
- .కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
న్యూఢిల్లీ, వెలుగు: పోలవరం–బనకచర్ల (పీబీ) లింక్ ప్రాజెక్టుకు అనుమతులివ్వాలని కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఒత్తిడి పెంచారు. బుధవారం కేంద్ర జలవనరుల శాఖ నేతృత్వంలో రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీకి గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఉందని, అందువల్ల త్వరితగతిన ఈ ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలగించాలని కోరారు. రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు నీటిని తరలించేందుకు కీలకమైన పీబీ లింక్ ప్రాజెక్టు అవసరమని తెలిపారు.
పోలవరం నుం చి కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ వరకూ 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ఈ లింక్ ప్రాజెక్టు ప్రతిపాదించినట్లు తెలిపారు. అనుసంధాన ప్రాజెక్టు పూర్తి అయితే కరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి దక్కే ఫలితాలను అమిత్ షాకు ఆయన వివరించారు. గోదావరి నదిలో ఎగువ, దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 రోజుల మిగులు జలాలు ఉంటాయని తెలిపారు. నదీ ప్రవాహ మార్గంలో చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని స్పష్టం చేశారు.
కేంద్రం సహకారంతో రాష్ట్రం లో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని తెలిపారు. అయితే, ఇప్పటికీ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక వనరుల కొరతను ఎదుర్కొంటున్నదని, కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని కోరారు. విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని నిధులు కేటాయించేలా చూడాలని 16వ ఆర్థిక సంఘా నికి నివేదించామని అమిత్ షాకు వివరించారు. అంతకుముందు ఢిల్లీలోని ఏపీ సీఎం నివాసంలో నీతి ఆయోగ్ సభ్యులు వి.కె.సారస్వత్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు. రాయలసీమ ప్రాంతంలో డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని, ఈ పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ఆ రంగంలో పరిశ్రమలు, పెట్టుబడులు సాధించేందుకు అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు.