గత ఆదివారం హైదరాబాద్ బుక్ఫేర్లో నేను ఇంగ్లిషులో రాసిన ‘శూద్ర రిబల్లియన్’ తెలుగు అనువాదం శూద్రుల తిరుగుబాటు రిలీజ్ అయింది. ఈ పుస్తకం ఇప్పటికే హిందీ, కన్నడలోకి కూడా అనువాదమైనది. ఇంగ్లిషులో వచ్చిన సంవత్సరంలోనే మూడుసార్లు ముద్రితమైనది. తెలుగులో రిలీజ్ అయిన దగ్గర నుంచి దీనిమీద చర్చ జరుగుతోంది. కొంతమంది విమర్శిస్తున్నారు కూడా. ఏ పుస్తకాన్నైనా చదవకుండా విమర్శిస్తే అది పిచ్చితనం అవుతుంది.
శూద్రులు ఎవరు? వారు దేనిమీద తిరుగుబాటు చేయాలని నేను ఈ పుస్తకం రాశాను? అనే ప్రశ్నలు చాలా కీలకమైనవి. శూద్రులంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి, కమ్మ, వెలమ, కాపుల నుంచి అన్ని బీసీ కులాలు. చరిత్ర పొడవునా ఏ కులాలైతే వ్యవసాయ ఉత్పత్తులతో ప్రధానంగా సంఘర్షణ పడ్డారో, ఎవరైతే ఆర్టిజన్ పనులు ద్వారా సైన్సు, ఉత్పాదకత పనిముట్లు.. అంటే టెక్నాలజీని తయారుచేశారో, ఎవరైతే ఉత్పత్తి అనుబంధ సాంస్కృతిక పనులు చేశారో వారంతా శూద్రుల్లో ఇప్పటికీ భాగమే.
శూద్రులు హరప్పా నగర నిర్మాణం నుంచి నేటివరకు ప్రధానంగా ఉత్పత్తి శక్తులుగా ఉన్న కులాలు. ఇవే 70 వేల సంవత్సరాల కింద ఆఫ్రికా ప్రాంతం నుంచి మైగ్రేట్అయి ఇక్కడ అంటే, సింధూ పరీవాహక ప్రాంతం మొదలుకొని బంగాళాఖాతం హిందూ మహాసముద్రం వరకు ఉన్న భూభాగంలో ఉండి ప్రకృతిని పదార్థాలుగా మార్చారో వారంతా శూద్రులే. క్రీ.పూ 500నాడు ఆర్యులు మైగ్రేట్అయ్యేవరకు వీళ్లు ఉత్పత్తి టెక్నాలజీని, యానిమల్ ఎకానమీని నిర్మించారు. వీరి చరిత్ర కదా ఈ దేశం రాసుకోవలసింది.
ఇప్పటివరకు చరిత్ర రాసిన..మెథడాలజీపై తిరుగుబాటు
నేను ఈ పుస్తకంలో చేసిన మొదటి పని ఏమిటంటే ఇప్పటివరకు భారతీయ చరిత్రనంతా బ్రాహ్మణ చరిత్రకారులు స్వీయ క్రియేటివిటీతో రాసింది కాదు. అది రైట్ వింగా, లెఫ్ట్ వింగా అనే తేడా లేకుండా బ్రిటిష్ వలసవాద లేదా యూరో– అమెరికన్ మెథడాలజీని కాపీకొట్టి పుస్తకాల నుంచి పుస్తకాలు రాశారు.
దీన్ని మనం ‘లిఫ్ట్ ఇరిగేషన్ మెథడాలజీ’ అంటాం. ఈ పద్ధతిని నేను పక్కకు పెట్టాను. ఈ దేశం రూపొందిన దగ్గర నుంచి ఇక్కడి ఉత్పత్తి శూద్ర, దళిత జీవితాలను, వారి జ్ఞానాన్ని అధ్యయనం చేసే మెథడాలజీ ఏ బ్రాహ్మణ మేధావి కనిపెట్టలేదు. మొట్టమొదట మహాత్మా ఫూలే కనిపెట్టాడు. కానీ, అది ప్రాథమిక దశలో ఉండింది.
స్వాతంత్ర్యం వచ్చాక శూద్రులు చదువుకున్నప్పటికీ వారికి బ్రాహ్మణ జ్ఞానం మూఢ నమ్మకంగా మారింది. ఈ మూఢ నమ్మకాన్ని ఛేదించి శూద్రులు తిరుగుబాటు జ్ఞానప్రక్రియ ఎలా ఉంటుందో చూపెట్టడం ఈ పుస్తకం ప్రధాన లక్షణం.
