మా ఓర్పును చేతగానితనం అనుకోవద్దు

మా ఓర్పును చేతగానితనం అనుకోవద్దు

విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తాము తమ రాష్ట్రానికి కేటాయించిన నీటినే వాడుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ, ఏపీ మధ్య ముదురుతున్న జలవివాదంపై ఏపీ ప్రభుత్వం కేబినెట్ భేటీ నిర్వహించింది. తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు, ఎన్‌జీటీ ఆదేశాలపై కేబినెట్‌లో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం, నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఏపీ కేబినెట్ తీవ్రంగా ఖండించిందని మంత్రి అనిల్ అన్నారు. జలవిద్యుత్ ఆపాలని కేఆర్ఎంబీ తెలంగాణకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. నీటి వాటాల విషయంలో తెలంగాణ మంత్రులు మాట్లాడే భాష సరిగా లేదని ఆయన మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం నేతలు ఇష్టంవచ్చినట్లు మాట్లాడటం దుర్మార్గం అని ఆయన అన్నారు. సున్నితమైన సమస్య కాబట్టే మేం ఎక్కువగా మాట్లాడటం లేదని.. లేకపోతే మాకు మాట్లాడటం చేతకాదా అని అనిల్ అన్నారు. ఏ ప్రాజెక్టు కట్టినా తమకు కేటాయించిన నీటినే వాడుకుంటామని మంత్రి అనిల్ అన్నారు. తమ రాష్ట్ర ప్రజల కోసం ఎందాకైనా వెళ్తామని ఆయన అన్నారు. మా సంయమనాన్ని చేతకానితనం అనుకోవద్దని ఆయన హెచ్చరించారు. ఏపీ ప్రజలు ఎంతోమంది తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ మంత్రులు ఎంత కఠినంగా మాట్లాడితే.. తాము కూడా అంతే కఠినంగా ప్రతిస్పందిస్తామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నోళ్లున్నాయని.. తాము గట్టిగానే మాట్లాడతామని ఆయన అన్నారు. తాము అనవసరంగా మాట్లాడమని.. తమ చేతలే మాట్లాడుతాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను అనుమతులు లేకుండానే కడుతుంది. ఏపీకి తెలంగాణ చేస్తున్న అన్యాయంపై కేంద్రానికి, జలశక్తి శాఖకు లెటర్ రాస్తామని ఆయన అన్నారు.