సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం, తీర్పులు

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం, తీర్పులు

న్యాయమూర్తుల నియామకంలో ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి సంప్రదించినప్పుడు.. సీజేఐ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలా? వద్దా? అనే అంశంతో వివాదం మొదలైంది. మూడు విభిన్న తీర్పులతో కొలీజియం వ్యవస్థకు సుప్రీంకోర్టు రూపం ఇచ్చింది.  ఆ తర్వాత జాతీయ నియామకాల కమిషన్​కు పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. దీన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం, తీర్పులు, ఎన్ జేఏసీ గురించి తెలుసుకుందాం. 

రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరిని మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. సీజేఐ నియామకంలో మంత్రిమండలి సలహాతోపాటు సుప్రీంకోర్టులోని ఇతర న్యాయమూర్తులను, అవసరమని భావిస్తే  హైకోర్టు న్యాయమూర్తులనూ రాష్ట్రపతి సంప్రదించాల్సి ఉంటుంది. న్యాయమూర్తుల నియామకంలో మంత్రి మండలి సలహాతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులను, అవసరమైతే హైకోర్టు న్యాయమూర్తులనూ సంప్రదించాలి. సీజేఐ నియామకంలో సాధారణంగా సీనియార్టీ సూత్రం అనుసరిస్తున్నారు. అయితే, ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి సంప్రదించినప్పుడు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై 1981 తర్వాత మూడు సందర్భాల్లో విభిన్న తీర్పులు ఇచ్చారు. వీటిని జడ్జెస్​ కేసులు అంటారు. ఈ మూడు జడ్జెస్​ కేసుల్లోనూ రాష్ట్రపతి న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు సలహాను కోరింది. 

ఫస్ట్​ జడ్జెస్​ కేసు 1981: 

ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించడం అంటే.. ఆయన అభిప్రాయం తెలుసుకోవడం మాత్రమే. ఈ తీర్పు ప్రకారం ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. 

సెకండ్​ జడ్జెస్​ కేసు 1993: 

ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ ప్రధాన న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని మరో ఇద్దరు సీనియర్​ న్యాయమూర్తులను సంప్రదించి తెలపాలి. 

థర్డ్​ జడ్జెస్​ కేసు 1998: 

ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రపతి సలహా కోరినప్పుడు ప్రధాన న్యాయమూర్తి, మరో నలుగురు సీనియర్​ న్యాయమూర్తులతో కూడిన కొలీజియాన్ని సంప్రదించాలి. సాధారణంగా కొలీజియం ఏకాభిప్రాయం ఆధారంగా తన నిర్ణయం తెలుపుతుంది. నలుగురిలో ఏ ఇద్దరు అభిప్రాయాన్ని వ్యతిరేకించినా కొలీజియం ఆ సలహాను రాష్ట్రపతికి ఇవ్వకూడదు. 

జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్​

కొలీజియం వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుతూ న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత, జవాబుదారీతనం సాధించాలనే లక్ష్యంతో జాతీయ న్యాయమూర్తుల నియామకాల కమిషన్​ బిల్లును 2014 ఆగస్టు 13న లోక్​సభ, ఆగస్టు 14న రాజ్యసభలు ఆమోదించాయి. ఆ తర్వాత సగం కంటే ఎక్కువ రాష్ట్రాల శాసనసభలు ఈ బిల్లును ఆమోదించాయి. ఈ కమిషన్​కు 99వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. 

కమిషన్​ – న్యాయమూర్తుల నియామక ప్రక్రియ

  • అత్యంత సీనియర్​ న్యాయమూర్తినే ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. సమర్థత, ప్రతిభను ఆధారంగా చేసుకుని ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. 
  • దేశంలోని హైకోర్టుల్లో గల న్యాయమూర్తుల్లో సీనియర్​ న్యాయమూర్తిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. ఈ సందర్భంలో హైకోర్టులో ఇద్దరు సీనియర్​ న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తిని, సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్​లను సంప్రదించాలి.
  • హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేసే సందర్బంలో రాష్ట్రపతి కమిషన్​ను సంప్రదించాలి. ఈ నియామకాల విషయంలో కమిషన్​లోని ఏ ఇద్దరు సభ్యులు అంగీకరించకపోయినా ఇలాంటి వారిని న్యాయమూర్తిగా నియమించేందుకు వీలు లేదు. 

