
- ఇంకా మూడు రోజులే అప్లికేషన్లకు చాన్స్.. యాదాద్రి జిల్లాలో మొత్తం 82 వైన్స్‌లు
- ఎల్లంబాయి, ఆరూర్ వైన్స్లకే ఎక్కువ
- గత సారి మొత్తం 3969 అప్లికేషన్లు..
- మొత్తం 1013 అప్లికేషన్లు.. గడువు రెండ్రోజులు
యాదాద్రి, వెలుగు: కొత్త వైన్స్ షాపుల కోసం అప్లికేషన్లు ఆహ్వానించగా పెద్దగా స్పందన లభించడం లేదు. గడువు ముగియడానికి ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటివరకూ అప్లికేషన్ల ప్రక్రియ స్పీడ్అందుకోలేదు. చివరకు మున్సిపాలిటీల్లోని వైన్స్‌లకు కూడా అప్లికేషన్లు సరిగా రావడం లేదు. అప్లికేషన్లు రాని వైన్సులు కూడా పదుల సంఖ్యలో ఉన్నాయి.
జిల్లాలో 82 వైన్సులు
యాదాద్రి జిల్లాలో 82 వైన్స్‌లు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం లిక్కర్ షాపుల లైసెన్స్ ఫీజులను నిర్ధారించారు. 5 వేల జనాభా కలిగిన గ్రామాలకు రూ. 50 లక్షలు, 5 వేల నుంచి 50 వేల జనాభా కలిగిన ప్రాంతాలకు రూ.55లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా వరకు రూ. 60 లక్షలు లైసెన్స్‌ఫీజు నిర్ణయించారు. ఈ లెక్కన 20 వైన్స్‌లకు రూ. 50 లక్ష చొప్పున, 46 షాపులకు రూ. 55 లక్షల చొప్పున, 16 షాపులకు రూ. 60 లక్షల చొప్పున ఫీజు నిర్ణయించారు.
గత పాలసీలో ఫుల్ఇన్కం
2023-–25 ఎక్సైజ్ పాలసీ సమయంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు దగ్గరికి వచ్చాయి. దీంతో అప్లికేషన్లు పెద్ద ఎత్తున వచ్చాయి. 2019–-21 ఎక్సైజ్ పాలసీలో జిల్లాలో 69 షాపులు ఉండగా.. 1620 అప్లికేషన్లు వచ్చాయి. దీంతో రూ.31.40 కోట్ల ఇన్‌కం వచ్చింది. 2021-–23లో షాపుల సంఖ్య పెరిగినా.. 1379 అప్లికేషన్లే రావడంతో రూ. 3.82 కోట్ల ఇన్‌కం తగ్గి రూ. 27.58 కోట్లు మాత్రమే వచ్చింది. 2023–-25 పాలసీలో3969 అప్లికేషన్లు వచ్చాయి. దీంతో రూ. 79.38 కోట్ల ఇన్‌కం వచ్చింది.
ఆశించిన స్థాయిలో వస్తలే
స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా జరిగే అవకాశం ఉన్నందున ఈసారి అప్లికేషన్ల సంఖ్య పెరిగి ఇన్‌కం ఎక్కువగా వస్తుందని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆశించింది. గత నెల 26న అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఇప్పటివరకూ నిర్వాహకుల నుంచి అనుకున్న స్థాయిలో స్పందన
లభించడం లేదు.
వీటికే ఎక్కువ అప్లికేషన్లు
కాగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని వైన్స్ లకు ఎక్కువగా అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో రామన్నపేట మండలంలోని ఎల్లంబావికి 60 అప్లికేషన్లు, వలిగొండ మండలంలోని అరూరు వైన్స్ కు 49, భువనగిరి మండలం అనాజీపూర్ వైన్స్కు 31, దండు మల్కాపూర్ 29, నేలపట్లలో 28 వచ్చాయి. మొత్తంగా గురువారం వరకూ 1013 అప్లికేషన్లు వచ్చాయి. గడువు ఇంకా రెండు రోజులే మిగిలి ఉండడంతో చివరి రోజుల్లో ఎక్కువగా వస్తాయని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆశిస్తోంది.
మున్సిపాలిటీలకూ సరిగా వస్తలే..
చివరకు మున్సిపాలిటీ పరిధిలోని వైన్స్ లకు కూడా అప్లికేషన్లు చెప్పుకోదగ్గట్టుగా రావడం లేదు. జిల్లా కేంద్రమైన భువనగిరి సహా ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలోని వైన్స్కు కూడా ఇప్పటివరకూ రెండెంకెల అప్లికేషన్లు దాటలే. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 10 షాపులు ఉండగా 129 అప్లికేషన్లు వచ్చాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీలో 7 షాపులు ఉండగా 107, యాదగిరిగుట్టలో 5 షాపులు ఉండగా 58 అప్లికేషన్లు వచ్చాయి. ఆలేరు మున్సిపాలిటీలో 4 ఉండగా 32 అప్లికేషన్లు వచ్చాయి. మోత్కూరు మున్పిపాలిటీలో నాలుగు షాపులు ఉండగా 30 అప్లికేషన్లు,. పోచంపల్లిలో మూడు షాపులు ఉండగా 29 అప్లికేషన్లు వచ్చాయి.