
మేడ్చల్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులను బెదిరించిన మనోహరాబాద్ ఎంపీపీ భర్త రవి
‘‘నన్నే ఆపి అడుగుతరా?” అంటూ జగిత్యాలలో కానిస్టేబుళ్లతో కౌన్సిలర్ గంగమల్లు వాగ్వాదం
మెదక్ (మనోహరాబాద్)/జగిత్యాల, వెలుగు : పోలీసులపై బీఆర్ఎస్ లీడర్లు రుబాబు చూపెట్టారు. డ్యూటీలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, తాము అధికార పార్టీ నేతలమంటూ బెదిరింపులకు దిగారు. హైదరాబాద్–నాగపూర్ నేషనల్ హైవేపై మేడ్చల్ సమీపంలోని క్లాసిక్ దాబా దగ్గర శుక్రవారం రాత్రి పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఆ టైమ్లో అదే రూట్ లో కారులో బీఆర్ఎస్కు చెందిన మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎంపీపీ నవనీత భర్త రవి, కాంగ్రెస్ కు చెందిన మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్ చాప రాజు, మనోహరాబాద్ మండలం రామాయపల్లి ఎంపీటీసీ బంధువు శ్రీనివాస్ గౌడ్ వస్తున్నారు. పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారని గమనించిన వాళ్లు.. కారు పక్కన ఆపారు. అందులో నుంచి దిగి రోడ్డు క్రాస్ చేసేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు.. వాళ్లను ఆపి, టెస్టు చేయబోగా రవి వాగ్వాదానికి దిగాడు. ‘‘నేను సీఎం నియోజకవర్గం మనోహరాబాద్ ఎంపీపీని... ఏం చేస్తావ్” అంటూ బెదిరించాడు. మేడ్చల్ ట్రాఫిక్ ఎస్సై లింగం ఫోన్ గుంజుకున్నాడు. దీంతో రవి, చాప రాజుపై కేసు నమోదు చేసినట్లు మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
‘‘మీ సంగతి చూస్త’’ అంటూ బెదిరింపులు..
జగిత్యాలలో పోలీసులను బీఆర్ఎస్ కౌన్సిలర్ బెదిరించారు. పట్టణంలోని అన్నపూర్ణ చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి కొంతమంది గుమిగూడగా, అక్కడికి పెట్రోలింగ్ కానిస్టేబుల్స్ వెళ్లారు. అక్కడ గొడవ జరిగినట్టు కనిపించగా.. ఏమైంది? మీరెవరు? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న 32వ వార్డు కౌన్సిలర్ గంగమల్లును ఆపగా.. ‘‘నేను అధికార పార్టీ కౌన్సిలర్. నన్నే ఆపి అడుగుతరా?” అంటూ పోలీసులతో ఆయన దురుసుగా ప్రవర్తించారు. పైఅధికారులకు చెప్పి ‘‘మీ సంగతి చూస్తా’’ అంటూ బెదిరించారు. ‘‘నేను కౌన్సిలర్ అని చెప్పినా వినకుండా పోలీసులు నన్ను ఆపారు. సీఐకి చెప్పాలని ఎమ్మెల్యేకు ఫోన్ చేసినా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ పార్టీకో దండం. బీజేపీ, కాంగ్రెస్ కు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు” అని ఫైర్ అయ్యారు. అధికార పార్టీ కౌన్సిలర్ కావడంతోనే డ్రంకన్ డ్రైవ్ టెస్టు చేయలేదని ప్రతిపక్షాల నేతలు మండిపడ్డారు. కాగా, గంగమల్లు తనకు తాను అనుకున్నాడని.. ఎక్కడా పోలీసులను దూషించలేదని, అందుకే కేసు నమోదు చేయలేదని సీఐ కిషోర్ తెలిపారు.