
- నా వ్యాఖ్యలను వక్రీకరిస్తే సహించను
- జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వార్నింగ్
జడ్చర్ల టౌన్, వెలుగు: ఏపీ సీఎం చంద్రబాబు కోవర్ట్ లు తెలంగాణలో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు.. కేవలం కాంట్రాక్టర్లను ఉద్దేశించి మాత్రమే అని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. తమ నేతలపై ఎలాంటి కామెంట్స్ చేయలేదని స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో వివరణ ఇచ్చారు. తెలంగాణలో చంద్రబాబుకు చెందిన వ్యక్తులు కాంట్రాక్టర్లుగా ఉన్నారని, వారే ఇరిగేషన్ ప్రాజెక్టులు, పెద్ద రోడ్డు కాంట్రాక్టర్లు, హైదరాబాద్ లో దందాలు చేస్తున్నారని చెప్పారు.
ఇక్కడ వారిపై ఒత్తిడి తెస్తే.. చంద్రబాబు వద్దకు వెళ్లి బనకచర్ల ప్రాజెక్టును ఆపుతారని మాత్రమే చెప్పానని తెలిపారు. కేటీఆర్ తో సహా కొందరు విపక్ష నేతలు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఖండించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చారనేది గుర్తుపెట్టుకోవాలని, ఆయనను కూడా చంద్రబాబు కోవర్టుగా పరిగణించాలా..? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తన వీడియోను పూర్తిగా చూడకుండా వక్రీకరించడం సబబు కాదని హితవు పలికారు. తనపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదని ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు.