యాపిల్​ ‘స్పేస్​ షిప్​’ క్యాంపస్ ప్రత్యేకతలు

యాపిల్​ ‘స్పేస్​ షిప్​’ క్యాంపస్ ప్రత్యేకతలు

యాపిల్​ కంపెనీ ఏం చేసినా స్పెషలే. దాని లోగోనే ఒక పెద్ద స్పెషల్​. చిలక కొరికిన పండులా ఉంటుంది ‘యాపిల్​’. ఇప్పుడు ఆ కంపెనీ క్యాంపస్​ మరింత స్పెషల్​. ఎందుకంటే అది ‘నేల’పైన ఉండదు కాబట్టి.  సాసర్​లో టీ కప్పు ఒదిగినట్టు.. స్టీల్​ సాసర్ల మీద నిలబడతది ఆ క్యాంపస్​. ప్రాణాంతక భూకంపాలకు పెట్టింది పేరు కాలిఫోర్నియా. అలాంటి భూకంపాలకూ ఎదురు తిరుగుతది ఆ క్యాంపస్​. ‘స్పేస్​షిప్​’ షేప్​లా దాన్ని కట్టడం మరింత స్పెషల్​. బేస్​ ఐసోలేషన్​ టెక్నాలజీ అనే ఇంజనీరింగ్​ టెక్నిక్​తో దీన్ని కట్టారు. అందులో భాగంగా 692 ఉక్కు సాసర్లపై పటిష్టంగా నిలబెట్టారు దాన్ని. ఆ సాసర్లు భూమిలోపల రెండంతస్తుల కింద ఏర్పాటు చేస్తారు. పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినా ఆ సాసర్లపై ఉన్న ఈ బిల్డింగ్​ అటూ ఇటూ ఊగుతుందే తప్ప కూలిపోదు. అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంపెనీ చీఫ్​ డిఐన్​ ఆఫీసర్​ జానీ ఐవ్​ ఆ బిల్డింగ్​ విశేషాలు  వెల్లడించారు.

₹3.46 లక్షల కోట్లు
యాపిల్​ పార్క్​ నిర్మాణం 2018లో పూర్తయింది. దాదాపు ₹3.46 లక్షల కోట్లు (500 కోట్ల డాలర్లు) ఖర్చు చేశారు. 28 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో కట్టిన క్యాంపస్​లో 12 వేల మంది ఉద్యోగులు పనిచేయొచ్చు. క్యాంపస్​ పైకప్పుపై 8.05 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో సోలార్​ పానెళ్లు ఏర్పాటు చేశారు. వేడిగాలి బయటకు పోయి స్వచ్ఛమైన గాలి లోపలకు వచ్చేలా ‘సోఫిట్​ (ఆర్క్​ లాంటి నిర్మాణం)’లు ఏర్పాటు చేశారు. దీంతో దాన్ని ‘బ్రీతింగ్​ బిల్డింగ్​’ అని కూడా పిలుస్తున్నారు. స్టీవ్​ జాబ్స్​కు కృత్రిమమైన ఎయిర్​ కండిషనింగ్​ వ్యవస్థలంటే నచ్చవట. అందుకే ప్రకృతి నుంచే స్వచ్ఛమైన గాలిని తీసుకునేలా ఈ ఏర్పాట్లు చేశారని చెబుతున్నారు. అంతేగాకుండా యాపిల్​ పార్క్​లో వెయ్యి సీట్ల స్టీవ్​ జాబ్స్​ థియేటర్​నూ కట్టారు. అక్కడే ప్రస్తుత సీఈవో టిమ్​ కుక్​ కొత్త ప్రొడక్ట్​లకు సంబంధించిన వివరాలు, లాంచింగ్​లు చేస్తారు. యాపిల్​ ప్రొడక్ట్స్​ నేరుగా కొనుక్కునేందుకు యాపిల్​ రిటైల్​ స్టోర్​నూ అందులోనే పెట్టారు. పబ్లిక్​ కేఫేలూ అందుబాటులో ఉంచారు. ఇంత కట్టినా క్యాంపస్​ పచ్చగా కళకళలాడేలా లోపల మొత్తం చెట్లు, మొక్కలు నాటించి పర్యావరణంపైనా ప్రేమను చాటారు. మొత్తం 9 వేల చెట్లు నాటారు. గార్డెన్​లు కట్టించారు. దీంతో ఓ పెద్ద పార్క్​లో ఉన్న అనుభూతి కలుగుతుందట అక్కడ పనిచేసేటోళ్లకు.

