సోమేశ్ కుమార్...మీరు రిటైర్మెంట్ తీస్కొవచ్చు: జగన్

సోమేశ్ కుమార్...మీరు రిటైర్మెంట్ తీస్కొవచ్చు: జగన్

తెలంగాణ ప్రభుత్వ మాజీ సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన వీఆర్ఎస్ అప్లికేషన్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ క్యాడర్ అధికారి అయిన సోమేశ్.. క్యాట్ ఆర్డర్స్ తెచ్చుకుని తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. అయితే ఏపీ క్యాడర్కు వెళ్లాల్సిందేనని హైకోర్టు తీర్పు చెప్పడంతో ఆయన అక్కడ రిపోర్ట్ చేశారు. అయితే ఏపీ ప్రభుత్వం ఆయనకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ క్రమంలో వీఆర్ఎస్కు పర్మిషన్ ఇవ్వాలంటూ సోమేశ్ కుమార్ ఏపీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డికి అప్లికేషన్ పంపారు. దీనికి తాజాగా సీఎం జగన్ ఆమోద ముద్ర వేశారు. సోమేశ్ కుమార్ సర్వీస్ డిసెంబర్ వరకు ఉంది. అయితే ఆయన 10 నెలల ముందుగానే ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సవరించిన నిబంధనల ప్రకారం ఆల్ ఇండియా సర్వీస్ అధికారి వీఆర్ఎస్ అప్లికేషన్లను కేంద్రం అనుమతి లేకుండానే క్లియర్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.

1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సోమేశ్ కుమార్.. ఉమ్మడి ఏపీలో పలు బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నారు. అనంతరం గిరిజిన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2019 డిసెంబర్ 31న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కువ కాలం సీఎస్‌గా పనిచేసిన  రికార్డు సోమేశ్ కుమార్ సొంతం చేసుకున్నారు.