ట్రిబ్యునల్​పై ఏపీ కిరికిరి.. కేంద్ర గెజిట్​ను అడ్డుకునేందుకు కుట్ర

ట్రిబ్యునల్​పై ఏపీ కిరికిరి.. కేంద్ర గెజిట్​ను అడ్డుకునేందుకు కుట్ర
  • కృష్ణా నీళ్ల పంపకాలను రెండు రాష్ట్రాలకే పరిమితంచేయడం సరికాదంటూ వాదన
  • ప్రధాని మోదీకి జగన్ లేఖ.. అమిత్​షానూ కలిసి కంప్లయింట్
  • న్యాయమైన వాటా ఇవ్వాల్సిందేనంటున్న తెలంగాణ
  • ప్రాజెక్టుల వారీగా పంపకాలు వద్దని, క్యాచ్ మెంట్ ఏరియా లెక్కన చేపట్టాలని డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నీళ్ల పంచాదిని పరిష్కరించాలని బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు కేంద్ర ప్రభుత్వం రిఫర్ చేయగా... ఏపీ మళ్లీ కిరికిరి మొదలుపెట్టింది. కృష్ణా బేసిన్​లో నాలుగు రాష్ట్రాలు ఉండగా, నీటి పంపకాలను రెండు రాష్ట్రాలకే ఎలా పరిమితం చేస్తారని వాదిస్తోంది. ఇది తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని పేర్కొంటూ ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్​షానూ కలిసి ఫిర్యాదు చేశారు. ట్రిబ్యునల్​ తదుపరి చర్యలు చేపట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేవలం రెండు రాష్ట్రాల మధ్యే నీటి పంపకాలు చేపట్టడం అశాస్త్రీయమని పేర్కొన్నారు. అయితే అమిత్ షాను జగన్​ కలిసిన కొన్ని గంటల్లోనే నీటి పంపకాలపై బ్రజేశ్​కుమార్​ ట్రిబ్యునల్​కు టర్మ్స్​ ఆఫ్​ రెఫరెన్స్​(టీవోఆర్) ఇస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ ​నోటిఫికేషన్​ జారీ చేసింది. 

ఈ క్రమంలో దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. కేంద్ర నిర్ణయం న్యాయ విరుద్ధమని, దీనిపై తమకున్న అవకాశాలన్నీ ఉపయోగించుకుంటామని చెప్తోంది. బచావత్​ట్రిబ్యునల్​ కేటాయింపులకు భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ ఏపీ సర్కార్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరోవైపు కృష్ణా నీళ్లలో న్యాయమైన వాటా కోసం ఎందాకైనా వెళ్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటికైనా ట్రిబ్యునల్​కు రిఫర్ చేయడం అభినందనీయమని, దశాబ్దాలుగా తమకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కేంద్రాన్ని తెలంగాణ కోరుతోంది. 

క్యాచ్ మెంట్ ఏరియా లెక్కన పంపిణీ జరగాలి: తెలంగాణ 

కృష్ణాలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్​లో పేర్కొంది. ఈ లెక్కన తెలంగాణ ఏర్పడే నాటికి ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నా ఏపీకే ఎక్కువ నీటిని కేటాయించే ప్రమాదముందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టుల ప్రాతిపదిక కాకుండా దుర్భిక్షం, క్యాచ్​ మెంట్​ ఏరియా (నదీ ప్రవాహ ప్రాంతం), సాగుభూమి  ప్రాతిపదికగా నీళ్ల పంపకాలు చేయాలని డిమాండ్​ చేస్తోంది. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్​ఎదుట ఇవే వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతోంది. మిగులు జలాల పంపిణీలోనూ తెలంగాణకే ఎక్కువ వాటా దక్కాలని అంటోంది. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే నీటిలో నాగార్జునసాగర్​కు ఎగువన ఉమ్మడి ఏపీకి దక్కే 45 టీఎంసీల్లో 40 టీఎంసీలను శ్రీశైలం లెఫ్ట్​బ్యాంక్​కెనాల్​టన్నెల్​ప్రాజెక్టుకు కేటాయించారు. ఈ లెక్కన 40 టీఎంసీలు తమకే ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. ఆ 40 టీఎంసీలకు తోడు మళ్లింపు నీటిలో మిగిలిన 5 టీఎంసీలను కూడా కలుపుకొని 45 టీఎంసీలను పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్​స్కీమ్ కు కేటాయిస్తూ జీవో ఇచ్చింది. ఈ నీటిపైనా ట్రిబ్యునల్​ వద్ద గట్టి వాదనలకు తెలంగాణ సిద్ధమవుతోంది. మరోవైపు శ్రీశైలంపై ఆధారపడి ఏపీ ప్రభుత్వం 320 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లను రాయలసీమ ప్రాంతంలో నిర్మించింది. వాటికి హక్కుల కోసం ఏపీ వాదనలకు రెడీ అవుతోంది.

అదనపు జలాలే పంపిణీ చేయాలి: ఏపీ 

జస్టిస్​ బచావత్​ నేతృత్వంలోని కృష్ణా వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)​–1 ఉమ్మడి ఏపీకి 75% డిపెండబులిటీ వద్ద (వందేండ్లలో 75 ఏళ్లు వచ్చే వరద ఆధారంగా) కృష్ణా నదిలో 2,130 టీఎంసీల నీటి లభ్యత ఉందని లెక్క తేల్చి 1976 మే 31న నివేదిక ఇచ్చింది. ఇందులో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించింది. ఈ నీటిని ప్రాజెక్టుల వారీగా కాకుండా ప్రాంతాల వారీగా చేయడంతో ఏపీ నీటి వినియోగంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లను మళ్లించుకుంటూ  కృష్ణా బేసిన్​ అవతల ఉన్న రాయలసీమకు శ్రీశైలం నీటిని మళ్లిస్తోంది. దీంతో తమకు న్యాయమైన వాటా దక్కడం లేదని తెలంగాణ మండిపడుతోంది. 

కృష్ణా నదిలో 2,130 టీఎంసీల కన్నా అదనంగా లభ్యమయ్యే నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉమ్మడి ఏపీకి ట్రిబ్యునల్​ఇచ్చింది. ఇంటర్ ​స్టేట్​ వాటర్​ డిస్ప్యూట్స్ యాక్ట్–1956లోని సెక్షన్​6(1) ప్రకారం బచావత్​ ట్రిబ్యునల్ రిపోర్టు.. సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని ప్రధాని మోదీకి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. 2004లో ఏర్పాటు చేసిన కేడబ్ల్యూడీటీ –2 2013 నవంబర్ ​29న రిపోర్టు ఇచ్చిందని, 65% డిపెండబులిటీ లెక్కన ఉమ్మడి ఏపీకి అదనంగా 194 టీఎంసీలు కేటాయించిందన్నారు. కర్నాటక, మహారాష్ట్రకు ఇదే ప్రాతిపదికన అదనపు కేటాయింపులు చేసిందని, ఈ లెక్కన కృష్ణా నదిలో 2,578 టీఎంసీలకు మించి ఉన్న నీళ్లను వాడుకోవడానికి ఉమ్మడి ఏపీకే స్వేచ్ఛ ఉందని చెప్పారు. బచావత్​ ట్రిబ్యునల్​ కేటాయింపుల కు భంగం వాటిల్లకుండా అదనపు జలాలు మాత్రమే పంపిణీ చేయాలని ప్రధానిని జగన్ కోరారు.