మరిన్ని ప్రత్యేకతలు
కాలిఫోర్నియాలోని కుపర్టినోలో నాలుగంతస్తుల్లో ఈ క్యాంపస్​ను కట్టారు. వృత్తాకార బిల్డింగ్​ నుంచి మంచి వ్యూ ఉండేలా మొత్తం గ్లాస్​ విండోలు అమర్చారు. దీంతో దీన్ని ‘మాసివ్​ డోనట్​ గ్లాస్​’ అని ముద్దుగా పిలుస్తున్నారు. అంతేకాదు, ఫిట్​గా ఉండేందుకు జాగింగ్​, సైక్లింగ్​ కోసం 3.2 కిలోమీటర్ల ట్రాక్​నూ కట్టారు. ఎప్పుడూ వెయ్యి బైకులు ఉద్యోగులకు అందుబాటులో పెడతారు. జిమ్​ కూడా ఉంది. రీసెర్చ్​ కోసం 3 లక్షల చదరపుటడుగుల స్థలాన్ని కేటాయించారు. అండర్​గ్రౌండ్​లో పార్కింగ్​ సౌకర్యం కల్పించారు. ఇంత పెద్ద బిల్డింగ్​కు కరెంట్​ సౌకర్యం కూడా అంతే ఉండాలి కదా. ప్రధానంగా నేచురల్​ గ్యాస్​ (సహజంగా లభించే వాయువులు)తో కరెంట్​ అవసరాలు తీర్చుకుంటారు. దానికి అదనంగా సోలార్​ పానెళ్లు పెట్టారు. ఒకవేళ ఎమర్జెన్సీ ఎదురైతే స్థానికంగా ఉన్న కరెంట్​ గ్రిడ్​ల నుంచి కరెంట్​ తీసుకుంటారు. ఏసీలు ఎక్కువగా వాడకుండా ఏడాదిలో 70 శాతం మేర ప్రకృతి వెంటిలేషన్​నే వాడుకునేలా డిజైన్​ చేశారు. క్యాంపస్​లోనే రీసైక్లింగ్​ యూనిట్​లు ఏర్పాటు చేశారు. తక్కువ కరెంట్​ తీసుకునే ఎల్​ఈడీ లైట్లను పెట్టారు.

స్టీవ్ జాబ్స్ ఆలోచనే
దీన్నే యాపిల్​ పార్క్​ అని పిలుస్తున్నారు. నిజానికి ఈ ఆలోచన ఇప్పటిది కాదు. అప్పుడెప్పుడో కంపెనీ కో ఫౌండర్​ (కంపెనీ పెట్టిన వారిలో ఒకరు) స్టీవ్​ జాబ్స్​ ఆలోచన ఇది. జపాన్​లో ఎక్కువగా బేస్​ ఐసోలేషన్​ టెక్నాలజీతోనే బిల్డింగులు కడుతుంటారు. దాని వల్ల పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం జరగదు. దీంతో ఆ ఆలోచనే స్టీవ్​ జాబ్స్​ మైండ్​లో మెదిలిందట. చాలా సార్లు ఈ టెక్నాలజీపై ఐవ్​తో ఆయన మాట్లాడారట. 2011లో ఆయన చనిపోవడానికి కొద్ది నెలల ముందే బిల్డింగ్​ రూపురేఖలను తయారు చేశారు. వృత్తాకారంలో ఉండడంతో దానికి ముద్దుగా ‘స్పేస్​షిప్​’ అన్న పేరు
పడిపోయింది.