సింగరేణికి దూరంకానున్న ‘అప్మెల్’..త్వరలోనే ఏపీ పరం

సింగరేణికి దూరంకానున్న ‘అప్మెల్’..త్వరలోనే ఏపీ పరం
  • ఏపీకి అనుకూలంగా అటార్నీ జనరల్ న్యాయ సలహా
  • తాజాగా కేంద్ర హోంశాఖ సెక్రటరీ ప్రకటన
  • రూ.1200 కోట్ల విలువైన కంపెనీ.. 209 ఎకరాల భూమి
  • దానిపై హక్కులన్నీ సింగరేణివే
  • రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంతో వదులుకోవాల్సిన పరిస్థితి

మందమర్రి, వెలుగు: మన సింగరేణికి అనుబంధంగా విజయవాడలో ఉన్న ‘ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్(ఆప్మెల్)’ సంస్థ ఏపీ పరం కాబోతుందా..? ఈ విషయంలో తెలంగాణ సర్కార్నుంచి పెద్దగా ఒత్తిడి లేకపోవడంతో ఆప్మెల్ను ఏపీకే కేటాయించాలని అటార్నీ జనరల్ న్యాయసలహా ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్కుమార్ భల్లా తాజాగా ప్రకటించారు. ఈ వ్యవహారంలో  రెండు రాష్ట్రాల సీఎస్లు స్పందించాలని కేంద్రం తరుపున ఆయన కోరారు. భల్లా ప్రకటనతో రూ.1200 కోట్ల విలువైన కంపెనీ, 209 ఎకరాల భూములు ఏపీకి దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సింగరేణి సీనియర్ఆఫీసర్లు అంటున్నారు. ఇదే జరిగితే ఆప్మెల్లో 81.54 శాతం వాటా కలిగిన సింగరేణి భారీగా నష్టపోయే  ప్రమాదముంది. 
1994లో సింగరేణి పరిధిలోకి..
 విజయవాడ సమీపంలోని కొండపల్లిలో ఉన్న ఆప్మెల్ప్రధానంగా సింగరేణి మైనింగ్ కార్యకలాపాలకు అవసరమైన మిషనరీలు, స్పేర్పార్ట్స్ తయారుచేస్తోంది. 1976లో ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కార్పొరేషన్ అనుబంధ సంస్థగా ఆప్మెల్ ఏర్పాటైంది. ఇందులో వివిధ మిషనరీలు, స్పేర్పార్ట్స్ తయారయ్యేవి. నిర్వహణ లోపం, పరికరాల్లో క్వాలిటీ లేకపోవడంతో ఈ కంపెనీ 1992 నాటికల్లా దివాలా తీసింది. దగ్గరదగ్గర రూ.1200 కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోయింది. అందులోని ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఈ తరుణంలో అప్పటి టీడీపీ సర్కార్లోని కొందరు ఆంధ్ర ప్రాంత నేతలు కంపెనీని నిలబెట్టే బాధ్యతను నెత్తిమీద వేసుకున్నారు. దాదాపుగా ఖాయిలాపడ్డ కంపెనీని 1994లో  సింగరేణికి అప్పగించారు. తెలంగాణ ఆఫీసర్లు వ్యతిరేకించినప్పటికీ అప్పటి లెక్కల ప్రకారం సింగరేణితో 81.54 శాతం వాటాను కంపెనీలో పెట్టించారు. ఆప్మెల్ను క్రమేణా లాభాల్లోకి తీసుకువచ్చిన సింగరేణి నాటి నుంచి నేటివరకు  దాని నిర్వహణతో పాటు 300 మంది ఉద్యోగుల జీతభత్యాలు చెల్లిస్తోంది. అప్మెల్కు సింగరేణి ఆఫీసర్లు చైర్మన్, డైరెక్టర్లుగా ఉంటూ వస్తున్నారు. సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ నేతృత్వంలో సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్అండ్ పర్సనల్ ఎస్.చంద్రశేఖర్ ఆప్మెల్ చైర్మన్గా సంస్థ వ్యవహారాలను చూస్తున్నారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేంద్రానికి, ఏపీ ప్రభుత్వానికి ట్యాక్సులు చెల్లిస్తున్నారు.  
షీలా బిడే కమిటీతో ఏపీ పట్టు..
ఆప్మెల్లో సింగరేణికి 81.54 శాతం , ఆంధ్రప్రదేశ్ఇండస్ర్టీయల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు 6శాతం, ప్రైవేట్షేర్ హోల్డర్స్కు 11శాతం చొప్పున వాటాలున్నాయి. సింగరేణిని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం– 2014 ప్రకారం షెడ్యూల్ 12లో చేర్చడంతో పూర్తి యాజమాన్య హక్కులు తెలంగాణ సర్కార్కు దక్కాయి. అయితే ప్రభుత్వ రంగ సంస్థలను షెడ్యూల్ 9,10 చేర్చడంతో కొండపల్లి వద్ద ఆప్మెల్యూనిట్ కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్కు చెందుతుందని 2018లో  షీలా బీడే కమిటీ అభిప్రాయపడింది. ఈ సిఫారసు ఆధారంగా  ఆప్మెల్ తమదేనని ఆంధ్రప్రదేశ్ సర్కార్వాదిస్తూ వచ్చింది. ఇందుకు మరో బలమైన కారణం ఉంది. కొండపల్లి నుంచి అమరావతి వరకు ఆప్మెల్కు చెందిన 206 ఎకరాలు విస్తరించి ఉండటంతో వందల కోట్ల విలువైన ఆ భూములు వదులుకోవడానికి ఆ రాష్ట్ర సర్కారు సిద్ధంగా లేదు. 2019లో ఇరు రాష్ట్రాల నడుమ జరిగిన మీటింగ్లో ఆప్మెల్ తమదేనని, ఇందులో ఏపీకి ఒక్క పైసా వాటా లేదని సింగరేణి యాజమాన్యం వాదించింది. 81.54శాతం వాటా ఉన్నందున ఆప్మెల్ తెలంగాణలోని సింగరేణికి చెందుతుందని, షీలా బీడే కమిటీ అభిప్రాయం షెడ్యూల్9కి విరుద్ధమని  తెలంగాణ సర్కార్ ఓసారి సెంట్రల్కు లెటర్ రాసింది. ఆ తర్వాత ఇక పట్టించుకున్నది లేదు. ఈ క్రమంలోనే గతేడాది  ఆగస్టు26న  ఆప్మెల్తమదేనని ఏపీ అధికారికంగా ప్రకటించి జీవో కాపీతో సింగరేణికి లెటర్ రాసింది. ప్రస్తుతం అప్మెల్లో తయారవుతున్న పరికరాల్లో సగం సింగరేణి వినియోగిస్తుండగా, కొంత కోలిండియా కొంటోంది. ఆప్మెల్ ఆర్థిక లావాదేవీలను కూడా సింగరేణి నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఏపీ సర్కార్ మొండిపట్టుదలకు పోకుండా ఆప్మెల్ను వదిలేస్తుందనే నమ్మకంతో ఇన్నాళ్లు సింగరేణి ఆఫీసర్లు ఉన్నారు. తాజాగా  కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్కుమార్ భల్లా ప్రకటన తో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వందల 
కోట్ల విలువైన భూముల కోసమే ఆప్మెల్ను  సొంతం చేసుకునేందుకు సెంట్రల్లో ఏపీ పావులు కదుపుతోందని, వెంటనే తెలంగాణ సర్కార్ స్పందించాలని సూచిస్తున్నారు. 

