సీఎం జగన్‌ను క‌లిసిన ఏపీ కొత్త డీజీపీ 

సీఎం జగన్‌ను క‌లిసిన ఏపీ కొత్త డీజీపీ 
  • 1992 బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి

అమరావతి: కొత్త డీజీపీగా నియమితులైన  కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం ఉదయం సీఎం జగన్ ను కలిశారు. ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కొత్త డీజీపీగా  ఇంటెలిజెన్స్‌ విభాగం డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డిని నియమించింది. ఈయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. తనను డీజీపీగా నియమించినందుకు సంతోషం వ్యక్తం చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జగన్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.  కృతజ్ఘతలు తెలిపారు.

డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఉపాధ్యాయుల ఛలో విజయవాడను అడ్డుకోలేకపోయినందుకే గౌతమ్ సవాంగ్ మూల్యం చెల్లించుకున్నారన్న విమర్శలు వచ్చాయి. అధికార టీడీపీతోపాటు ఇతర విపక్షాల వారు, ప్రజాసంఘాలు కూడా డీజీపీపై బదిలీవేటును ఖండించడం జరిగింది. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తనదైన శైలిలో స్పందించారు. అధికారంలో ఉన్న వారికి అడుగులకు మడుగులొత్తిన గౌతమ్ సవాంగ్ కు తగిన శాస్తే జరిగిందని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా.. నిజాయితీగా పనిచేయాలని ఆయన సూచించారు.