
శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలిస్తున్న కృష్ణా జలాలపై ఏపీ చెబుతున్నవన్నీ దొంగ లెక్కలేనని అక్కడి పరిస్థితులను బట్టి అర్థమవుతున్నది. పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్లకు నీటిని తీసుకెళ్లే ఎస్ఆర్ఎంసీ కెపాసిటీని లక్ష క్యూసెక్కులకు పెంచడంతో ప్రస్తుతం గట్లు ఒరుసుకుంటూ కాలువ సాగుతున్నది. కానీ కేవలం 20 వేల క్యూసెక్కుల నుంచి 30 వేల క్యూసెక్కుల నీటినే తీసుకుపోతున్నట్టు ఏపీ చెప్పడంపై విస్మయం కలుగుతున్నది. నిజానికి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద ఎస్ఆర్ఎంసీ నుంచి ఎస్కేప్చానల్, హెచ్ఎన్ఎస్ఎస్, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగకు వేర్వేరు తూముల ద్వారా నీరు సీమ వైపు తరలిస్తుండగా.. ఒక్కో కెనాల్ కెపాసిటీ 20 వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచుకోవడంతో ఏపీ చెప్తున్న లెక్కలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్వద్ద టెలీమెట్రీలు ఏర్పాటు చేస్తే తప్ప.. ఏపీ ఎంత నీటిని ఎత్తుకెళ్తుందనే విషయంలో స్పష్టత రాదు. కానీ అందుకు ఏపీ అంగీకరించడం లేదు.
లిఫ్టులతోనూ ఎత్తిపోస్తున్నరు
పోతిరెడ్డిపాడు వద్ద కృష్ణా నదిని మళ్లిస్తున్న ఏపీ.. దీని ఎగువన ముచ్చుమర్రి, మల్యాల వద్ద లిఫ్టులను నిరంతరాయంగా నడుపుతున్నది. శ్రీశైలం బ్యాక్ వాటర్ 798 అడుగులకు పడిపోయినా ముచ్చుమర్రి నుంచి నీటిని ఎత్తిపోసుకునేలా ఈ లిఫ్టును డిజైన్ చేశారు. ఇందుకోసం అక్కడున్న గుట్టలను తొలిచారు. పంపుహౌస్ వరకు నీళ్లు వచ్చేందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తవ్వకాలు చేపడ్తున్నారు. కర్నూల్–-కడప కెనాల్(కేసీసీ)కు సుంకేసుల రైట్ కెనాల్ నుంచి నీటి సరఫరా ఆగిపోయినా, తుంగభద్ర నదికి వరద లేకున్నా ముచ్చుమర్రి నుంచి కృష్ణా జలాలను కేసీసీకి లిఫ్ట్ చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దీని ఎగువన 20 కిలోమీటర్ల దూరంలో మల్యాల వద్ద ఏపీ ఇటీవల మరో లిఫ్టును ప్రారంభించింది. హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) లిఫ్ట్ పేరుతో కృష్ణా జలాలను తోడుకుపోతున్నది. రెండు దశల్లో వీటి పనులు చేపట్టాల్సి ఉండగా.. కొద్ది రోజుల కింద మొదటి దశ పనులు పూర్తయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ లిఫ్టును ప్రారంభించగా.. మొత్తం 12 పంపుల్లో ప్రస్తుతం ఆరు పుంపుల ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని ఎత్తి పోస్తున్నారు. 20 వేల క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న కెనాల్ ద్వారా కృష్ణగిరి, పత్తికొండ, జీడీపల్లి రిజర్వాయర్లను నింపుతున్నారు. 11 పంపుహౌస్‌ల నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాల వరకు నీటిని తీసుకుపోతున్నారు. వచ్చే ఏడాది చివరి కల్లా ఈ లిఫ్ట్ ఫేజ్-2 కూడా పూర్తి చేసేలా పనులు స్పీడప్ చేస్తున్నారు. ఈ పనులు పూర్తి చేస్తే దీని కింద 30 టీఎంసీల కెపాసిటీ ఉన్న గొల్లపల్లి, మర్ల, చర్లపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లు నింపుకునే అవకాశం కలుగుతుంది.