ఇండియాలో మరిన్ని ఐఫోన్ల తయారీ

ఇండియాలో మరిన్ని ఐఫోన్ల తయారీ
  • యూఎస్‌‌కు ఎగుమతి చేసేవాటిని ఇక్కడే తయారు చేయాలని యాపిల్‌‌ ప్లాన్‌‌
  • చైనా నుంచి తయారీని షిఫ్ట్ చేస్తున్న కంపెనీ
  • 2026 నాటికి ఏడాదికి 6 కోట్ల ఫోన్ల తయారీనే టార్గెట్

న్యూఢిల్లీ: అమెరికాకు  ఎగుమతి చేసే అన్ని ఐఫోన్లను ఇండియాలో తయారు చేయాలని యాపిల్ చూస్తోంది. ఇందుకోసం చైనా, ఇతర దేశాల నుంచి తయారీని షిఫ్ట్ చేసే ప్లాన్‌‌లో ఉందని స్మార్ట్‌‌ఫోన్ల వివరాలను తెలియజేసే  జీఎస్‌‌ఎం ఎరీనా పేర్కొంది. అమెరికా ప్రెసిడెంట్‌‌  డొనాల్డ్ ట్రంప్ తన మొదటి టర్మ్‌‌లో చైనాతో టారిఫ్‌‌ వార్‌‌‌‌ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆ టైమ్‌‌లోనే  ఇండియాకు  కొంత తయారీ సామర్ధ్యాన్ని మార్చాలని యాపిల్ నిర్ణయించుకుంది. ఆయన తన రెండో టర్మ్‌‌లో చైనాపై 145 శాతం టారిఫ్ వేశారు. మరోవైపు ఇండియా అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకునే పనిలో ఉంది. 

ఇంకా ఇండియాపై ట్రంప్ ప్రభుత్వం 26 శాతం టారిఫ్‌‌నే వేసింది. దీని అమలును 90 రోజుల పాటు వాయిదా వేసింది కూడా.  ప్రస్తుతం యాపిల్ ఫోన్లలో సుమారు 70 శాతం చైనాలోనే తయారవుతున్నాయి.  పూర్తిగా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని యాపిల్ ప్లాన్ చేస్తుండగా, అందులో భాగంగానే తన తయారీ సామర్ధ్యంలో కొంత భాగాన్ని ఇండియాకు మార్చాలని చూస్తోంది.

 అమెరికాలో ఏడాదికి 6 కోట్ల ఐఫోన్‌‌లు అమ్ముడవుతున్నాయని అంచనా.  భారతదేశంలో 2017 నుంచి  ఐఫోన్లను యాపిల్ తయారు చేస్తోంది. తైవాన్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ విస్ట్రాన్‌‌తో కలిసి బెంగళూరు ప్లాంట్‌‌లో  ఐఫోన్ 6ఎస్‌‌,  ఐఫోన్ ఎస్‌‌ఈ మోడళ్లను మొదటిగా తయారు చేసింది. జీఎస్‌‌ఎం  ఎరీనా ప్రకారం, ప్రస్తుతం మొత్తం ఐఫోన్లలో 14 శాతం ఇండియాలో తయారవుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ నెంబర్‌‌‌‌  25 శాతానికి పెరుగుతుందని అంచనా. 2026 నాటికి ఏడాదికి 6 కోట్ల ఫోన్లను తయారు చేయాలని కంపెనీ టార్గెట్‌‌గా పెట్టుకుందని జీఎస్​ఎం ఎరీనా వెల్లడించింది.