మొదట్లోనే అన్యాయం
దివాలా తీసిన కంపెనీలో సింగరేణి పెట్టుబడుల పుణ్యమా అని తెలంగాణ ప్రాంతంలోని నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆప్మెల్ కంపెనీలో సింగరేణికి అవసరమైన డ్రిల్బిల్టు, రాడ్స్, హాలర్రోలర్స్, డ్రమ్ములు, టబ్బులు తదితర సామగ్రి తయారవుతోంది. కొద్దికాలంగా కీలకమైన మ్యాన్రైడింగ్ సిస్టమ్స్కూడా ఇక్కడే తయారుచేయిస్తున్నారు. ఆప్మెల్తో సంబంధం లేకముందు ఈ సామగ్రిని సింగరేణి తన ఇంటర్నల్వర్క్షాపుల్లోనే తయారు చేసుకునేది. ఎప్పుడైతే అప్మెల్ను సింగరేణికి కట్టబెట్టారో అప్పటి నుంచి కోల్బెల్ట్ పరిధిలోని వర్క్షాపులన్నింటినీ ఒక్కొక్కటిగా మూసివేస్తూ వచ్చారు.  వాటిలో పనిచేసిన ఎంప్లాయిస్ను గోల్డెన్షేక్ హ్యాండ్ పేరిట సర్వీసు నుంచి తొలగించారు. మరోవైపు అప్పటివరకు సింగరేణిలో కొనసాగిన ఆంధ్రా ప్రాంత ఆఫీసర్లలో కొందరు ఆప్మెల్ కు డిప్యుటేషన్లపై వెళ్లిపోయారు.వర్క్ షాపులను మూసివేసిన సింగరేణి.ఆ తర్వాత నుంచి సంస్థకు అవసరమైన పరికరాలను ఆప్మెల్ నుంచి కొనుగోలు చేస్తూ వస్తోంది. ఏటా రూ.50 కోట్లకు పైగా ఆర్డర్లు ఇచ్చి, కంపెనీని పోషిస్తోంది.