ఏపీలో ఉద్యోగుల సమ్మె సైరన్..

ఏపీలో ఉద్యోగుల సమ్మె సైరన్..
  • ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మె
  • ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన పీఆర్సీ సాధన సమితి

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు సోమవారం మధ్యాహ్నం  ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. వచ్చే నెల ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు తెలిపారు. సమ్మె నోటీసు ఇవ్వడానికి సిద్ధమైన ఉద్యోగ సంఘాల నాయకులకు ప్రభుత్వం నుంచి ఫోన్లు రావడంతో మరోసారి చర్చించారు. చివరకు  పీఆర్సీ సాధన సమితి పేరుతో 20 మంది స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌కు సమ్మె నోటీసు అందజేశారు.
చీఫ్ సెక్రెటరీ సమీర్‌ శర్మ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో జీఏడీ ముఖ్యకార్యదర్శికి సమ్మె నోటీసు అందజేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాల నుంచి పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీగా సమ్మె నోటీసులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునేవరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. అధికారుల కమిటీ ఉద్యోగుల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా పీఆర్సీ జీవోలు ఇచ్చారని నోటీసులో పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల అభిప్రాయాలు తీసుకోకుండా జీవోలు జారీ చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అందు వల్లే నిరసన కార్యక్రమాలు చేపట్టామని, తుదిపోరులో భాగంగా నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. 
ఉద్యోగుల సమ్మె నోటీసుపై స్పందించిన సజ్జల
ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగమేనని గుర్తు చేస్తూ ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. ఉద్యోగులు సమ్మె నోటీసు ఇవ్వకముందు మీడియాతో మాట్లాడిన సజ్జల ఉద్యోగుల బుజ్జగింపు, చిన్న అంశాల పరిష్కారానికి కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు వస్తారని రేపు కూడా ఎదురుచూస్తామని సజ్జల స్పష్టం చేశారు.  ఈమేరకు మరోసారి ఉద్యోగ సంఘాలకు సమాచారం పంపుతామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
సచివాలయంలో మంత్రుల ఎదురుచూపు
సమ్మె నోటీసు ఇవ్వడానికి ముందు ఉద్యోగ సంఘాలు తమతో చర్చకు వస్తాయని ఏపీ సచివాలయంలో మంత్రులు ఎదురుచూశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానితో పాటు ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు సచివాలయం రెండో బ్లాక్‌లో వేచి చూశారు. పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ సహా వివిధ అంశాలపై ప్రభుత్వంతో సోమవారం సంప్రదింపులకు రావాలని మంత్రులు పిలుపునివ్వగా ఉద్యోగ సంఘాలు తిరస్కరించిన విషయం తెలిసిందే. పీఆర్సీ జీవోలను రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. చర్చలకు రాబోమని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పినా మంత్రులు నిరీక్షించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

ఆటో డ్రైవర్ పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

ఏపీలో ఇవాళ కూడా 14వేలు దాటిన కేసులు

రాపూరు అడవుల్లో 'పుష్ప' సినిమా తరహా సీన్

తల్లి ఫోన్‌లో గేమ్ ఆడుతూ లక్షన్నరకు ఫర్నీచర్ ఆర్డర్