇన్ఫోసిస్‌లో సీనియర్‌ మేనేజర్‌ స్థాయిలో ఉన్న ఆడవాళ్లు 4.8 శాతమే. ఇంక్రిమెంట్ల విషయంలో కూడా మగవాళ్లకు, ఆడవాళ్లకు చాలా తేడా కనిపిస్తుంది.ఉద్యోగాల్లో చేరేటప్పుడు సగం మంది ఆడవాళ్లను తీసుకుంటుంటే..  అందులో 25 శాతం మంది మాత్రమే మేనేజర్‌ స్థాయి పోస్టుల వరకు వెళ్లగలుగుతున్నారు. కేవలం ఒక్కశాతం మంది మహిళలే బోర్డు స్థాయికి చేరుకుంటున్నారు. 80 శాతం కంపెనీల్లో 20 శాతం మహిళలు మాత్రమే సీనియర్‌ లెవల్‌ మేనేజర్‌ స్థాయిలో పనిచేస్తున్నట్టు ‘నాస్కామ్‌’ సర్వే చెప్తోంది. తమతో పాటే సంస్థలో చేరిన మగవాళ్లు త్వరగా ప్రమోషన్స్ పొందడం, ఏండ్లుగా పనిచేస్తున్నా తమ పొజిషన్స్ మారకపోవడం కూడా వాళ్లను ఇబ్బంది పెడుతోంది. అలాగే ఇరవై ఐదేండ్ల లోపు వయసులోనే ఉద్యోగంలో చేరిన కొంతమంది అమ్మాయిలు.. ముప్పై ఏండ్ల తర్వాత పెండ్లి, పిల్లల బాధ్యతల వల్ల వాటిని వదిలేయాల్సి వస్తోంది. ఇవి కాకుండా జాబ్‌లో భాగంగా వేరే రాష్ట్రాలు, దేశాలకు పంపిస్తుండటం, పైస్థాయి ఉద్యోగుల వేధింపులు, పనివేళలు లాంటి సమస్యలు కూడా ఆడవాళ్లు ఉద్యోగాలు మానేయడానికి కారణమవుతున్నాయి.

ప్రాబ్లమ్ ఇదే..
వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలామంది టెన్షన్ లేని ఉద్యోగాలకు అలవాటు పడ్డారు. డబ్బుతోపాటు ఆరోగ్యం కూడా ముఖ్యమనే సంగతి తెలుసుకున్నారు. ప్రమోషన్ల వెంట పడడం తగ్గించుకున్నారు. దీంతో పని ఒత్తిడి పెరిగితే  ముందూ వెనకా ఆలోచించకుండా రాజీనామా చేసేస్తున్నారు. కొత్త ఉద్యోగంలో కోరుకున్న జీతం లేకపోయినా.. అడ్జస్ట్ అయిపోవడం మొదలైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్న యువతలో 9 శాతం మంది మాత్రమే ఇష్టపూర్వకంగా  పనిచేస్తున్నారనీ, 42 శాతం మంది బయటకు వెళ్లాలని చూస్తున్నారనీ స్టడీలు చెప్తున్నాయి. ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచేందుకు మనదేశం యువతపైనే ఎక్కువ ఆధారపడింది. కానీ యువత యాక్టివ్‌గా పనిచేయకపోతే  అది సాధ్యం కాదు. 2017 నుంచి 2022 మధ్య మొత్తం వర్క్​ఫోర్స్​ రేటు 46 శాతం నుంచి 40 శాతానికి పడిపోయింది. దాదాపు 21 మిలియన్ల మంది వర్క్​ఫోర్స్‌ నుంచి అదృశ్యమయ్యారు. మహిళల్లో ఈ రేటు మరింత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం దేశ జనాభాలో కేవలం 9 శాతం మందికి మాత్రమే కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి.  ‘సీఎమ్ఐఈ(సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ)’ లెక్కల ప్రకారం.. దేశంలో 18 ఏండ్లు దాటిన 9 కోట్ల మంది యువతలో సగానికి పైగా పనిచేయడానికి రెడీగా లేరు. ప్రస్తుతం దేశంలో లిడో లెర్నింగ్, మైక్రో సాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్, ట్విటర్, అనకాడెమీ, మీషో, బ్లింక్‌ఇట్, ట్రెల్, ఓలా, వేదాంత, కార్స్ 24, హిందుస్తాన్ యునిలివర్, బైజూస్ లాంటి సంస్థలన్నీ ఉద్యోగుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వీటితో పాటు కొత్తగా ఏర్పాటైన స్టార్టప్స్, రిటైల్ సంస్థలు, హాస్పిటాలిటీ రంగాలు కూడా ఉద్యోగులు లేక ఇబ్బందులు పడుతున్నాయి.

