
- రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు మళ్లీ ప్రారంభం
- 44 వేల నుంచి 90 వేల క్యూసెక్కులకు చేరనున్న కెనాల్ కెపాసిటీ
- పనులు పూర్తయితే రోజూ 8 టీఎంసీలు తన్నుకుపోయేందుకు వీలు
- పనులను అడ్డుకోకుండా చోద్యం చూస్తున్న కృష్ణా బోర్డు
- కెనాల్‌ను 19 వేల క్యూసెక్కులతో మొదలుపెట్టి.. 90 వేల క్యూసెక్కులకు పెంచుతున్న ఏపీ
- ఎస్ఆర్ఎంసీ లైనింగ్ పనులకు 2020లోనే జీవో..
- తెలంగాణ ఫిర్యాదుతో 2023లో పనులు నిలిపివేత
- బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో తెలంగాణకు అనుకూలంగా తీర్పు వచ్చే చాన్స్
- అందుకే కెనాల్ వర్క్స్ స్పీడప్ చేసిన ఏపీ.. రెండు, మూడు నెలల్లో పూర్తి చేసేలా ఏర్పాట్లు
- లైనింగ్ పనులు ఆపాలంటూ తాజాగా కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మరిన్ని నీళ్లు దోచుకునేందుకు ఏపీ లైన్ క్లియర్ చేసుకుంటున్నది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ కెపాసిటీని లక్షన్నర క్యూసెక్కులకు పెంచుకున్న పొరుగు రాష్ట్రం.. దాని కింద నిర్మించిన శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ (ఎస్ఆర్ఎంసీ) ద్వారా పూర్తి స్థాయిలో నీటిని తరలించుకుపోయేందుకు వీలుగా వారం నుంచి లైనింగ్ పనులను స్పీడప్ చేసింది. ఇప్పటివరకు లైనింగ్ లేని ఈ కెనాల్ ద్వారా కేవలం 44 వేల క్యూసెక్కులనే తరలించే వీలుండగా.. రెండు, మూడు నెలల్లో లైనింగ్ పూర్తి చేయడం ద్వారా రోజూ 90 వేల క్యూసెక్కుల (8 టీఎంసీలు) చొప్పున తన్నుకుపోయేలా కుట్ర చేస్తున్నది. ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తున్నా, ఇరిగేషన్ అవసరాలకు నీళ్లను ఔట్ సైడ్బేసిన్కు తరలించడానికి వీల్లేదని బచావత్ట్రిబ్యునల్ అవార్డు చెబుతున్నా.. ఏపీ అవేవీ లెక్క చేయకుండా ముందుకెళ్తున్నది.
ఎస్ఆర్ఎంసీ లైనింగ్పనులకు 2020 మే 5న ఏపీ జీవో జారీ చేసింది. 2023 సెప్టెంబర్‌లో లైనింగ్పనులను ప్రారంభించింది. ఆనాడు తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో పనులను ఆపింది. అయితే ఇప్పుడు సెక్షన్3పై బ్రజేశ్కుమార్ట్రిబ్యునల్ తెలంగాణ వాదనలు వింటుండడం, తీర్పు మనకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండడంతో.. ఏపీ కుట్రకు తెరలేపింది. వారం కింద ఎస్ఆర్ఎంసీ లైనింగ్పనులను మళ్లీ ప్రారంభించింది. యమ స్పీడ్‌గా పనులు పూర్తి చేస్తున్నది. పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల రెగ్యులేటర్వరకు 16.4 కిలోమీటర్ల పొడవుండే ఈ కెనాల్‌లో ఇప్పటికే దాదాపు సగం మేర లైనింగ్వర్క్స్పూర్తి చేసినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కెనాల్ఐదో కిలోమీటర్ పాయింట్వద్ద పనులు వేగంగా నడుస్తుండగా.. ఆ కింద కూడా వివిధ పాయింట్ల వద్ద పనులను స్పీడప్ చేసినట్టు తెలుస్తున్నది. మొత్తంగా ఫ్లడ్సీజన్మొదలయ్యే మరో రెండు, మూడు నెలల్లో లైనింగ్వర్క్స్పూర్తి చేసి కెనాల్ పూర్తి సామర్థ్యం మేరకు శ్రీశైలం నుంచి నీటిని తోడుకపోవాలనే ఆలోచనలో ఏపీ ఉంది. మరోవైపు పనులను అడ్డుకోవాల్సిన కృష్ణా రివర్మేనేజ్మెంట్బోర్డు (కేఆర్ఎంబీ) మాత్రం చోద్యం చూస్తున్నది. ఈ క్రమంలో ఏపీ చేపట్టిన లైనింగ్పనులను వెంటనే అడ్డుకోవాలంటూ తాజాగా కేఆర్ఎంబీకి ఈఎన్సీ అనిల్‌కుమార్ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీని అడ్డుకోవాలని కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ..