శూద్రుల తిరుగుబాటును ఎలా నిర్వచించాలి
స్వాతంత్ర్యం వచ్చేనాటికి 300 ప్రిన్స్లీ స్టేట్స్శూద్ర రాజుల చేతిలోనే ఉన్నాయి. కానీ, ఒక్కడు కూడా మేధావి కాలేదు. బ్రాహ్మణ పూజారులు గుడులు కట్టమంటే కట్టారు. సముద్రాలు దాటిపోయి చదువుకోవద్దంటే పోలేదు. చదవలేదు. కానిస్టిట్యుయంట్ అసెంబ్లీలో ఒక్క శూద్ర రాజ వంశీయ మేధావి లేడు. కనుక శూద్ర రాజులు వ్యవస్థను శాసించారు అని ఏ చరిత్రకారుడైనా మాట్లాడితే అది మూర్ఖత్వం. బ్రాహ్మణిజం భయం తప్ప మరేమీ కాదు.
ఒకే ఒక్క శూద్రరాజు బ్రాహ్మణ పూజారులను ఎదిరించి బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ పూజారి వృత్తిని, మంత్రి పెత్తనాన్ని రద్దు చేయండని ఉత్తరం రాశాడు. అదే సాహు మహారాజ్. ఆ పూర్తి ఉత్తరం శూద్రుల తిరుగుబాటు పుస్తకంలో ఉన్నది. బ్రాహ్మణ కమ్యూనిస్టు చరిత్రకారులు కూడా వర్గదృక్పథం చరిత్ర రాసి శూద్రరాజుల దయనీయ స్థితిని అర్థం చేసుకోలేదు.
ఒక శూద్రరాజు పూజారి వర్గం మీద తిరుగుబాటు చేస్తే శూద్ర చరిత్రకారుడు గొప్ప పని అని చెప్పడానికి కూడా భయపడాలా! అసలు శూద్రుల తిరుగుబాటును ఎలా నిర్వచించాలో బ్రాహ్మణ చరిత్రకారుడు ఎందుకు ఆలోచిస్తాడు.
శూద్ర రాజులు
శూద్ర రాజులు, శూద్ర భూస్వాములు, శూద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు చివరికి ప్రధానమంత్రులైన దేవగౌడ, చరణ్‌సింగ్ వంటి వారు బ్రాహ్మణ పూజారి వర్గానికి, బ్యూరోక్రసీకి, మేధావి వర్గానికి భయపడి ఏది చేయమంటే అది చేశారు. మహాత్మా ఫూలేలాగ, అంబేద్కర్‌లాగా చివరికి ఈ రచయితలాగా తిరగబడలేదు.
వాళ్లు శాసిస్తే ఇక్కడ అధికారం పోతుంది. సచ్చినాక స్వర్గం దొరకదు అని భయపడ్డారు. కానీ, శూద్రులకు, దళితులకు, బ్రాహ్మణ పూజారులకు సచ్చినాక ఒకే స్వర్గం ఉండదనే ఇంగిత జ్ఞానం కూడా వారికి రాలేదు. ఎందుకు? భయం. మహాత్మా ఫూలే సినిమా చూసినవారికి బ్రాహ్మణ శాపానికి ఎంత భయపట్టే కట్టు కథలు ఉన్నాయో అర్థం అవుతుంది.
ఈ భయం శూద్ర, దళిత చరిత్రకారులకు కూడా పట్టుకుంది. అయితే, దళిత చరిత్రకారులు అంబేద్కర్ పోరాటంతో కొంత ఆ భయం నుంచి బయటపడ్డారు. కానీ, శూద్ర, బీసీ మేధావులు, చరిత్రకారులు ఆ భయంలోనే మగ్గుతున్నారు. కొంతమంది ఫూలే, అంబేద్కర్ చివరికి నా రాతలను చదవడానికి భయపడుతున్నారు.
ఈ శాప భయం ఇంటాబయట వారిని వెంటాడుతున్నది. ముఖ్యంగా శూద్రుల్లో ఇది చాలా ఎక్కువ. ఆ భయాన్ని తొలగించడానికి శూద్ర మానసిక తిరుగుబాటు అవసరం. అది ఈ పుస్తకం చేస్తుంది. శూద్ర తిరుగుబాటు అని టైటిల్‌తో ఉన్న పుస్తకం పట్టుకుంటే చేతులు వణుకుతాయి అనే స్థితి ఉంది.
అదే ఆర్ఎస్ శర్మ, సుమిత్ సర్కార్ వంటి పేర్లు గలిగిన బ్రాహ్మణ చరిత్రకారుల పుస్తకాలు పట్టుకుంటే ఆ భయం ఉండదు. వర్ణ వ్యవస్థ శూద్రుల మానసిక స్థితిమీద ఎంత దెబ్బ తీసిందో చదువురాని శూద్రుల్లో కంటే చదువొచ్చిన శూద్రుల్లో మనం ఎక్కువ చూడవచ్చు.
