AP News: హోం మంత్రి అనితకు తప్పిన ప్రమాదం

AP News: హోం మంత్రి అనితకు తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనితకు ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయిలో ప్రమాదం చోటు చేసుకుంది. హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం  ( August 11) ఏలూరు జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఉంగుటూరు మండలం కైకరం నుంచి.. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. 

కాన్వాయి వెళ్తున్న సమయంలో మంత్రి ఎస్కార్ట్ వాహనానికి ద్విచక్ర వాహనం అడ్డుగా వచ్చింది. దీంతో ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడెన్‌గా బ్రేకు వేశాడు. దీంతో వెనుక హోం మంత్రి అనిత కూర్చున్న కారు ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే హోం మంత్రికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మంత్రి అనిత వేరే వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

బైక్ అకస్మాత్తుగా ఎదురు రావటంతో ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడని.. దీంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో హోం మంత్రి ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా ధ్వంసమైనట్లు తెలిపారు. మరో కారులో అనిత అలంపూరం బయల్దేరి వెళ్లినట్లు అధికారులు వివరించారు.