
న్యూఢిల్లీ, వెలుగు: ప్రజా గాయకుడు గద్దర్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ‘గద్దర్ ప్రజా పార్టీ’పేరుతో రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)కి దరఖాస్తు చేయనున్నారు. ఈ మేరకు గద్దర్ తన బృందంతో మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. ఈసీ అధికారులను కలిసి కొత్త పార్టీకి సంబంధిన కాగితాలను ఆయన అందించనున్నారు.
గద్దర్ తన కొత్త పార్టీ జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే.. జెండా మధ్యలో పిడికిలిని పెట్టి.. జెండాలో ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగులతో తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. గద్దర్ నక్సలిజం నుంచి వచ్చారు. పోరాటమే ఊపిరిగా బతికారు. అంబేద్కర్ విజనరీ నుంచి ఎర్ర జెండా వైపు వెళ్లారు. తన పాటలతో బడుగు, బలహీన వర్గాలను ఆకట్టుకున్నారు. గద్దర్ పాట అంటే ప్రాణం ఎంతో మందికి. ఆయన గజ్జెకట్టి.. పాట పాడారు అంటే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుంది. తెలంగాణ ఉద్యమంలోనూ తనదైన ముద్ర వేశారు.