యూపీఐ ప్లాట్ ఫామ్ ఇటీవల పలు మోసాలు జరిగినందున అప్రమత్తంగా ఉండాలంటూ ఈ నెల 14న ఆర్‌బీఐ ఆర్థిక సంస్థలకు నోటీసులు పంపించింది. ఇందులోని వివరాలప్రకారం..  కొందరు మోసగాళ్లు బ్యాంకు ఉద్యోగలుగా చెప్పుకుంటూ ఎనీ డెస్క్ అనే మొబైల్ యాప్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని వినియోగదారులకు సూచిస్తున్నారు. దీనిని ఇన్ స్టాల్ చేసుకోగానే పాస్ వర్డ్‌లు, ఓటీపీలు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయని ఆర్‌బీఐ సైబర్ అండ్ ఐటీ ఎగ్జామినేషన్ సెల్ హెచ్చరించింది. యూపీఐగాక ఇతర పేమెంట్ అప్లికేషన్ల నుంచి డబ్బును దొంగిలించవచ్చని తెలిపింది.
యూపీఐ ప్లాట్ ఫారాలకేగాక, ఇతర మొబైల్ పేమెంట్ సంస్థలకూ ఆర్‌బీఐ నోటీసులు పంపిందని యూపీఐ నిర్వాహక సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ యాప్ ను తొలగించాల్సిందిగా గూగుల్ ప్లే వంటి యాప్ స్టోర్లకు ఆదేశాలు చేయలేమని, అయితే ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తామని చెప్పారు. హైకోర్టు న్యాయవాది, సైబర్ నిపుణుడు కూడా అయిన ప్రశాంత్ మాలి మాత్రం విభిన్నంగా స్పందించారు. నకిలీ యాప్ లు వినియోగదారుల సమాచారాన్ని దొంగిలించినట్టు ఎక్కడా ఫిర్యాదు రాలేదని అన్నారు. ‘‘ఒకవేళ ఇలాంటి యాప్స్‌తో డబ్బు పోగొట్టుకున్న వాళ్లు కూడా ఆ విషయాన్ని బయటపెట్టలేరు. ఎందుకంటే మోసగాడు పంపించిన లింక్ ద్వారా యాప్ డౌన్ లోడ్ చేయడం వారి తప్పిదమే అవుతుంది. బ్యాంకులు/ఫైనాన్స్ కంపెనీలు ఎంతమాత్రమూ జవాబుదారీ కావు’’ అని ఆయన వివరించారు. యూపీఐ అప్లికేషన్ నిర్వాహక సంస్థలు కస్టమర్ల డేటా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ, ఎన్సీపీఐ గత నెల కూడా నోటీసులు జారీ చేశాయి. ఎలాంటి చార్జీలూ లేకుండా క్షణాల్లో డబ్బు పంపడం, స్వీకరించడం యూపీఐ యాప్స్‌తో సాధ్యమవుతుంది. మనదేశంలో వీటి సేవలను 2016 ఏప్రిల్ లో ప్రారంభించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ.6.4 లక్షల కోట్ల విలువైన 388 కోట్ల లావాదేవీలు జరిగాయి.
