- ఆఫీసర్లకు చెప్పినా సమస్యను పరిష్కరించడంలేదని ఆవేదన
జగిత్యాల, వెలుగు: ప్రభుత్వ రోడ్డును కబ్జా చేయడంతో పాటు తమను ఇంట్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ వృద్ధ దంపతులు జగిత్యాల కలెక్టరేట్ వద్ద శనివారం వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు. జిల్లాలోని వెల్గటూర్ మండలం జగదేవ్‌పేట గ్రామానికి చెందిన నూకల నర్సవ్వ, మల్లయ్య దంపతులు మాట్లాడుతూ.. 1981లో ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్ల స్థలాలను ఇచ్చిందని పేర్కొన్నారు.
ఆ స్థలాలకు అనుకుని తమకు పట్టా భూమిలో ఇల్లు ఉందని తెలిపారు. ప్రభుత్వ రోడ్డు స్థలాన్ని ఇద్దరు వ్యక్తులు కబ్జా చేశారని చెప్పారు. మూడు ఇండ్లు కట్టేందుకు బెస్ మెంట్ పోశారని, దీనిపై 2024 ఏప్రిల్‌లో అప్పటి కలెక్టర్ యాస్మిన్ బాషాకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేయగా తహసీల్దార్ ఇరువర్గాలను బైండోవర్ చేసినట్లు తెలిపారు. కాగా.. రోడ్డుపైన బెస్‌మెంట్ రాళ్లను తొలగించలేదని, ఇంకా అవి అట్లనే ఉన్నాయని వృద్ధ దంపతులు చెప్పారు. ప్రభుత్వ రోడ్డుపై బండరాళ్లు, మోరం పోసి రాకపోకలు అడ్డుకుంటున్నారని, అలాగే ప్రభుత్వ స్థలానికి బదులుగా తమ పట్టాభూమి ఇవ్వాలని కబ్జాదారులు ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యపై కలెక్టర్ స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని వృద్ధ దంపతులు కోరారు.
