- 3,47,970 అర్జీలను రిజెక్ట్ చేసిన కలెక్టర్లు
- ప్రభుత్వ పెద్దలవి మాత్రం జెట్ స్పీడ్‌తో క్లియర్
- లక్షలాది రైతుల అప్లికేషన్లు పెండింగ్.. లేదా రిజెక్ట్
హైదరాబాద్, వెలుగు: భూ సమస్యల పరిష్కారంకోసం ధరణి పోర్టల్‌కు అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 10 లక్షలు దాటింది. వీటిలో కొన్నింటిని కలెక్టర్లు అప్రూవ్ చేసినా.. ధరణిలో రికార్డు అప్ డేట్ కావడం లేదు. లక్షలాది అప్లికేషన్లను కలెక్టర్లు పరిశీలించకుండానే రిజెక్ట్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్రూవ్ అయిన అప్లికేషన్లన్నింటికీ పరిష్కారం చూపడంలేదు. అప్లికేషన్లను ఎందుకు రిజెక్ట్ చేశారనే దానిపై కారణాలు చెప్పడం లేదు.
3,47,970 అప్లికేషన్లు రిజెక్ట్..
ధరణిలో మొత్తం 33 రకాల మాడ్యూల్స్ ఉన్నాయి. ఇందులో వివిధ సమస్యలపై అప్లికేషన్ పెట్టుకునేవి 21 మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో 16 రకాల మాడ్యూల్స్ ద్వారా వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 10.15 లక్షలుగా ఉంది. ఏప్రిల్ 29న తీసుకొచ్చిన టీఎం 33 మాడ్యుల్ ద్వారా పాస్ బుక్ డేటా కరెక్షన్‌కు మరో లక్ష దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల రెవెన్యూ శాఖ సీఎంఓకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. 10.15 లక్షల అప్లికేషన్లలో 6,04,949 అప్లికేషన్లు అప్రూవ్ చేశారు. 3,47,970 అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. ఇంకా 62,508 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ల్యాండ్ మ్యాటర్స్ గ్రీవెన్స్ మాడ్యుల్ ద్వారా అత్యధికంగా 3.16 లక్షల అప్లికేషన్లు రాగా.. ఇందులో 1.86 లక్షల అప్లికేషన్లు అప్రూవ్ చేసి, 1.18 లక్షల అప్లికేషన్లు రిజెక్ట్ చేశారు. పెండింగ్ మ్యుటేషన్లు కూడా 58 వేల పైనే రిజెక్టయ్యాయి. వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా పొరపాటున ఎంట్రీ చేస్తే వాటిని మార్చాలని 2,528 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే 956 అప్లికేషన్లు అప్రూవ్ చేసి, 929 రిజెక్ట్ చేశారు. మరో 643 పెండింగ్‌లో ఉన్నాయి.
కలెక్టర్లు అప్రూవ్ చేసినా..
