ఇది రైల్వే స్టేషనా.. లేక నదా..? నెలరోజులకే నీట మునిగిన అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‎

ఇది రైల్వే స్టేషనా.. లేక నదా..? నెలరోజులకే నీట మునిగిన అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‎

ముంబై: నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైని వర్షం ముంచెత్తింది. ఏడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షం ధాటికి రోడ్లపైకి వర్షపు నీరు చేరి నగరంలోని పలు ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. దీంతో ముంబైలో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే స్థంభించిపోయింది. నీటి ఎద్దడి వల్ల సబర్బన్ రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వాన ప్రభావం చివరకు మెట్రో రైళ్లపైన పడింది. 

మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముంబైలో అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మించిన విషయం తెలిసిందే. ఈ నెల మొదట్లో BKC-వర్లి కారిడార్‎ను‎ ప్రారంభించారు. ఈ రూట్‎లో భాగమైన ఆచార్య ఆత్రే స్టేషన్‌ తాజా వర్షాలకు తీవ్రంగా ప్రభావితమైంది. సోమవారం (మే 26) కురిసిన కుండపోత వర్షం కారణంగా ఆచార్య ఆత్రే అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‎లోకి మోకాలి లోతు వర్షపు నీళ్లు  వచ్చాయి. దీంతో అధికారులు తాత్కాలికంగా మెట్రో స్టేషన్‎ను మూసి వేసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. 

ఆచార్య ఆత్రే అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు చేరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. వీటిపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభించి నెల రోజులు కూడా కాక ముందే ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. కోట్లకు కోట్లు ప్రజాధనం పెట్టి నిర్మిస్తే.. ఒక్క వర్షానికి మెట్రో స్టేషన్ నదిలా మారిపోయిందని సెటైర్లు వేస్తున్నారు. ఇది మెట్రో స్టేషనా లేక నదా..? అంటూ మరికొందరు వ్యంగంగా ట్వీట్లు చేస్తున్నారు. 

చివరకు ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్ ఎంపీ వర్ష గైక్వాడ్.. మోకాళ్ల లోతు నీటితో నదిని తలపిస్తోన్న మెట్రో స్టేషన్‎ వీడియోలను ఎక్స్‎లో షేర్ చేస్తూ.. అధికారుల సంసిద్ధంగా లేకపోవడాన్ని విమర్శించారు. భారీగా ప్రచారం చేసిన భూగర్భ మెట్రో స్టేషన్ వర్షం కురిసిన మొదటి రోజే మునిగిపోయింది. పైకప్పు నుండి నీరు కారుతూ మెట్లపై నుండి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇది ఎంత ప్రమాదకరమో ప్రభుత్వానికి పట్టదా అని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. భద్రతా తనిఖీలు, నిర్మాణ నాణ్యతను తీవ్రంగా సమీక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

కాగా, మెట్రో థర్డ్ ఫేజ్‎లో భాగంగా BKC నుంచి వర్లి వరకు అండర్ గ్రౌండ్ మెట్రో కారిడార్‌ను నిర్మించారు. మొత్తం 6 స్టేషన్లు గల ఈ కారిడార్‎ను 2025, మే 10న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రారంభించారు. ఇందులో తాజాగా వర్షానికి ప్రభావితమైన ఆచార్య ఆత్రే స్టేషన్ ఒకటి. ఓపెనింగ్ చేసి సరిగ్గా నెల రోజుల కూడా గడవకముందే.. మెట్రో స్టేషన్‎లోకి మోకాళ్ల లోతు వరకు నీరు రావడం.. వర్షాకాలంలో అండర్ గ్రౌండ్ మెట్రో వినియోగంపై ప్రయాణికుల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది.