హుజూర్ నగర్ జాబ్ మేళా.. 275 కంపెనీలు.. 4 వేల 574 మందికి ఉద్యోగాలు !

హుజూర్ నగర్ జాబ్ మేళా.. 275  కంపెనీలు.. 4 వేల 574 మందికి ఉద్యోగాలు !
  • హుజూర్ నగర్ జాబ్ మేళాకు 25 వేల మంది
  • తొలి రోజు భారీగా హాజరైన నిరుద్యోగులు
  • 275  కంపెనీలు పాల్గొనగా.. 4 ,574 మంది ఎంపిక
  • జాయినింగ్ ఆర్డర్స్ అందించిన మంత్రి ఉత్తమ్

సూర్యాపేట, వెలుగు: గ్రామీణ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. హుజూర్ నగర్ పెరల్స్ స్కూల్ లో నిర్వహించిన జాబ్ మేళాలో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ, సింగరేణి కాలరీస్ సహకారంతో 275 కంపెనీలు పాల్గొన్నాయి.  40 వేల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, మొదటిరోజు దాదాపు 25 వేల మంది పాల్గొన్నారు. వీరిని కంపెనీలు ఇంటర్వ్యూలు చేసి 4,574 మందిని రిక్రూట్ చేసుకోగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జాయినింగ్ ఆర్డర్స్ అందించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి కల్పించేందుకే మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో  తొలిసారిగా హుజూర్ నగర్ లో జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సారథ్యంలో రాష్ట్రంలో 70 వేల నుంచి 75 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.

స్థానిక కంపెనీలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలను తాను స్వయంగా సంప్రదించి జాబ్ మేళాలో పాల్గొనేందుకు ఒప్పించామన్నారు. అర్హులను ఎంపిక చేయడంతో పాటు  జాబ్ మేళాకు హాజరైన వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని ఆయా కంపెనీలను కోరినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, డీఐజీ ఎల్.ఎస్ చౌహన్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, సూర్యాపేట ఎస్పీ నరసింహా, నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఖమ్మం కమిషనర్ సునీల్ దత్, డీఈఈటీ  డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, అడిషనల్ కార్పొరేట్ రిలేషన్ డైరెక్టర్ వంశీధర్ రెడ్డి, సింగరేణి కాలరీస్ ప్రతినిధి చంద్ర  అధికారులు పాల్గొన్నారు.