సంస్థలు ఏమంటున్నాయి?
వెంటవెంటనే ఉద్యోగాలు మారడం వల్ల సంస్థలతో పాటు ఉద్యోగులకూ నష్టమే అంటున్నాయి కంపెనీలు.  ఒక ఉద్యోగి ఏడాది పాటు కూడా ఉద్యోగంలో ఉండకపోతే అతనిని రిక్రూట్ చేసుకోవడం వృథా అనీ, కనీసం ఏడాది పాటు ఒకే ఉద్యోగం చేయడం అనేది  పని పట్ల వారికున్న కమిట్‌మెంట్‌ను సూచిస్తుందనీ అంటున్నారు పలు కంపెనీల హెచ్‌ఆర్‌‌లు. ఇదిలా ఉంటే.. ‘తక్కువ టైంలో ఉద్యోగాలు మారుతున్న వాళ్లని పెద్దగా తప్పుపట్టనక్కర్లేదు. అలా మారడానికి తగిన కారణాలు వివరిస్తే దాన్ని లోపంగా భావించాల్సిన పనిలేద’ని ఆక్స్​ఫర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్లు అంటున్నారు.  “కొత్త ఉద్యోగం వెతుక్కుంటున్నప్పుడు పాత ఉద్యోగంలో ఏడాది పాటు ఏమేమి చేశారో వివరంగా చెప్పాల్సి ఉంటుంది. టీమ్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వదిలేశారా? పనులన్నీ సరిగ్గా అప్పగించి వచ్చారా? వెళ్లిపోతున్న విషయాన్ని ముందే సంస్థ యజమానులకు చెప్పారా? ఏడాది లోపే ఉద్యోగాన్ని వదిలిపెట్టినా అది సక్రమంగా చేశారా? లేదా? అనేది కొత్త కంపెనీ యజమానులు చూస్తారు. ఈ వివరాలన్నీ ఒప్పించేటట్లు ఉంటే ఉద్యోగుల కమిట్‌మెంట్‌పై అనుమానాలు రావు. ఏదేమైనా ఉద్యోగుల పనితీరు మెరుగుపడడానికి, టీంతో కలిసి పనిచేయడానికి, ఎంచుకున్న రోల్‌లో రాణించడానికి.. నిలకడ అవసరం” అని వాళ్లంటున్నారు.

సొల్యూషన్ ఇలా..
రిజిగ్నేషన్‌ల సంఖ్యను తగ్గించాలంటే సంస్థలతో పాటు ఉద్యోగులు కూడా కొన్ని విషయాలు గమనించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఉద్యోగుల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా కంపెనీలు  వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి.  ఉద్యోగుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా పాలసీల్లో మార్పులు చేయడం గురించి ఆలోచించాలి.ఉద్యోగుల పనిని చూసే విధానంలో కరోనా అనేక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఉద్యోగులు వర్క్​లైఫ్ బ్యాలెన్స్, పనిగంటలు, వర్క్‌ ఫ్లెక్సిబిలిటీ ఇలా అన్నింటిలో తమకు నచ్చిన విధంగా సంస్థలు ఉండాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయా సంస్థలు దృష్టిలో పెట్టుకోవాలి.పనిచేసే చోట ఆడవాళ్లకు ఉండే సమస్యలను తగ్గించాలి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో ఎటువంటి తేడా చూపించకూడదు. ఉద్యోగుల విషయానికొస్తే.. నిలకడ లేని వాళ్లని ఉద్యోగంలోకి తీసుకోవడానికి ఏ సంస్థా ఇష్టపడదు. ఒక సంవత్సరం లోపే ఉద్యోగం వదిలి వెళ్లిపోయేవాళ్లపై సంస్థలు  బోలెడంత టైమ్, డబ్బు ఖర్చు పెట్టాలని అనుకోవు.  అందుకే చేస్తున్న ఉద్యోగం విషయంలో ఎన్ని ఇబ్బందులున్నా.. కనీసం  ఒక ఏడాది పాటు అందులో ఉండేందుకు ట్రై చేయాలి. ఉద్యోగం వదిలేయాలనుకున్నప్పుడు వెంటనే రిజైన్ చేయకుండా పరిస్థితిని మేనేజ్‌ చేసే అవకాశం ఉందేమో ఆలోచించాలి. పై అధికారి లేదా మేనేజర్‌తో మాట్లాడాలి. షెడ్యూల్‌ మార్పు చేసుకోవడం, వర్క్​లోడ్‌ తగ్గించమని అడగడం వంటివి చేయాలి. ఉద్యోగం మానేయడానికి కారణం ఆఫీసులో పరిస్థితులా? లేక ఇతర కారణాలా? అనేది ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. పర్సనల్ రీజన్స్ కారణంగా జాబ్‌ వదిలేయడం వల్ల ఆ సమస్యకు పరిష్కారం దొరకదు.కెరీర్‌‌ను మార్చాలనుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కెరీర్‌ మార్చడం అంటే మళ్లీ మొదటి నుంచీ మొదలుపెట్టడమే. కాబట్టి ఆ నిర్ణయం ఆచితూచి తీసుకోవాలి. జాబ్‌ వదిలేస్తే వచ్చే ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా ఆలోచించుకోవాలి. కొత్త ఉద్యోగంలో చేరే వరకు ఇంటి ఖర్చులు ఎలా మేనేజ్ చేయొచ్చో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే కెరీర్ లేదా కంపెనీ మారాలన్న  నిర్ణయం గురించి కుటుంబసభ్యులతో డిస్కస్ చేయడం అవసరం.

