మెదక్/సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు జిల్లాలు ఉండగా మెదక్, సిద్దిపేట జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను ఏఐసీసీ ఖరారు చేసింది. సంగారెడ్డి అధ్యక్ష పదవిని పెండింగ్ లో పెట్టింది. మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి మళ్లీ ప్రస్తుత అధ్యక్షుడు శివన్నగారి ఆంజనేయులు గౌడ్ కే దక్కింది. ఈ పదవికి మొత్తం ఆరుగురు దరఖాస్తు చేయగా ఏఐసీసీ ఆంజనేయులు వైపే మొగ్గు చూపింది.
నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆంజనేయులు గౌడ్ గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయడంతో పాటు, జిల్లాలో పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు చేస్తున్న కృషిని గుర్తించి హైకమాండ్ఆయనకు మరోసారి డీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించింది.
అనూహ్యంగా ఆంక్షారెడ్డి
సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్ గా తూముకుంట ఆంక్షరెడ్డి నియమతులయ్యారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కూతురైన ఆంక్షారెడ్డి గతంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ పక్షాన గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి కార్యక్రమంతో పాటు పార్టీ పిలుపు ఇచ్చిన పలు ఆందోళనలో క్రియాశీలకంగా వ్యవహరించారు. డీసీసీ అధ్యక్ష పదవికి పలువురు నాయకులు పోటీపడ్డా ఆఖరి నిమిషంలో అనూహ్యంగా అధ్యక్ష పదవి ఆంక్షారెడ్డిని వరించింది.
