
అమరావతి: బర్త్‌డే సందర్భంగా ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని (వన్ టైం సెటిల్‌మెంట్ స్కీమ్) ఉగాది పండుగ వరకు పొడిగిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా వెస్ట్ గోదావరి జిల్లా తణుకులో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వం కేటాయించిన ఇండ్లపై 52 లక్షల మందికి గతంలో నివసించే హక్కు మాత్రమే ఉండేదని గుర్తుచేశారు. అందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చామని, ఆ ఇండ్లపై ఇక అన్ని హక్కులూ లబ్ధిదారులకే ఉండేలా రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నా మని జగన్ తెలిపారు. దీంతో ఆస్తి విలువ పెరుగుతుందని, ఇంటిని అమ్ముకునే హక్కు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు రూ.26 వేల కోట్లతో నిర్మించిన 31 లక్షల ఇండ్లను లబ్ధిదారులకు మంజూరు చేశామన్నారు. సుమారు రూ.10 వేల కోట్ల రుణమాఫీ చేశామని, రూ.6 వేల కోట్ల విలువైన రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ చార్జీల నుంచి మినహాయింపులిచ్చామని ఈ సందర్భంగా జగన్ తెలియజేశారు. ఈ పథకం కింద 52 లక్షల మందికి ఇచ్చిన ఆస్తుల విలువ రూ.లక్షా 58 వేల కోట్లు అని పేర్కొన్నారు.