శాటిస్‌‌ఫాక్షన్ ఉంటేనే..
సొసైటీలో గుర్తింపు, కుటుంబ పోషణ కోసం చాలామంది జాబ్‌‌లో చేరుతున్నప్పటికీ పని ఒత్తిడి, చేసే పనిలో సంతృప్తి లేకపోవడం వల్ల వేరే రంగాన్ని ఎంచుకోవాల్సి వస్తోంది. ప్రైవేట్ రంగంలో జాబ్ సెక్యూరిటీ అంతగా ఉండట్లేదు. అందుకే సాఫ్ట్‌‌వేర్, టీచింగ్, రియల్ ఎస్టేట్ లాంటి  ప్రైవేట్ రంగాలలో పనిచేసే వాళ్లు జాబ్స్ ఎక్కువగా మానేస్తున్నారు. ఉద్యోగం, కెరీర్ విషయంలో ఎక్కువగా  శాలరీ, వర్క్ కంఫర్ట్, వర్క్ శాటిస్‌‌ఫాక్షన్ ఉండేలా చూసుకుంటున్నారు ఇప్పటి యూత్ అంతా. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, కెరీర్ గ్రోత్‌‌కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఉద్యోగం లేదా కెరీర్ మారాలనుకోవడంలో కొవిడ్ ఎఫెక్ట్ కచ్చితంగా ఉంది. ఒక సంస్థలో ఏండ్ల తరబడి పనిచేసే ఆలోచన ఇప్పుడు మారిపోయింది. సంవత్సరం లేదా ఆరునెలల ఎక్స్‌‌పీరియెన్స్ చాలు అనుకుంటున్నారు.  - మావురం సంధ్య, ఎక్స్‌‌సియేస్సి స్యాప్ హెచ్‌‌.ఆర్., పెద్దకురుమపల్లి, చొప్పదండి, కరీంనగర్ జిల్లా

కష్టపడ్డా ప్రమోషన్ రాకపోవడంతో..


బయట రాజకీయాల్లాగానే చాలా కంపెనీల్లో  ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి. వాటి వల్ల కొంతమంది ఉద్యోగులు ఇబ్బందిపడాల్సి వస్తోంది. నేను ఎంత కష్టపడ్డా ప్రమోషన్ ఇవ్వకపోవడంతో పనిచేయడం ఇష్టంలేక రెండు కంపెనీలు మారా. శాలరీ ఎక్కువ ఇచ్చినప్పటికీ  పాలిటిక్స్ వల్ల సరిగా పనిచేయలేకపోతున్నా. మునుపటి కంపెనీలు నేను నేర్చుకున్న టెక్నాలజీకి సంబంధించిన వర్క్ కాకుండా వేరే వర్క్ ఇవ్వడం కొంత ఇబ్బంది అనిపించింది. వర్క్ నేర్చుకోవాలనే తపనతో ఆ ఉద్యోగంలో చేరా. కానీ అక్కడ నేర్చుకోవడానికి స్కోప్ లేదని తెలిశాక పనిచేయాలనిపించలేదు. గతంలో బెంగళూరులో హెచ్‍సీఎల్‍ కంపెనీలో లీడ్ ఇంజనీర్‌‌‌‌గా పని చేసేవాడ్ని. ఇప్పుడు పొజిషన్ గ్రోత్‍ చూసుకొని హైదరాబాద్‌‌లోని ఓ పెద్ద కంపెనీలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌‌గా చేరాను. - బేరుగు రమేష్, శాయంపేట, హనుమకొండ 