ధరణి పోర్టల్ టీఎం 33 పాస్ బుక్ మాడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్లు పెట్టుకున్న సుమారు లక్ష మంది.. డేటా కరెక్షన్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇందులో 9 రకాల సమస్యల పరిష్కారానికి సర్కారు ఆప్షన్లు ఇచ్చింది. పట్టాదారు పేరు సవరణ, భూమి స్వభావం, వర్గీకరణ, భూమి రకం, విస్తీర్ణంలో సవరణ, మిస్సింగ్ సర్వే నంబర్ -సబ్ డివిజన్ నెంబర్, నోషనల్ ఖాతా నుంచి పట్టా భూమిగా బదిలీ చేయడానికి చేంజ్ ఆఫ్ ల్యాండ్ టైప్, నాలా నుంచి వ్యవసాయానికి మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఇలా లక్ష మంది ఒక్కొక్కరు రూ.1000 పెట్టి దరఖాస్తు చేయడంతో.. సర్కారుకు సుమారు రూ.10 కోట్ల ఆదాయం వచ్చి ఉంటుందని అంచనా. ఇందులో చాలా అప్లికేషన్లు కలెక్టర్ల దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని అప్లికేషన్లను అప్రూవ్ చేసినప్పటికీ రికార్డుల్లో మాత్రం ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. కలెక్టర్లు అప్రూవ్ చేస్తే సరిపోదని, సీసీఎల్ఏ స్థాయిలో ఏర్పాటు చేయబోయే కమిటీ పరిశీలించాకే డేటా అప్ డేట్ అవుతుందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ ఈ కమిటీతో సంబంధం లేకుండానే ప్రభుత్వ పెద్దలకు, వారి బంధువులకు చెందిన అప్లికేషన్లు ధరణిలో జెట్ స్పీడ్‌తో క్లియర్ అవుతున్నాయి.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శివారు వెంకటాపూర్‌లోని సీఎం ఫామ్‌హౌస్‌ను ఆనుకుని ప్రభుత్వ పెద్దలకు చెందిన ప్రముఖ దినపత్రిక పేరిట 19.14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించిన రికార్డుల్లో పట్టాదారు పేరులో ఒక పదం అదనంగా పడింది. ఏప్రిల్ 29 నుంచి ధరణిలో పాస్ బుక్ డేటా కరెక్షన్‌కు అవకాశమివ్వగానే సంబంధిత యాజమాన్యం పేరు మార్చుకునేందుకు అప్లికేషన్ (2200001606) పెట్టుకుంది. వారం రోజుల్లోనే రికార్డును సరి చేశారు. విచిత్రమేమిటంటే.. ధరణిలో ఈ అప్లికేషన్ నంబర్ స్టేటస్ చెక్ చేస్తే కలెక్టర్ రిజెక్ట్ చేసినట్లు చూపిస్తోంది. ఇందులోనే ఇటీవల పెద్ద పదవి పొందిన వ్యక్తి పేరిట కొంత భూమి ఉంది. ఈ భూమిని ఓ పబ్లికేషన్ కంపెనీ పేరిట మార్చేందుకు పాస్ బుక్ డేటా కరెక్షన్ కింద అప్లికేషన్(2200001491) పెట్టారు. ఆయన పేరిట ఉన్న భూమి మొత్తం వారం రోజుల్లోనే ఆ సంస్థ పేరిట మారిపోయింది.
మంత్రులు, ఎమ్మెల్యేలు రికమెండ్ చేస్తేనే పనులు
ధరణి పోర్టల్‌లో టీఎం 33తోపాటు ఇతర మాడ్యూల్స్ కింద పెట్టుకున్న లక్షలాది అప్లికేషన్లకు మోక్షం లభించడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార పార్టీ నేతల సిఫార్సు ఉంటే తప్పా సీసీఎల్ఏ అధికారులు, కలెక్టర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ధరణిలో తప్పుల సవరణ, ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి సర్వే నంబర్లు తొలగించడం లాంటి పనులు చేయించేందుకు కొందరు తహసీల్దార్లు, లీడర్లే దళారుల అవతారమెత్తుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సిద్దిపేట జిల్లా నుంచే 62,193 అప్లికేషన్లు
రాష్ట్రంలో 12,769 గ్రామాలుంటే దాదాపు అన్ని గ్రామాల నుంచి ధరణిలో అప్లికేషన్లు నమోదయ్యాయి. సుమోటోగా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో నుంచి తీయాల్సిన భూములే 9,493 గ్రామాల్లో ఉన్నట్లు రాష్ట్ర సర్కారే గుర్తించింది. రోజుకు సగటున 1,500 అప్లికేషన్లు ధరణికి వస్తున్నాయి. జిల్లాలవారీగా చూస్తే అత్యధికంగా రంగా రెడ్డి జిల్లాలో 1.58 లక్షల దరఖాస్తులు వచ్చాయి. తర్వాతి స్థానాల్లో సంగారెడ్డి, సిద్దిపేట, యదాద్రి భువనగిరి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు ఉన్నాయి. సిద్దిపేటలో 62,193 అప్లికేషన్లు వస్తే అందులో 32 శాతం రిజెక్ట్ అయ్యాయి. 6 శాతం అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
