పెన్షన్లు ఇచ్చేది వాలంటీర్లు కాదు.. సచివాలయ ఉద్యోగులు : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

పెన్షన్లు ఇచ్చేది వాలంటీర్లు కాదు.. సచివాలయ ఉద్యోగులు : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచకా నిర్ణయాలు అమలు చేస్తూ పాలనాపరమైన ప్రక్షాళన దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే మంత్రులంతా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో సోమవారం ఏపీ క్యాబినెట్ భేటీ అయ్యింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది క్యాబినెట్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు సంతకం పెట్టిన 5కీలక ఫైళ్లకు ఆమోదం తెలిపింది ఏపీ క్యాబినెట్.

క్యాబినెట్ నిర్ణయాల్లో ప్రధానమైంది పెన్షన్ పంపిణీ. ఇటీవల పెన్షన్ పథకానికి ఎన్టీఆర్ ఆసరాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇవాళ జరిగిన క్యాబినెట్ భేటీలో పెంచిన 4వేల రూపాయల పెన్షన్ తో పాటు ఏప్రిల్ నుండి నెలకు వెయ్యి రూపాయల చొప్పున మొత్తం 7వేల రూపాయల పెన్షన్ ను జూలై 1న ఇంటి వద్దకే పంపిణీ చేయాలని నిర్ణయించింది.

అయితే, పెన్షన్ ను వాలంటీర్లతో కాకుండా సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొలుసు పార్థసారధి మీడియా సమావేశంలో తెలిపారు. వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు మంత్రి పార్థసారధి.