యాపిల్ ఐఓఎస్ కొత్త కొత్తగా..

యాపిల్ ఐఓఎస్ కొత్త కొత్తగా..

యాపిల్​ ఆపరేటింగ్​ సిస్టమ్​ లేటెస్ట్ వెర్షన్​  ‘ఐఓఎస్​13’. యాపిల్​ అభిమానులు ఎదురుచూస్తున్న ఈ అప్​డేటెడ్​ వెర్షన్​ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే నెల మూడు నుంచి ఏడు వరకు క్యాలిఫోర్నియాలో జరగనున్న ‘వరల్డ్​వైడ్​ డెవలపర్స్​ కాన్ఫరెన్స్–19’​(డబ్ల్యూడబ్ల్యూడీసీ–19)లో ‘ఐఓఎస్–13’కు సంబంధించిన వివరాల్ని యాపిల్​ వెల్లడించనుంది.

స్మార్ట్​ఫోన్స్,  ల్యాప్​టాప్స్,  మ్యాక్​ బుక్స్,  ట్యాబ్లెట్స్, ఇతర పరికరాలను రూపొందిస్తున్న ‘యాపిల్’ తమ సంస్థకు సంబంధించిన ప్రణాళికలు, విశేషాలను ప్రతిఏటా డబ్ల్యూడబ్ల్యూడీసీలో వెల్లడిస్తుంది. ఈ ఏడాదికి సంబంధించి వచ్చే నెలలో ఈ కాన్ఫరెన్స్​ జరగనుంది. దీనిలో  యాపిల్​ సంస్థకు చెందిన ప్రతినిధులు, డెవలపర్లు పాల్గొంటారు. ఈ కాన్ఫరెన్స్​లో అన్నింటికంటే ఎక్కువగా ఆకర్షిస్తున్న అంశం ‘ఐఓఎస్–13’. దీని కోడ్​ నేమ్​ ‘యుకాన్’. ఈ కొత్త ఆపరేటింగ్​ సిస్టమ్​ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది.. ఫీచర్లు.. వంటివాటి గురించి వివరిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్​ తర్వాత విడుదలయ్యే ఐఫోన్​ లెవెన్, తర్వాతి మోడల్స్​ కొత్త ఐఓఎస్​తోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

అదే సమయంలో మిగతా ఫోన్లకూ అప్​డేట్​వస్తుంది. టెక్​ నిపుణుల అంచనా ప్రకారం ‘ఐఓఎస్–13’లో ఉండబోయే కొన్ని ఫీచర్లు.

డార్క్​ మోడ్

ఆండ్రాయిడ్​ ‘క్యూ’ వెర్షన్​లో డార్క్​ మోడ్​ను ప్రవేశపెడుతున్నట్లు ఇటీవలే గూగుల్​ ప్రకటించింది. దీంతో ఇదే ఫీచర్​పై యాపిల్​ కూడా దృష్టి సారించింది. యాపిల్​ కూడా రాబోయే అప్​డేట్​​లో డార్క్​మోడ్​ను అందుబాటులోకి తేనుంది. పైగా ఈ ఫీచర్​ను ఈజీగా యాక్సెస్​ చేసేలా రూపొందిస్తోంది. ఐఫోన్లలో హోమ్​ బటన్​ పైకి స్వైప్​ చేయడం ద్వారా డార్క్​మోడ్​ ఆన్​ అవుతుంది.

స్వైప్​ కీబోర్డ్

ఈసారి స్వైప్​ కీబోర్డును యాపిల్​ యాడ్​ చేస్తోంది. ఇది గూగుల్​ ‘జీబోర్డ్​ కీ’లాగా, ‘స్విఫ్ట్​ కీ’లాగా పని చేస్తుంది. ఐపాడ్ స్క్రీన్​ను మ్యాక్​ బుక్​కు సెకండ్  స్క్రీన్​గా వాడుకునే వీలుంది. ఇది ఇంతకుముందు ‘డ్యుయెట్​ డిస్​ప్లే’  యాప్​ ద్వారా అందుబాటులో ఉండేది. అలాగే ‘ఐపాడ్​ ప్రొ’ యూజర్లకు మౌస్​ సపోర్ట్​ లభించనుంది.

యాప్​ అప్​డేట్స్

ఐఓఎస్13తో యాపిల్​ యాప్స్​ అప్​డేట్​ అవుతాయి కాబట్టి కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. యాపిల్  మెసేజింగ్​ యాప్​ ‘ఐమెసేజెస్’. దీనికి వాట్సాప్​లాగే  డిస్ప్లే నేమ్, ప్రొఫైల్​ ఫొటో పెట్టుకునే అవకాశం కలగనుంది. మ్యాప్స్,  రిమైండర్స్​ యాప్స్​ మరిన్ని కొత్త ఫీచర్లతో పనిచేస్తాయి. క్లాక్స్​ యాప్​లో ‘స్లీప్​ మోడ్’ మరింత బాగా పనిచేస్తుంది. ఒక్కసారి ‘డునాట్​ డిస్టర్బ్’​ ఆన్​ చేస్తే లాక్​ స్క్రీన్​ డార్క్​గా మారిపోతుంది. కంట్రోల్​ సెంటర్​ నుంచి నోటిఫికేషన్స్​ కూడా మ్యూట్​ అవుతాయి. స్క్రీన్​ టైమ్​ కూడా అప్​డేట్​ అవుతోంది. దీనివల్ల పేరెంట్స్​ తమ పిల్లలు ఎంత సేపు స్క్రీన్​ వాడుకోవాలో నిర్ణయించుకోవచ్చు.

మరిన్ని ఫీచర్లు

  •  ‘సిరి’లో కూడా మార్పులు చేస్తున్నారు. కాల్​ వచ్చినప్పుడు ఆన్సర్​ చేయకపోతే, దానికి రీజన్​ చెప్తూ మెసేజ్​ను కాలర్​కు పంపుతుంది.
  • సాఫ్ట్​వేర్​లో మార్పులు చేయడం ద్వారా నైట్​ షూటింగ్​ మోడ్​ను మార్పు చేస్తున్నారు. దీనివల్ల రాత్రిపూట ఫొటోలు, వీడియోలు మరింత స్పష్టంగా వస్తాయి.
  • ఐ ఫోన్,  ఐప్యాడ్స్​పై మల్టీపుల్​ యూజర్​అకౌంట్స్​ యాక్సెస్​ చేయొచ్చు. ఒక్కరికంటే ఎక్కువ మంది ఒకే డివైజ్​ను వేర్వేరు పర్సనల్​ డివైజెస్​గా వాడుకోవచ్చు.
  • స్మార్ట్​ వై–ఫై అనే కొత్త ఫీచర్​ అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా ఒక ప్రదేశంలో వై–ఫై ఆన్ చేసినప్పుడు, ఆ ప్రదేశం మారగానే ఆటోమేటిగ్గా వై–ఫై ఆఫ్​ అవుతుంది. దీని వల్ల బ్యాటరీ ఎక్కువ సేపు వస్తోంది.
  • కాంటాక్ట్​ యాప్​లో నచ్చిన వ్యక్తులను ‘ఫేవరెట్’గా సెట్​ చేసుకోవచ్చు. కాంటాక్ట్స్​లో ఉన్న వ్యక్తులు ఎక్కడున్నారు? కాల్స్​ తీసుకోగలరా.. లేదా? అనే సమాచారం తెలుసుకోవచ్చు. అయితే ఇది ఐఫోన్​ యూజర్ల సమాచారాన్నే అందిస్తుంది.