కిరాయి స్పైవేర్ టార్గెటెడ్ అటాక్స్..ఐ ఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరిక

కిరాయి స్పైవేర్ టార్గెటెడ్ అటాక్స్..ఐ ఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరిక
  • నోటిఫికేషన్లు పంపి ఫోన్లో దూరే చాన్స్
  • భారత్ సహా 91 దేశాలకూ పంపే అవకాశం
  • పెగాసెస్ తరహా స్పైవేర్ తో సైబర్ అటాక్స్ 
  • గతంలో రాజకీయ, మీడియా ప్రముఖులకూ ఈ మెస్సేజ్ లు
  • మరో సారి అలెర్ట్ చేసిన యాపిల్ కంపెనీ

న్యూఢిల్లీ: భారత్ సహా 91 దేశాల్లో పెగాసెస్ తరహా కిరాయి స్పైవేర్ తో టార్గెటెడ్ సైబర్ అటాక్స్ జరిగే అవకాశం ఉందని యాపిల్ సంస్థ హెచ్చరించింది. ఐఫోన్ ఉత్పత్తుల్లోకి అక్రమంగా జొరబడే అవకాశం ఉందని ఎఫ్​ఏక్యూలో పేర్కొంది. ఈ మేరకు ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ తమ థ్రెట్  నోటిఫికేషన్ల వ్యవస్థను అప్డేట్ చేసింది.  ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ తయారు చేసిన పెగాసస్‌ వంటి వాటిని ‘కిరాయి స్పైవేర్‌’గా వ్యవహరిస్తుంటారు. హై టెక్నాలజీతో రూపొందించిన ఈ స్పైవేర్ తో రాజకీయ నాయకులు, మీడియా ప్రముఖులు, బ్యూరోక్రాట్లు, సినీ, వ్యాపార ప్రముఖులను మాత్రమే టార్గెట్ గా చేస్తుంటారు. సమాజంలో సదరు వ్యక్తుల పాత్ర, హోదా, స్థాయి ఆధారంగా ఎవరిని టార్గెట్‌ చేయాలనేది సైబర్‌ నేరగాళ్లు నిర్ణయిస్తారని యాపిల్‌ చివరిసారి నోటిఫికేషన్‌ జారీ చేసినప్పుడు వివరించింది. ఇప్పటి వరకు వీటిని గవర్నమెంట్ సపోర్టెడ్ సైబర్ అటాక్స్ గా వివరించిన యాపిల్ సంస్థ ఇప్పుడు ‘కిరాయి స్పైవేర్‌ ముప్పు’గా చెబుతుండటం గమనార్హం. 

మెర్సినరీ స్పైవేర్ ద్వారా ఇప్పటికే అటాక్

మెర్సినరీ స్పైవేర్‌ ద్వారా పలువురి ఐఫోన్‌ సహా ఇతర ఉత్పత్తుల్లోకి సైబర్‌ నేరగాళ్లు ఇప్పటికే చొరబడినట్లు గుర్తించామని యాపిల్‌ పేర్కొంది. ఎప్పుడు, ఎవరిపై ఈ సైబర్‌ దాడులు చోటు చేసుకొంటాయనేది ముందుగా గుర్తించడం కష్టమని చెబుతూనే.. సైబర్ అటాక్స్ జరుగుతాయని  కచ్చితంగా చెప్పగలమని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు యూజర్లను అప్రమత్తం చేయటంతో పాటు తగిన జాగ్రత్తలు సూచిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలిపాయి.  

గతేడాది పలువురికి హెచ్చరికలు

ఇండియాలో గతేడాది అక్టోబర్ లో కొంత మంది రాజకీయ, మీడియా ప్రముఖులకు యాపిల్ సంస్థ పంపిన నోటిఫికేషన్ అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.  అప్పట్లో గవర్నమెంట్ సపోర్ట్ ఉన న   సైబర్ నేరగాళ్లు లక్ష్యం చేసి ఉండొచ్చని హెచ్చరికల్లో యాపిల్ సంస్థ పేర్కొంది. ఇలా నోటిఫికేషన్లు అందుకున్న వారిలో కాంగ్రెస్ అగ్రనేత శశిథరూర్, తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా సహా మీడియా ప్రముఖులు కూడా ఉండటం గమనార్హం. తాజా హెచ్చరికల నేపథ్యంలో ఐఫోన్ వినియోగదారుల్లో ఏం జరుగుతుందోననే టెన్షన్ మొదలైంది.