
చంద్రబాబుకు ఎందుకు సీఎం కుర్చీ ఇవ్వాలని ప్రశ్నించారు ఏపీ సీఎం జగన్. మంచి చేస్తుంటే అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదేనన్నారు. అధికారంలోకి వస్తే ఎవర్నీ వదలబోమంటూ బెదిరిస్తున్నారని.. అలాంటి వ్యక్తి సీఎం అయితే మంచి జరుగుతుందా? ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. తాము అమలు చేస్తున్న పథకాలు చూసి ప్రతిపక్షాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయని అన్నారు.
అమలాపురంలో పర్యటించిన జగన్ .. వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ నిధులు జమ చేశారు. మహిళల ఖాతాల్లోకి నాలుగో విడుత నిధులు జమ చేశారు. 1.05 కోట్ల మంది మహిళలకు బ్యాంకుల్లో జమ చేశారు. ఇది అక్కాచెల్లెళ్ల సాధికారత పథకం అని .. అక్కా చెల్లెళ్లు సంతోషంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు జగన్. తమది మహిళ పక్షపాత ప్రభుత్వమని .. గత ప్రభుత్వంలో అక్కాచెల్లెళ్లను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. తమ ప్రభుత్వం అక్కాచెల్లెళ్లకు తోడుగా ఉంటుందన్నారు. 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. అక్కాచెల్లెమ్మల పేరు మీద 30 లక్షల పట్టాలు ఇచ్చామని చెప్పారు.
నవరత్నాల అమలుతో మార్పు కనిపిస్తోందన్నార జగన్. ఇలాంటి పథకాలు చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు. పథకాల అమలుతో ప్రతిపక్షాలకు నిద్రపట్టడం లేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం ఉందా? అని ప్రశ్నించారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం వద్దన్న చరిత్ర చంద్రబాబుదన్నారు. పేదలకు ఇంటి స్థలం ఇద్దామంటే వద్దన్న చరిత్ర చంద్రబాబుదేనన్నారు.