ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కూటమి సర్కార్. జిల్లాల పునర్విభజన కోసం ఇటీవల సీఎం ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ క్రమంలో జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై మంగళవారం ( నవంబర్ 25 ) సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు.
ఈ క్రమంలో మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల అభివృద్ధి కోసం రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.
మూడు కొత్త జిల్లాలతో పాటు 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. సత్యసాయి జిల్లాలోని మడకశిర, నంద్యాల జిల్లాలోని బనగానపల్లె, మదనపల్లె జిల్లాలోని పీలేరు, సహా అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లె, ప్రకాశం జిల్లాలోని అద్దంకి రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.
