అక్రమ ప్రాజెక్టులకు రాచముద్ర కోసం ఏపీ ఎత్తులు

అక్రమ ప్రాజెక్టులకు రాచముద్ర కోసం ఏపీ ఎత్తులు
  • దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలకు పదును
  • ఉలుకు లేని కేసీఆర్.. ఉరుకుతున్న జగన్​
  • కట్టి తీరుతామని ఇప్పటికే ఏపీ సీఎం బహిరంగ ప్రకటన
  • ఢిల్లీలో కేంద్ర మంత్రి షెకావత్​తో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ
  • 800 అడుగుల నుంచి నీళ్లు తీసుకునేలా సంగమేశ్వరం చేపట్టినట్లు వెల్లడి
  • తమకు నీళ్లు రాకుండా తెలంగాణ అడ్డం పడుతోందని ఫిర్యాదు

హైదరాబాద్‌, వెలుగు: కృష్ణానదిపై  తాము చేపట్టిన అక్రమ ప్రాజెక్టులకు అధికారికంగా రాచముద్ర వేయించుకునేందుకు ఆంధ్రప్రదేశ్​ సర్కారు ఎత్తులు వేస్తోంది. తెలంగాణ ప్రభుత్వ పట్టింపులేని తనాన్ని మరింత అనుకూలంగా మలుచుకుంటోంది. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలకు పదును పెట్టింది. అక్రమ ప్రాజెక్టులకు పర్మిషన్​ కోసం ఢిల్లీలో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కృష్ణా నీళ్లను బాజాప్తా మలుపుకుంటామని, రాయలసీమ లిఫ్ట్ కట్టుకుంటామని ఏపీ సీఎం జగన్​ బహిరంగంగానే సవాల్​ విసిరారు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్​ ఇప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిన్న మొన్నటిదాకా తోచిందల్లా మాట్లాడి సెంటిమెంట్​ రాజేసే ప్రయత్నం చేసిన తెలంగాణ మంత్రులు కూడా ఇప్పుడు సైలెంటయ్యారు. కృష్ణా నీళ్లను వాడుకొమ్మని ఏపీకి చెప్పింది తానేనని గతంలో చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు మౌనంగానే ఉంటూ ఏపీకి సహకరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.  రెండేండ్ల కిందట్నే  శ్రీశైలం నీటిని కాజేసేందుకు సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను ఏపీ స్టార్ట్​ చేసింది. అప్పుడు కూడా కేసీఆర్  వాటి ఊసెత్తకుండా దాటేశారు. ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​తో కృష్ణా బోర్డుకు లెటర్లు రాయించటం తప్ప.. ఏపీ కుట్రలను నిలువరించే ప్రయత్నం చేయలేదు. దీంతో తమకు అడ్డూ అదుపు లేదన్నట్లుగా కృష్ణాపై చేపట్టిన ప్రాజెక్టుల టెండర్లు, ఇతర పనులను ఏపీ స్పీడ్​గా పూర్తి చేసుకుంది. ఇప్పుడు కేసీఆర్​ లేవనెత్తిన రాజకీయ రగడను ఏపీ మరోసారి చాన్స్ గా వాడుకుంటోంది. ఏకంగా తమ  ప్రాజెక్టులకు అధికారికంగా పర్మిషన్లు తెచ్చుకునే పని పెట్టుకుంది. 

ఢిల్లీలో మకాం
సంగమేశ్వరం (రాయలసీమ) ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలంటూ ఏపీ సర్కారు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ అక్రమంగా కరెంట్‌ ఉత్పత్తి చేస్తూ శ్రీశైలం రిజర్వాయర్‌ నిండకుండా అడ్డం పడుతోందని ఫిర్యాదు చేశారు. తమకు నీళ్లు రాకుండా తెలంగాణ అడ్డపడుతోంది కాబట్టే 800 అడుగుల నుంచి నీళ్లు తీసుకునేలా ఈ స్కీమ్​ చేపట్టామన్నారు. సంగమేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులివ్వాలని కోరుతూ ఏపీ సీఎం జగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే రెండు సార్లు ప్రధాని మోడీకి, ఒకసారి జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెకావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లెటర్లు రాశారు. ప్రాజెక్టుకు కీలకమైన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రికి కూడా లెటర్​ రాశారు. పెన్నా బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 100 టీఎంసీలకు పైగా కృష్ణా నీళ్లను తరలించే అక్రమ ప్రాజెక్టును లీగలైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకునేందుకు జగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయని ప్రయత్నమంటూ లేదు. ఇప్పటికే ఏపీ ఇరిగేషన్ ఆఫీసర్లు ఢిల్లీలోనే మకాం పెట్టి పర్యావరణ అనుమతులకు అవసరమైన ప్రయత్నాలు సాగిస్తున్నారు.