‘ఆప్మెల్’ సింగరేణిదే

‘ఆప్మెల్’ సింగరేణిదే

 విజయవాడలో ఉన్న (ఆంధ్రప్రదేశ్ హెవీ మిషినరీ  అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్) 'ఆప్మెల్ '  తెలంగాణది, సింగరేణిది.  గత బీఆర్ఎస్  ప్రభుత్వం దాని కోసం గట్టి ప్రయత్నం చేయలేదు. షీలాబీడే కమిటీ అన్యాయపు రిపోర్ట్ మీద చడీ చప్పుడు లేదు. సింగరేణిని పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒకసారి 'ఆప్మెల్' మీద సమావేశం ఏర్పాటు చేయాలి.  దేశంలోనే  మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి ప్రగతి బాటలో పయనిస్తోంది. ఐఆర్ఎస్ అధికారి 

ఎన్. బలరాం లాంటి నిజాయితీ,  పట్టుదల గల అధికారిని సంస్థకు సీఎండీగా నియమించడం ద్వారా నల్ల నేల భవిష్యత్తు మీద ఆశలు పెరిగాయి. 135 ఏండ్ల చరిత్ర సింగరేణిది . సింగరేణి లేని తెలంగాణను ఊహించుకోలేం.

ఏపీ నుంచి తెలంగాణ విడిపోయి పది సంవత్సరాలు అవుతోంది.-- విజయవాడ,  వైజాగ్​లో  వందల కోట్ల విలువగల సింగరేణి భూములు ఉన్నాయి. ఈ  పది ఏండ్ల నుంచి ఆంధ్రప్రదేశ్​లో ఉన్న  దాదాపు రూ.1000 కోట్ల ఆస్తి  సింగరేణికి చెందినదే.  విభజన చట్టం ప్రకారం ఇది సింగరేణికి చెందాలి.  ఇప్పటివరకు ఈ పది ఏండ్లలోనూ  సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ ఉన్నవారే  దీనికి చైర్మన్​గా  ఇతర సింగరేణి వారు సభ్యులుగా పాలక మండలి కొనసాగుతున్నది. 

ఇప్పటివరకు పది ఏండ్లలో  షెడ్యూల్ 9లో  ఉన్న సంస్థల విభజనకు సంబంధించి షీలాబీడే కమిటీ పదిసార్లు  సమావేశమైంది. అటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు రావాలని పలుమార్లు సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎప్పుడూ వెళ్లలేదు. ఎందుకు వెళ్ళాలి?-  అక్కడి అసెంబ్లీకి  మనవాళ్ళను పిలిచే హక్కు ఎలా ఉంటుంది?   ఆప్మెల్ ఏపీ 2018 మార్చిలో  జరిగిన సమావేశం అనంతరం షీలాబీడే  కమిటీ ఆప్మెల్ 
ఆంధ్రప్రదేశ్​కు చెందుతుందని18-–03–-2018న ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. కానీ కేంద్రం మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. -------

ఐదు ఏండ్ల తర్వాత లాభాల్లోకి!

 రూ.50 కోట్లకు పైగా సింగరేణి ప్రతి ఏటా  ఆప్మెల్ కు అర్డర్లు కూడా ఇవ్వడం జరుగుతున్నది.  క్యాష్ రిజర్వ్​లు కూడా దీనికి ఉన్నాయి.  దీనంతటికి సింగరేణి కారణం.  అమరావతికి  8 కిలోమీటర్ల  దూరంలో దాదాపు 250 ఎకరాల భూమి, అటోనగర్లో 30 ఎకరాలు ఇలా మొత్తం రూ.1000 కోట్ల  విలువ చేసే  భూములు ఆప్మెల్ ఆస్తిగా ఉన్నాయి.  గతంలో  మాజీ  ఎంపీ లగడపాటి రాజగోపాల్  ఈ భూములను కొనుగోలు చేసే ప్రయత్నం చేయగా  తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సింగరేణీయులు ఆందోళన చేయడంతో ఆగిపోయింది. 

అలాంటి ఆప్మెల్ ఇప్పుడు  షీలాబీడే కమిటీ సిఫార్సుతో ఆంధ్రప్రదేశ్​కు  ఎలా ఇస్తారు?-  ఖాయిలా సంస్థను అప్ప జెప్పారు.---- మొత్తానికి ఖాయిలా పడే , మూతపడిపోయే స్థాయిలోఉన్న సంస్థను సింగరేణి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోని తెలుగుదేశం  ప్రభుత్వం రివైవల్ పేరిట ఒక జీవో జారీ చేసి అంటగడితే  దానిని లాభాల బాటలోకి తీసుకురావడం తప్పయి పోయిందా? మా ఆప్మెల్ ఏపీది ఎలా అవుతుంది?.  ఇప్పటికీ  సౌత్ ఈస్టర్న్ సంస్థ నుంచి రూ.10 నుంచి రూ. 18 కోట్ల వరకు ఆప్మెల్​కు ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. 

గతంలో ఒక ఏడాది సింగరేణి ఆర్డర్ తగ్గితేనే రూ.2 కోట్ల వరకు నష్టాలు వచ్చిన  దాఖలాలున్నాయి.  అలాంటిది సింగరేణి  లేకుండా ఈ రోజు ఆ రూ.35 కోట్ల  టర్నోవర్ కాకుండా  దాదాపు  రూ.1000 కోట్ల ఆస్తిగా ఉన్న ఆప్మెల్ దాని భూములు ఆంధ్రప్రదేశ్ కు  ఎలా వర్తిస్తాయి?  సింగరేణి యాజమాన్యం,  డైరెక్టర్స్,  తెలంగాణ ప్రభుత్వం ఆప్మెల్ తెలంగాణాదే అని అంటున్నారు.   దానిని టేకోవర్ చేసినప్పుడు ఒక కార్పొరేషన్​గా  తీసుకున్నప్పుడు అది తెలంగాణది కాకుండా అంధ్రప్రదేశ్​ది ఎలా అవుతుంది?.

ఆప్మెల్​ కోసం ఉద్యమం

కేంద్ర ప్రభుత్వం న్యాయంగా ఆలోచించకపోతే  ఆప్మెల్ కోసం తెలంగాణలో మరో ఉద్యమం తప్పదు. అక్కడ  ఉద్యోగులను  తెలంగాణ ఉద్యోగులుగా,  సింగరేణి ఉద్యోగులుగా ఇంకా సింగరేణి భావిస్తునే ఉంది.  వారికి ఇంకా  సింగరేణి జీతాలు ఇస్తూనే ఉంది.  ఒడిశాలోని  నైనీలో 50 మిలియన్ టన్నుల బొగ్గుబ్లాకును సింగరేణికి కేంద్రం కేటాయించింది. దానిని తవ్వడానికి సంస్థ సిద్ధపడి రూ. 500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టింది. 

అది తెలంగాణ ఆస్తి. అది తెలంగాణ బొగ్గు బ్లాక్ కాకుండా ఒడిశాది అవుతుందా?  అలాగే ఆప్మెల్​ కూడా ఏపీది కాదు కదా! బేషరతుగా తెలంగాణకు ఆప్మెల్​ను  అప్పజెప్పాల్సిందే. సింగరేణి ఆస్తి అయిన  ఆప్మెల్ అనేది ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదని, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ విభజన కోసం ఏర్పాటు అయిన షీలాబిడే  కమిటీ ఇచ్చిన రిపోర్ట్​ను స్టడీ చేయాలి. మన కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి.

81.54 శాతం సింగరేణి వాటా

సింగరేణి యాజమాన్యం ఆప్మెల్ తమదేనని వాదించింది.  దీనిపై కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  అప్పటి నుంచి ఇప్పటివరకు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర హోం శాఖ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.  ఎందుకంటే ఇందులో  సింగరేణికి 81.54 శాతం వాటా ఉంది.  ఏపీఐడీసీకి 5.79 శాతం వాటా ఉంది.  పబ్లిక్ షేర్ హోల్డర్లు 11.81 శాతం ఉన్నారు.  దీని ప్రకారం ఆప్మెల్  తెలంగాణలోని సింగరేణికి చెందుతుంది.  షీలాబీడే  కమిటీ  తీసుకున్న నిర్ణయం షెడ్యూల్ 9 ప్రకారం పూర్తి విరుద్ధమైనది. తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో కేంద్రానికి  లేఖ రాసింది.

  గతంలో  మాజీ సీఎం కేసీఆర్  కూడా దీనిపై కేంద్ర ప్రభుత్వంతో  చర్చించారు.  వాస్తవానికి  విజయవాడలోని  కొండాపూర్  సమీపంలో 1976లో ఏర్పడిన ఆప్మెల్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్  డెవలప్మెంట్ కార్పొరేషన్  కిందికి వస్తుంది. కాబట్టి ఆస్తి  పంపకాల పరిధిలోకి అసలు రానే రాదు. 1994లో  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం సింగరేణికి ఆప్మెల్​ను అప్పజెప్పింది.  భారీ నష్టాలలో కూరుకుపోయి దాదాపు మూతపడే  పరిస్థితుల్లో  సింగరేణి  దీనిని  టేకోవర్ చేసింది.  పెట్టుబడులు పెట్టి వరుసగా ప్రతి సంవత్సరం రూ.50 కోట్లకు పైగా లాభాల్లోకి తీసుకొచ్చింది.  పైగా సిబ్బందికి అక్కడ వేతనాలు కూడా సింగరేణి ఇస్తున్నది. 

- ఎండీ. మునీర్,  సీనియర్ జర్నలిస్ట్