శ్రీశైలం రైట్ మెయిన్కెనాల్కు ఏపీ చేపడ్తున్న లైనింగ్పనులను కృష్ణా బోర్డు అడ్డుకోకపోవడంపై తెలంగాణ తీవ్రంగా స్పందించింది. లైనింగ్పనులను ఆపాలంటూ ఇప్పటికే 2023 సెప్టెంబర్, 2024 జులైలో రెండు సార్లు ఫిర్యాదు చేసినా బోర్డు స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. లైనింగ్పనులను చేపట్టకుండా ఏపీని ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించింది. ఈ మేరకు గురువారం కేఆర్ఎంబీకి ఈఎన్సీ అనిల్కుమార్లేఖ రాశారు. 1960 సెప్టెంబర్‌తర్వాత చేపట్టిన అన్ని ప్రాజెక్టులకూ ఇన్‌సైడ్ బేసిన్అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని బచావత్ట్రిబ్యునల్అవార్డు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. బచావత్ట్రిబ్యునల్కూడా కేవలం ఇన్సైడ్బేసిన్ప్రాజెక్టులకే నీటి కేటాయింపులను చేసిందని స్పష్టం చేశారు. శ్రీశైలం కేవలం జలవిద్యుదుత్పత్తి కోసమే నిర్మించారని, ఔట్‌సైడ్ బేసిన్‌కు నీటిని తరలించరాదంటూ ట్రిబ్యునల్స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
1976–77 ఒప్పందం ప్రకారం ఒపెన్కెనాల్ద్వారా చెన్నైకి 1500 క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాల కోసం మాత్రమే తరలించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ.. శ్రీశైలం నుంచి పెన్నా బేసిన్‌కు నీటిని తరలించే శ్రీశైలం రైట్బ్రాంచ్కెనాల్(ఎస్ఆర్బీసీ)కి శ్రీకారం చుట్టి.. సీడబ్ల్యూసీ ఆమోదం కోసం పంపిందని గుర్తు చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ భాగమైనందున సీడబ్ల్యూసీకి గానీ, ట్రిబ్యునళ్లముందుగానీ తమ వాదన వినిపించే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ఏపీ తన తీరు మార్చుకోకుండా శ్రీశైలం రైట్మెయిన్కెనాల్కు లైనింగ్వర్క్స్ను పూర్తి చేసేలా వేగంగా పనులను చేపడుతున్నదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం అపెక్స్కౌన్సిల్అనుమతి లేకుండా, కృష్ణా బోర్డు ఆమోదం తెలపకుండా ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపు సామర్థ్యాన్ని పెంచేలా కెనాల్‌కు ఎలాంటి లైనింగ్పనులను చేపట్టడానికి అధికారం లేదని స్పష్టం చేశారు. కాబట్టి ఏపీ వెంటనే ఆ పనులను నిలుపుదల చేసేలా కృష్ణా బోర్డు జోక్యం చేసుకోవాలని, ఏపీని అడ్డుకోవాలని డిమాండ్‌చేశారు. దాంతోపాటు రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్ , ఎస్ఆర్ఎంసీపై కేంద్ర జలశక్తి శాఖ, తెలంగాణకు ఏపీ స్టేటస్ రిపోర్ట్ ఇచ్చేలా
ఆదేశించాలని కోరారు.
841 అడుగులకు తగ్గగానే పనులు..
