తొందరగా డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఉందా..? ఈ తాపత్రయం మంచిది కాదు.. ఎందుకంటే..

తొందరగా డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఉందా..? ఈ తాపత్రయం మంచిది కాదు.. ఎందుకంటే..

సమాజంలో ఉన్నతంగా బతకాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ, కొందరికి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎంత ప్రయత్నం చేసినా మరికొంతమందికి అసాధ్యం. అందుకే ఆర్థిక వ్యూహాలు స్థిరంగా ఉండేవిధంగా చూసుకోవాలి.  ఎప్పుడూ ఒకేలా ఉండాలి. ఎంత వీలైతే అంత తొందరగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనలు, తాపత్రయం మంచిది కాదు. ఇది ఆర్థిక స్వేచ్ఛకు చాలా చేటు తెస్తాయి. అసలుకే  మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. సంపాదన ఎంత?  ఆదా ఎంత? అనేది ముందుగా అంచనా వేసుకోవాలి. ఆ తర్వాతే పెట్టుబడుల విషయాన్ని ఆలోచించాలి.  

రుణ మొత్తాన్ని తగ్గించుకోగలిగే  శక్తిని పెంపొందించుకోవాలి.  దానిమీద  ప్రధానంగా దృష్టి పెడితే ఆర్థిక స్వేచ్ఛ సాధించడానికి మార్గం  సుగమం అవుతుంది.  తప్పుడు వ్యూహాలతో  ముందుకుసాగితే ఎక్కడో ఓ చోట దెబ్బతినడం ఖాయం.  దీని కారణంగా ఒక్కోసారి అంతా తారుమారై భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తుంది.  చాలామంది వచ్చిన ఆదాయం వచ్చినట్టే ఖర్చు చేసేస్తారు. ఏమాత్రం ఆలోచించరు. ఖర్చుకు వెనకాడరు. ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే అంత ఎక్కువ ఆనందం కలుగుతుందనేవిధంగా వీరి భావన  ఉంటుంది.  కానీ, ఇందులో వాస్తవం లేదు. ఖర్చులను  ఓసారి  గుర్తుకు తెచ్చుకోవడం మొదలుపెడితే అసలు  నిజం బయటపడుతుంది.  దేని గురించి ఖర్చు చేశాం?  దాని వల్ల ఎంత ఆనందం కలిగిందో  బేరీజు వేసుకుంటే స్పష్టంగా తెలిసిపోతుంది. దీనికి నైపుణ్యంతో పని లేదు.

ఆడంబరాలతో అనర్థాలు
కేవలం కొన్ని నిమిషాలపాటు ఆర్థిక స్వేచ్ఛ గురించి ఆలోచించగలిగితే  ఇకమీదట చేసే ఖర్చు.. అవసరమా? అనవసరమా? అనేది తేలిపోతుంది. దీంతో ఆర్థిక భద్రత దానంతట అదే వస్తుంది.  ఆడంబరాలకుపోతే ఆర్థిక భవిష్యత్తు దెబ్బతింటుంది. అవసరం లేకపోయినా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసి లేనిపోని భేషజాలకు వెళ్తే ముందుముందు ఆర్థిక కష్టాలు తప్పవు.  రాబడిని దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయగలిగితేనే డబ్బు ఆదా అవుతుంది.  మానసిక ప్రశాంతత మిగులుతుంది.

ఇతరులతో పోల్చుకుని జీవనం సాగిస్తున్నవారు ఎప్పుడూ ఇబ్బందులతోనే కాలం గడుపుతూ ఉంటారు. రేపటి గురించి భయపడుతూనే ఉంటారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్న సూత్రాన్ని అన్వయించుకోవాలి. నిత్యం స్మరించుకోవాలి. మారిన జీవనశైలితో  క్రెడిట్ కార్డులు రంగ ప్రవేశం చేశాయి. వీటిని అవసరమైనప్పుడు, మరీ ముఖ్యంగా తప్పనిసరయితేనే వీటిని వాడాలి.  ఈ కార్డు రోజువారీ ఖర్చులకు ఉపయోగించేది కాదన్న విషయాన్ని గుర్తించాలి.  గడువులోపు పూర్తి మొత్తాన్ని చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే వడ్డీ భారం పెరిగిపోయి నడ్డి విరుస్తుంది.  క్రెడిట్ కార్డులతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.

అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి
కొందరు పొదుపు మంత్రాన్ని పాటిస్తారు. ఉన్నంతలో ఎంతోకొంత  దాచుకునే ప్రయత్నం చేస్తారు. కానీ,  ఆర్థిక భద్రతకు ఇది అనుకున్నంతగా సాయపడదు. ఆదా చేసిన మొత్తాన్ని సురక్షిత పెట్టుబడుల్లోకి తరలించాలి. ఈ విషయంలో ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. ఎక్కడ మదుపు చేస్తే ఎక్కువ సొమ్ము వస్తుందో  అందులోకి ప్రవేశించాలి. అప్పుడే వార్షిక రాబడి పెరుగుతుంది.

భవిష్యత్తులో పిల్లల చదువులకు ఈ మొత్తం ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో హాయిగా, తృప్తిగా కాలం గడిపే వీలుంటుంది.  చాలామంది ఈ విషయాలను గుర్తించి కొందరు బ్యాంకులో డిపాజిట్ చేస్తుండగా,  మరికొందరు మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే భవిష్యత్తులో  ఎదురయ్యే  ఇబ్బందులను ఎదుర్కొనడానికి కొంత అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి.  దీన్ని ఇతరత్రా అవసరాలకు వాడకూడదన్న నియమం పెట్టుకోవాలి.  నిజానికి ఇవన్నీ అనుకున్నంత తేలికైన పనులు కాదు. సవాళ్ళతో  కూడుకున్నవే.

ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే కొన్ని అడ్డంకులను అధిగమించాలి. డబ్బు సంపాదించడం వేరు. దాన్ని ఆదా చేయడం వేరు. పెట్టుబడులు పెట్టడం వేరు. దేనికదే ప్రత్యేకత కలిగిన అంశం. ఎక్కడ తప్పటడుగు వేసినా ఆర్థిక స్వేచ్ఛ  అసాధ్యం.  ఆర్థిక స్వేచ్ఛ చాలా ఉన్నతమైన లక్ష్యం.  ఊహించని  పరిస్థితి ఏర్పడిన సందర్భంలో  నిబ్బరంగా ఉండాలంటే 'ఆదా' అనేది అత్యవసర నిధికి గొప్ప ప్రారంభం అవుతుంది. ఆర్థిక స్వేచ్ఛ సాధన ఓ సుదీర్ఘ ప్రక్రియ.  ఒక్కరోజులో సాధ్యం కాదు.  క్రమబద్ధంగా ఆలోచన చేయాలి.  ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించడం, మంచి జీవన శైలిని కలిగి ఉండటం, స్వేచ్ఛగా పనిచేయగలగడం, ప్రయాణంలోనూ, ఇతర  వినోదాలను ఆస్వాదించగలగడం ఇవన్నీ ఆర్థిక స్వేచ్ఛ కిందికే వస్తాయి. 

-జి. యోగేశ్వర రావు, సీనియర్ జర్నలిస్ట్