
హైదరాబాద్సిటీ, వెలుగు: డోర్నకల్ జంక్షన్ వద్ద రైల్ ఓవర్ రైల్ (10.5 కి.మీ మేర ) ప్రాజెక్ట్ ప్రతిపాదనను మంగళవారం (సెప్టెంబర్ 30) రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.320 కోట్లు ఖర్చవుతుందని అంచనా. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఈ ప్రాజెక్ట్ ద్వారా రైళ్ల కార్యకలాపాలను మరింత మెరుగుపరిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
డోర్నకల్ జంక్షన్ విజయవాడ, కాజీపేట మూడో లైన్ల విభాగంలో ఉంది. ఇది రద్దీగా ఉండే గ్రాండ్ -ట్రంక్ మార్గంలోకి వస్తుందని అధికారులు తెలిపారు. విజయవాడ, కాజీపేట సెక్షన్‌ను నాలుగు లైన్లకు పెంచే ప్రతిపాదన పురోగతిలో ఉందని.. ఈ జంక్షన్‌లోని రైళ్లు విజయవాడ, కాజీపేట రూట్లో అదనంగా భద్రాచలం వైపు నడుస్తాయని తెలిపారు.
విజయవాడ, భద్రాచలం మధ్య రైళ్ల రాకపోకలను సులభతరం చేయడానికి డోర్నకల్ జంక్షన్ వద్ద బై-పాస్ లైన్ నిర్మించామని.. అయితే, విజయవాడ నుంచి భద్రాచలం వైపు రైళ్ల రాకపోకలు స్టేషన్ మీదుగా క్రాసింగ్ ద్వారా వెళ్లాల్సి ఉంటుందని, ఫలితంగా రైళ్లు నిలుపుదల చేయాల్పి వస్తోందన్నారు. ఇప్పుడు డోర్నకల్ వద్ద ప్రతిపాదించిన 10.5 కిలోమీటర్ల దూరం రైల్ ఓవర్ రైలు, విజయవాడ నుండి డోర్నకల్ మీదుగా భద్రాచలం రోడ్డుకు వెళ్లే రైళ్ల క్రాస్ మూవ్మెంట్ ను నివారిస్తుందని అధికారులు తెలిపారు.
ఇది రైళ్లను నిలుపుదల చేయకుండా, ఈ విభాగంలో రైళ్లు సజావుగా కదలికను సులభతరం చేస్తుంది. డోర్నకల్ వద్ద ఉన్న రైల్ ఓవర్ రైల్ ప్రాజెక్ట్ లైన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా కీలకమైన విభాగంలో రద్దీని తగ్గించడానికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు.