APL 2024: 4, 6, 6, 6, 4, 6.. రాయలసీమ బ్యాటర్ సరికొత్త రికార్డు

APL 2024: 4, 6, 6, 6, 4, 6.. రాయలసీమ బ్యాటర్ సరికొత్త రికార్డు

ఆంధ్ర పీమియర్ లీగ్(ఏపిఎల్) 2024లో సరికొత్త రికార్డు నమోదైంది. బెజవాడ టైగర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాయలసీమ బ్యాటర్ డీబీ ప్రశాంత్ వీరవిహారం చేశాడు. 15 బంతుల్లోనే 50 మార్క్ చేరుకొని.. టోర్నీ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 20 బంతులాడిన ఈ అనంతపురం బ్యాటర్.. 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు.

ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బాదడం మొదలెట్టిన ప్రశాంత్.. బెజవాడ బౌలర్లను తునాతునకలు చేశాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. సాయి తేజ వేసిన ఐదవ ఓవర్‌లో 4, 6, 6, 6, 4, 6 బాదాడు. ఆ ఓవర్‌లో ఏకంగా 32 పరుగులు వచ్చాయి. ప్రశాంత్ ధాటికి రాయలసీమ జట్టు పపవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోయి 73 పరుగులు చేసింది. ఆ మరుసటి ఓవర్‌లోనే అతను ఔటవ్వగా.. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు ఆ జోరును కొనసాగించలేకపోయారు. చివరలో గుత్తా రోహిత్(19 బంతుల్లో 32) మెరుపులు మెరిపించాడు. దాంతో, నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి రాయలసీమ కింగ్స్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.