మామూలుగా జీతాలు, బోనస్‌లు, రివార్డ్​ల పేరుతో సంస్థలు ఉద్యోగుల్ని ఆకర్షిస్తుంటాయి. అయితే ఇప్పటి ఉద్యోగులు వాటికి బదులు డబ్బుతో సంబంధంలేని ‘నాన్‌ మానిటరీ రివార్డ్స్‌’ కోరుకుంటున్నారు. అంటే ప్రమోషన్‌, ఫ్లెక్సిబుల్‌ టైమింగ్స్‌, హెల్త్​కేర్‌ బెనిఫిట్స్‌, ఇన్సూరెన్స్‌ పాలసీ, కంపెనీ స్టాక్స్​లో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్‌ లాంటివి కావాలంటున్నారు. ఇలాంటి బెనిఫిట్స్ ఉంటే శాలరీ తక్కువ ఉన్నా జాబ్‌కు ‘ఓకే’ అంటున్నారు.


శాలరీ కోసం సంస్థలు మారుతున్నా..
డిగ్రీ వరకు చదివినా ఆర్థిక సమస్యలతో పైచదువులు మానుకున్నా.  కుటుంబానికి ఆసరా కోసం షాపింగ్​ మాల్​లో సేల్స్ బాయ్‌గా జాయిన్ అయ్యా. నెలకి  పదివేలు శాలరీ. రోజూ సిటీకి  బైక్‌పై వచ్చి పని చేయాలి. సగం శాలరీ పెట్రోల్ ఖర్చులకే సరిపోయేది. అందుకే ఆ ఉద్యోగం మానేసి ఫ్లిప్‌కార్ట్​ సంస్థలో చేరా. ఏడాదిగా ఇందులోనే పనిచేస్తున్నా. ఇక్కడ శాలరీ రూ. 16 వేలు వస్తుంది. ఎక్కువ శాలరీ వస్తుందంటే మరో చోట చేరతా.  తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించేందుకే ఈ  కష్టమంతా. 
మాదం మహేష్.డిచ్‌పల్లి, నిజామాబాద్ జిల్లా.

ప్యాకేజీ,  ప్రమోషన్‍ కోసమే..
ఐటీ జాబ్స్‌‌కు మంచి డిమాండ్ ఉంటుంది. పోటీ కూడా ఎక్కువే. నాకు 23 ఏండ్లకే మంచి సాఫ్ట్‌‌వేర్‍ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇందులో ఉండే వర్క్ ప్రెజర్‍, టెన్షన్లు చూస్తుంటే  మిగతా ఉద్యోగాల్లా 60 నుంచి 65 ఏండ్లు పనిచేయలేమని అర్థమైంది. ఇప్పుడు నాకు 30 ఏండ్లు. మహా అంటే 45 నుంచి 50 ఏండ్ల వరకు చేయడం గ్రేట్‍ అనుకోవచ్చు. అందుకే ఉన్నన్ని రోజులు గ్రోత్‍ కోసం ఆరాటపడక తప్పట్లేదు. అందుకే ఒక కంపెనీలో సిన్సియర్‍గా  రెండు, మూడేండ్లు పనిచేయడం.. ఆ ఎక్స్‌‌పీరియెన్స్‌‌తో మరో కంపెనీలో నచ్చిన ప్యాకేజీ డిమాండ్‍ చేసి, ప్రమోషన్ తీసుకోవడం కామన్‍ అయింది.  ఒక్కోసారి ఎంత కష్టపడ్డా బాస్‍ మనపై పాజిటివ్‍ ఫీడ్‍బ్యాక్‍ ఇవ్వకుంటే గ్రోత్‍ ఆగిపోతుంది. అందుకే ఒక కంపెనీనే నమ్ముకోకుండా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకున్నట్లు వయసు ఉన్నప్పుడే నాలుగు రూపాయలు సంపాదించుకుంటే మంచిదనిపిస్తుంది. 
- కర్ర రణధీర్‍,  వరంగల్

