ముంబైకి కాస్త ఉపశమనం... 24 గంటల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు

ముంబైకి కాస్త ఉపశమనం... 24 గంటల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు
  • 2 రోజులుగా భారీ వర్షాలతో సతమతం
  • స్వల్ప ఆటంకాలతో నడుస్తున్న రైళ్లు
  • రాబోయే 24 గంటల్లో మోస్తరు నుంచి  భారీ వర్షాలు: ఐఎండీ

ముంబై: రెండు రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైకి కాస్త ఉపశమనం లభించింది. గడిచిన 24 గంటల్లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదు కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సబర్బన్​ట్రైన్స్​ సహా పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ సర్వీసులు స్వల్ప ఆటంకాలతో నడుస్తున్నాయని  అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో  వెల్లడించారు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌‌పోర్ట్ (బెస్ట్) సంస్థ బస్సులు, మెట్రో సర్వీసులు కూడా యధావిధిగా నడుస్తున్నాయని వివరించారు. 

బీఎంసీ ప్రకారం.. గత ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 11 గంటల మధ్య నారిమన్ పాయింట్‌‌లో అత్యధికంగా 25.2 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. ఆ తర్వాత బీఎంసీ ప్రధాన కార్యాలయం పరిధిలో 21, కొలాబా పంపింగ్ స్టేషన్  పరిధిలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, మంగళవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో సగటున 10. 6  సెంటీ మీటర్లు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 7.2, తూర్పు శివారు ప్రాంతాల్లో 6.3 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయిందని బీఎంసీ వెల్లడించింది. 

రాబోయే 24 గంటల్లో..

రాబోయే 24 గంటల్లో ముంబైలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్​ ఉన్నదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నది.   

కేరళను కుదిపేసిన వానలు

కేరళలో నైరుతి రుతుపవనాలు ఎంటర్​ కావడంతో భారీవర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కుండపోత వర్షం కురవగా.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.  జనజీవనం స్తంభించిపోయింది. రైళ్లు ఆలస్యంగా నడిచాయి. పట్టణాలు, గ్రామాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పట్టాలపై చెట్లు కూలిపోవడంతో రైల్వే సేవలు నిలిచిపోయాయి. కోజికోడ్-–అరీకోడ్ మార్గంలో ఒక భారీ చెట్టు కూలిపోవడంతో విద్యుత్ తీగలు పట్టాలపై పడ్డాయని అధికారులు తెలిపారు.  తిరువనంతపురం వెళ్లే వందే భారత్, పరశురామ్ ఎక్స్‌‌ప్రెస్‌‌తో సహా అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి. 

కుండపోత వర్షాలతో నదుల్లో నీటి మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయని, ఉత్తర వయనాడ్ జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పెద్ద సంఖ్యలో ఇండ్లు మునిగిపోయాయని అధికారులు తెలిపారు. వరద ముంపునకు గురైన అనేక ప్రాంతాల్లోని ప్రజలు ఫైబర్​ బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నట్టు చెప్పారు. భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 607 ఇండ్లు ధ్వంసమయ్యాయని రెవెన్యూ మంత్రి కే రాజన్  వెల్లడించారు.    కాగా, కేరళ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది.  భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, గంటకు 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.