ఫ్లడ్సీజన్లో శ్రీశైలంలో 841 అడుగుల వరకు నీళ్లుంటే ఏపీ పనులు చేసుకోవడానికి వీలు కావడం లేదు. ఆ నీటిమట్టం వరకు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని ఏపీ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వాటర్ లెవల్ అంతకు తగ్గితే నీటిని తీసుకెళ్లే అవకాశం ఉండదు. ఈ క్రమంలో నెల క్రితం ప్రాజెక్టులో 841 అడుగుల దిగువకు నీటి మట్టం రాగానే.. ఎస్ఆర్ఎంసీ లైనింగ్ పనులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేసిపెట్టుకున్నది. వివిధ పాయింట్ల వద్ద బ్యాచింగ్ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసింది. పక్కా ప్రణాళిక ప్రకారం.. వారం రోజులుగా పనులు స్పీడప్ చేసింది. ప్రస్తుతం బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో మన రాష్ట్రానికి అనుకూలంగా వాదనలు జరుగుతుండడం, సెక్షన్ 3పైనే వాదనలు వింటుండడం.. తీర్పు మనకు అనుకూలంగా వచ్చే అవకాశాలూ ఉండడంతో ఏపీ ఇలా దూకుడుగా వ్యవహరిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రిబ్యునల్ తీర్పు వచ్చేలోపు అన్ని పనులను పూర్తి చేసి పెట్టుకుంటే నీటి తరలింపులో అడ్డంకులు ఉండవన్న ఉద్దేశంతో ఏపీ ఈ కుట్రలకు తెరలేపిందన్న చర్చ జరుగుతోంది.
నాడు 1,500 క్యూసెక్కులకే అనుమతి..
శ్రీశైలం ప్రాజెక్టును కేవలం విద్యుదుత్పత్తి కోసమే వాడాలని 1973లో బచావత్ ట్రిబ్యునల్స్పష్టంగా చెప్పింది. హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కాబట్టి.. నీటిని ఇరిగేషన్ అవసరాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడడానికి వీల్లేదని ఆదేశించింది. అది కూడా ఔట్‌సైడ్ బేసిన్‌లోని ఇరిగేషన్అవసరాలకు తరలించకూడదని పేర్కొంది. ఒకవేళ తరలించాల్సి వస్తే కేవలం ఇన్‌సైడ్ బేసిన్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలో 1977 అక్టోబర్ 28న జరిగిన అగ్రిమెంట్ప్రకారం.. చెన్నై తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఒక వాటర్ఇయర్లో 15 టీఎంసీలకు మించకుండా 1,500 క్యూసెక్కులతో కాల్వలను డిజైన్ చేయించాల ని సూచించింది. కానీ, చెన్నైకి తాగునీటి ముసుగులో ఏపీ పాలకులు ఔట్‌సైడ్ బేసిన్ అయిన పెన్నా బేసిన్‌లోని రాయలసీమ ప్రాంతానికి నీటిని తరలించే కుట్రకు తెర లేపారు.
1980లలో మొదలైన ఆ జల దోపిడీ.. ఆ తర్వాత మరింత పెరిగి, ప్రస్తుతం రోజూ 8 టీఎంసీలు తరలించే స్థాయికి చేరింది. ఏపీ పాలకులు 1980లలో 44,600 క్యూసెక్కుల కెపాసిటీతో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, 19,150 క్యూసెక్కుల సామర్థ్యంతో శ్రీశైలం రైట్‌మెయిన్ కెనాల్(అన్‌లైన్డ్), 48,525 క్యూసెక్కుల సామర్థ్యంతో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టారు. 2005లో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 1,56,100 క్యూసెక్కులకు, ఎస్ఆర్ఎంసీ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 81,975 క్యూసెక్కులకు పెంచారు. 2020లో ఎస్ఆర్ఎంసీ కెపాసిటీని 89,762 క్యూసెక్కులకు పెంచేలా లైనింగ్పనులను చేపట్టేందుకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఏడాది మే 5న జీవో 203 ఇచ్చింది. ఇప్పుడు ఆ పనులను స్పీడప్చేస్తోంది.