
హైదరాబాద్, వెలుగు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పుంజుకుంటోంది కాబట్టి ఈ సంవత్సరంలో బిల్డింగ్ మెటీరియల్ ఇండస్ట్రీ 10 శాతం పెరుగుతుందని అపర్ణ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. రియల్టీ ప్రాజెక్టులు బాగా పెరుగుతున్నందున అమ్మకాలు ప్రి–కొవిడ్ లెవెల్‌కు చేరుతాయని అంచనా వేసింది. 2022లోనూ ఈ సెక్టార్ పదిశాతం గ్రోత్ సాధించింది. జీడీపీలో ఈ సెక్టార్ వాటా తొమ్మిది శాతం వరకు ఉంటుంది కాబట్టి ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతో ముఖ్యం. అంతేగాక 5.1 కోట్ల మంది బిల్డింగ్ మెటీరియల్ రంగంలో పనిచేస్తున్నారు.
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మానిటరింగ్ విభాగం ప్రకారం, మే 1, 2022 నాటికి, దేశంలో పైప్‌లైన్‌లో 1,559 ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటి విలువ రూ. 26.7 లక్షల కోట్లు. రెసిడెన్షియల్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుండటం కూడా ఈ రంగానికి కలసి వస్తుంది. 2023 నాటికి దేశవ్యాప్తంగా కొత్త ప్రాజెక్టులు గణనీయంగా పెరుగుతాయని అంచనా. దీనివల్ల నిర్మాణ సామగ్రికి డిమాండ్ పెరుగుతుంది. నేటి తరం వాళ్లు ఇల్లు కొనడానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కరోనా తర్వాత లగ్జరీ హోమ్ మార్కెట్ కూడా ఆకర్షణీయమైన పెట్టుబడులను సాధించింది.