
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ హింసాత్మక ఘటనలతో గందరగోళంగా మారింది. ఈ నెల 3న చురచంద్‌పూర్ జిల్లా టోర్‌బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మణిపూర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలుగు విద్యార్థులంతా బిక్కుబిక్కుమంటూ గదులకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. తెలుగు విద్యార్థులను, పౌరుల కోసం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు.
మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో ఆ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ పౌరులను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. డీఐజీ బి. సుమతి ఇన్ఛార్జిగా.. 7901643283 అనే నెంబర్ కు గానీ, dgp@tspolice. gov. in అనే మెయిల్ లో సంప్రదించవచ్చని డీజీపీ పేర్కొన్నారు. ఈ విషయమై తగు సహాయం అందించేందుకై మణిపూర్ రాష్ట్ర పోలీసులతో తెలంగాణ పోలీసులు సమన్వయం చేస్తున్నారని ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఇక ఆదివారం మధ్యాహ్నం ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాన్ని విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి మణిపూర్ సీఎస్‌తో మాట్లాడారు. మణిపూర్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ సమన్వయం చేస్తూ వస్తున్నారు.
మరోవైపు మణిపూర్ లోని ఏపీ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీ భవన అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. సహాయం అవసరమైన విద్యార్థులకు, తల్లి దండులకు ఏపీ ప్రభుత్వం హెల్ప్ లైన్ అందుబాటులో ఉంచింది. మణిపూర్ లోని వివిధ యూనివర్సిటీలలో ఏపీ కి చెందిన 150 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ఇంఫాల్ లోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 23 మంది ఏపీ విద్యార్థులు చదువుతున్న అధికారులు గుర్తించారు.
సహాయం కోసం డయల్ చేయాల్సిన హెల్ప్ లైన్ నంబర్లు 011–23384016, 011–23387089
మణిపూర్ ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ : మైఖేల్ అకొమ్ : 8399882392 , 9436034077, 7085517602
ఇక మణిపూర్ లో చెలరేగిన మారణహోమంలో ప్రాణాల కోల్పోయిన వారి సంఖ్య 54కు చేరింది. అనధికార లెక్కల ప్రకారం మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని చెబుతున్నారు. గిరిజనులు, గిరిజనేతలు మధ్య చెలరేగిన ఘర్షణలతో పరిస్థితి అదుపు తప్పడంతో ఆర్మీని రంగంలోకి దింపడం, అసోం రైఫిల్స్ కీలక ప్రాంతాల్లో మొహరించడంతో పరిస్థితి క్రమంగా కుదుటపడుతోంది. శనివారంనాడు ఇంఫాల్ వ్యాలీ పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. ఇంఫాల్ టౌన్‌లో ప్రధాన ఏరియాలు, రోడ్లపై గణనీయంగా ఆర్మీ బలగాలు, ఆర్‌పీఎఫ్, సెంట్రల్ పోలీస్ ఫోర్స్ మోహరించడంతో మార్కెట్లు క్రమంగా తెరుచుకుంటున్నాయి.