శూద్రుల తిరుగుబాటు పుస్తకం..చదివితే భయం పోతుంది
భయం పోగొట్టడం శూద్రుల తిరుగుబాటు పుస్తకం మొదటి లక్ష్యం. రెండో లక్ష్యం అటు పాశ్చాత్య, ఇటు బ్రాహ్మణీయ మెథడాలజీకి భిన్నమైన శూద్రత్వ మెథడాలజీని సమాజం ముందు పెట్డడం. అధ్యయన మెథడాలజీకి స్థిరత్వం ఉండదు. వాళ్లు వేదాలు, రామాయణ, మహాభారతాలను వాళ్ల మెథడాలజీలో బాగా రాసుకున్నారు. అందులో శూద్రుల ఉత్పత్తి శక్తికిగానీ, సైన్సుకుగానీ, టెక్నాలజీకిగానీ గుర్తింపు లేదు. అందులో బ్రాహ్మణ రుషులు, క్షత్రియలు వారి యుద్ధాలు, పెళ్లిళ్ల చరిత్ర రాసుకున్నారు.
ఆ పుస్తకాల్లో హరప్పా నగర నిర్మాణ చరిత్రగానీ, పార, పలుగు, నాగలి గొప్పతనం గురించిగానీ ఒక్క పేరా కూడా లేదు. అందుకే, ఈ దేశ ఉత్పత్తి శక్తులైన శూద్రుల చరిత్రను కొత్త పద్ధతిలో రాయాలి. నేను ఈ పుస్తకంలో చేసింది ఒక కొత్త ప్రయోగమే. అయితే, ఈ ప్రయోగంలో లోపాలు, విమర్శించాల్సిన అంశాలు ఉండవా అంటే ఉంటాయి.
ముఖ్యంగా శూద్రుల్లో ఇప్పటివరకు పెద్ద చెప్పుకోదగ్గ చరిత్రకారులు లేరు. కనుక మునుముందు వారు ఎదిగి ఈ పుస్తకం మీద విమర్శలు రాయాలి. తిట్లుకాదు. తిట్టడం శూద్ర సంస్కృతి కాదు. దేశ సంపద.. వారు ఇతరులను తిట్టుకుంటూ కూర్చుంటే పెరగలే. వారి శ్రమవల్ల పెరిగింది. ఈ పుస్తకం ఈ నెల 29 వరకు హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ బుక్ ఫేర్ షాపు (180)లో, ఇతర షాపుల్లో అక్కడ దొరుకుతుంది. లేదా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా దొరుకుతుంది. దీన్ని చదివి ముందు భయం పోగొట్టుకోండి, తరువాత విమర్శ చేయండి.
శూద్ర మెథడాలజీ
శూద్ర మెథడాలజీ ద్వారా నేను ‘వై ఐ యామ్ నాట్ ఏ హిందూ’ పుస్తకం రాశాను. దాన్ని బ్రాహ్మణ మేధావులు ద్వేషిస్తే, శూద్ర విద్యావంతులు కూడా ఊరుమీద రాసేది పుస్తకమా! గొర్రె, బర్రె మీద రాసేది పుస్తకమా అని ఎద్దేవా చేశారు. శూద్రులకు మెప్పు ముందు బ్రాహ్మణ మేధావుల ద్వారా రావాలి.
బ్రాహ్మణ మేధావులకు యూరప్– అమెరికా తెల్ల మేధావుల ద్వారా రావాలి. నల్ల మేధావుల ద్వారా కూడా కాదు. భావం దాని సత్యం ఇన్ని పొరలుగా ఈ దేశంలో దిగజారి ఉన్నది. ఈ శూద్ర జ్ఞాన భయాన్ని తొలగించడానికే.. నేను హిందువు నెట్లయిత, బఫెలో నేషనలిజం, పోస్టు హిందూ ఇండియా (హిందూ అనంతరం భారతదేశం), ఇప్పుడు శూద్రుల తిరుగుబాటు పుస్తకాలు రాశాను.
కానీ, శూద్రుల జ్ఞాన భయం వేల ఏండ్లుగా ఒక మూఢ నమ్మకంగా మారింది. అందుకే శూద్ర రాజులు సైతం తమ పిల్లలను ఇంగ్లాండుకు తోలి చదివించలేదు. వారు మేధావులు కాలేదు. ఇక వ్యవసాయ శూద్రులు మరీ భయపడతారు కదా!
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