ప్రశాంతత ముఖ్యమని..
ఎంబీఏ పూర్తయ్యాక  హైదరాబాద్‌‌లో మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. ఏడాది తర్వాత బెంగళూరులో మరో మంచి ఆఫర్ వచ్చింది. కెరీర్ గ్రోత్ కోసమని అందులో చేరా. కానీ, పొజిషన్, రోల్ పెరిగేకొద్దీ స్ట్రెస్ ఎక్కువ అవుతుందని తర్వాత అర్థమైంది. దీనికి తోడు ఆఫీస్ పాలిటిక్స్.  ఆఫీసులో ఒకరంటే ఒకరికి పడదు. చాడీలు చెప్పుకునేవాళ్లు. వీటివల్ల నా వర్క్​లైఫ్‌‌తో పాటు పర్సనల్‌‌ లైఫ్‌‌ కూడా డిస్టర్బ్‌‌ అయింది. అందుకే ఉద్యోగం, జీతం కంటే మానసిక ప్రశాంతత ముఖ్యమని ఉద్యోగం మానేశా. ప్రస్తుతం ఖాళీగా ఉన్నా. వర్క్ ప్రెజర్ లేని ఉద్యోగం వచ్చినప్పుడు మళ్లీ జాయిన్ అవుతా.
- రమ్య, బెంగళూరు

మైండ్‌సెట్ ఇలా ఉంది

  • వర్క్ స్ట్రెస్ భరించడం కన్నా జాబ్ వదిలేయడం మేలు.
  • జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటేనే జాబ్.
  • కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉన్న సంస్థకే ఫస్ట్ ప్రిఫరెన్స్.
  • పనిచేసే చోట ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, రిమోట్ వర్కింగ్, హైబ్రిడ్ వర్క్ లాంటి సౌకర్యాలుంటే బాగుంటుంది. 
  • ఎక్కువ జీతం కంటే మెరుగైన వర్క్ లైఫ్ బ్యాలెన్సే ముఖ్యం.

పనిచేసే చోట పాలిటిక్స్ మాకొద్దు.

పాపులర్ నెట్‌‌వర్క్‌‌ సైట్ ‘లింక్డిన్‌‌’  దేశంలో రకరకాల ఉద్యోగాలు చేస్తున్న  2,266 మంది విమెన్ ఎంప్లాయిస్ నుంచి అభిప్రాయాలు సేకరించి ఓ రిపోర్ట్  విడుదల చేసింది. మనదేశంలో ముఖ్యంగా మహిళా ఉద్యోగుల పట్ల సంస్థల వైఖరి సరిగా లేదని, దాంతో వర్క్ లైఫ్‌‌లో మహిళలకు అనేక ఇబ్బందులు ఉంటున్నాయని నివేదిక  తేల్చింది. పని ప్రదేశాల్లో ఆడవాళ్లపై వివక్ష ఉందని, ఉద్యోగాల నుంచి తొలగిస్తారేమోననే భయంతో చాలామంది పనిచేస్తున్నారని ఆ రిపోర్ట్‌‌లో వెల్లడైంది. ప్రమోషన్లు లేకపోవటం, ఎక్కువ పని గంటలు ఉండటం, శాలరీ కటింగ్స్, సీనియర్స్‌‌ నుంచి వివక్ష.. లాంటివి ఎక్కువ శాతం మహిళా ఉద్యోగులను వేధిస్తున్న సమస్యలు. కరోనా టైంలో ప్రతి 10 మంది మహిళల్లో 8 మంది మెరుగైన ఉద్యోగం వెతుక్కోవాలని భావించారట. పనిచేసే చోట ఫ్లెక్సిబుల్‌‌ టైమింగ్ లేదన్న కారణంతో దాదాపు 70శాతం మంది ఉద్యోగాల్ని వదిలేశారు. ఉద్యోగం చేస్తున్నప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఉద్యోగంలో పైకి ఎదగడం లాంటివి ఆశిస్తున్నామని ఎక్కువమంది ఆడవాళ్లు అభిప్రాయపడ్డారు.
::: తిలక్​