ఫోర్త్​  జడ్జెస్​ కేసు 2015: 

సుప్రీంకోర్టు అడ్వకేట్స్​ ఇన్​ రికార్డ్​ అసోసియేషన్​ vs యూనియన్​ ఆఫ్​ ఇండియా కేసు – 2015లో సుప్రీంకోర్టు జాతీయ న్యాయ నియామకాల కమిషన్​ చట్టం – 2014, 99వ రాజ్యాంగ సవరణ – 2014 చెల్లదని తీర్పు ఇచ్చింది. ఇది న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తికి భంగం కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఈ కేసును ఎన్​జేఏసీ కేసు అని కూడా అంటారు. ఈ కేసులో తీర్పు ఆధారంగా జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్​ 2015ను రద్దు చేశారు. దీంతో న్యాయమూర్తుల నియామక ప్రక్రియ తిరిగి కొలీజియం పద్ధతిలోనే జరుగుతోంది.

ప్రధాన న్యాయమూర్తి నియామకం 

రాజ్యాంగంలో ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి ప్రత్యేకంగా పేర్కొనలేదు. సాధారణంగా అత్యంత సీనియర్​ న్యాయమూర్తిని సీజేఐగా నియమిస్తారు. 1950 నుంచి 1973 వరకు అత్యంత సీనియర్​ న్యాయమూర్తిని మాత్రమే సీజేఐగా నియమించారు.  ఆ తర్వాత రెండు సందర్భాల్లో సీనియర్​ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించే పద్ధతిని ఉల్లంఘించారు. కేశవానంద భారతి కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకమైన తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. దాంతో సీనియర్​ న్యాయమూర్తులైన జె.ఎం.షెలాట్​, కేఎస్​ హెగ్డే, ఏఎన్​ గ్రోవర్​లను కాదని, సీనియార్టీలో నాలుగో స్థానంలో ఉన్న ఎ.ఎన్​.రేను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అడిషనల్​ డిస్ట్రిక్​ మేజిస్ట్రేట్​ వర్సెస్​ శివకాంత్​ శుక్లా (1997) కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో హెచ్​.ఆర్​.ఖన్నా అనే సీనియర్​ న్యాయమూర్తిని కాదని సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న ఎం.యు.భేగ్​ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. 

1993లో సుప్రీంకోర్టు సెకండ్​ జడ్జెస్​ కేసులో అత్యంత సీనియర్​ న్యాయమూర్తిని మాత్రమే ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని తీర్పు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ నియమాన్ని ఉల్లంఘించలేదు.

ఏకీకృత న్యాయ వ్యవస్థ

ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేది ఏక కేంద్ర లక్షణం. దీన్ని ఇంగ్లండ్​ నుంచి గ్రహించారు. ఏకీకృత న్యాయవ్యవస్థ విధానంలో సుప్రీంకోర్టు అత్యున్నత స్థానంలో ఉండి దానికి దిగువన హైకోర్టులు.. హైకోర్టులకు దిగువన ఒక క్రమానుగ శ్రేణిలో సబార్డినేట్​ కోర్టులను ఏర్పాటు చేశారు. 

స్వతంత్ర న్యాయవ్యవస్థ

స్వతంత్ర న్యాయవ్యవస్థ అనేది ఒక సమాఖ్య లక్షణం. దీన్ని అమెరికా నుంచి గ్రహించారు. కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖల ప్రభావానికి, రాష్ట్రాల ప్రభావానికి లోనుకాకుండా నిష్పాక్షికంగా తీర్పును ఇచ్చే న్యాయ వ్యవస్థను స్వతంత్ర న్యాయవ్యవస్థ అంటారు. దీనివల్ల సమాఖ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యం పరిరక్షించబడతాయి. ప్రాథమిక హక్కులు రక్షించబడతాయి. రాజ్యాంగ ఔన్నత్యం కాపాడబడుతుంది.