గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో కార్మికులకు రక్షణ కరువైందని, ప్రశ్నించాల్సిన సంఘాలు పట్టించుకోవడంలేదని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి ఆరోపించారు. శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. సింగరేణి ఆర్జీ -–1 ఏరియాలోని జీడీకే 11వ గని పని స్థలాల్లో ఊపిరాడక కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ బాధను చెప్పుకుంటే కార్మికులపై అధికారులు వేధింపులకు దిగుతున్నారని మండిపడ్డారు.
తమకు నచ్చిన వారికి, భజనపరులకు ట్రాన్స్ ఫర్లు, ప్రమోషన్లు ఇస్తున్నారని, అర్హులను పక్కనపెడుతున్నారని విమర్శించారు. అధికారులు తీరు మార్చుకోకపోతే కార్మికుల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి, లీడర్లు నూనె కొమురయ్య, పర్లపల్లి రవి, జోసఫ్, సురేందర్ పాల్గొన్నారు.
