
చెంగ్డూ (చైనా): ఇండియా యంగ్ ఆర్చర్ రిషబ్ యాదవ్ వరల్డ్ గేమ్స్ ఆర్చరీ ఈవెంట్‌లో కాంస్య పతకంతో మెరిశాడు. కానీ, మిగతా ఆర్చర్లతో పాటు టాప్ సీడెడ్‌గా బరిలోకి దిగిన ఇండియా కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ తీవ్రంగా నిరాశపరిచింది. రిషబ్ తెచ్చిన మెడల్‌తో వరల్డ్ గేమ్స్ పతకాల పట్టికలో ఇండియా ఖాతా తెరించింది. మెన్స్ ఇండివిడ్యువల్ కాంపౌండ్ కేటగిరీలో అతను ఈ మెడల్ సాధించాడు. కాంస్య పతకం కోసం శనివారం జరిగిన మ్యాచ్‌లో రిషబ్149–-147 స్కోరుతో ఇండియాకే చెందిన తోటి ఆర్చర్ అభిషేక్ వర్మపై ఉత్కంఠ విజయం సాధించాడు.
హోరాహోరీగా సాగిన ఈ పోరులో 22 ఏండ్ల రిషబ్ మొదటి ఎండ్‌లో మూడు పర్ఫెక్ట్ 10 పాయింట్లు సాధించి 30–29తో ఆధిక్యంలో నిలిచాడు. రెండో ఎండ్‌లో ఇద్దరు ఆర్చర్లు 29–29తో సమంగా నిలవగా.. తర్వాతి ఎండ్‌లో చెరో మూడు పర్ఫెక్ట్స్ 10లు సాధించారు. నాలుగో ఎండ్‌లో అభిషేక్ ఓ పాయింట్ డ్రాప్ చేయగా.. రిషబ్ తన ఆధిక్యాన్ని 119–-117కి పెంచుకున్నాడు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడిన అతను చివరి ఎండ్‌లో మరో మూడు పర్ఫెక్ట్ 10 పాయింట్లు రాబట్టాడు. మొత్తంగా తన ఆఖరి తొమ్మిది బాణాలను పర్ఫెక్ట్ 10లుగా గురిచూసి కొట్టి విజయం అందుకున్నాడు.
అంతకుముందు సెమీ ఫైనల్‌లో రిషబ్ 145–147తో అమెరికాకు చెందిన కర్టిస్ లీ బ్రాడ్‌నాక్ చేతిలో, అభిషేక్ వర్మ 145–148తో నెదర్లాండ్స్ ఆర్చర్ మైక్ స్లోయెసర్ చేతిలో ఓడిపోయారు. విమెన్స్ ఇండివిడ్యువల్ పోటీల్లో ఇండియా అమ్మాయిలు క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయారు. 12వ సీడ్ పర్ణీత్ కౌర్ 140–145తో నాలుగో సీడ్ అలెజాండ్రా ఉస్క్వియానో (కొలంబియా) చేతిలో ఓడగా, మూడో సీడ్ మధుర ధమన్‌గాంకర్ 145–149తో ఆరో సీడ్ లిసెల్ జాత్మ (ఇస్తోనియా) చేతిలో పరాజయం పాలైంది.
మిక్స్‌డ్ కాంపౌండ్ టీమ్ పల్టీ
ఈ గేమ్స్‌లో కచ్చితంగా పతకం తెస్తుందని ఆశించిన కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ తీవ్రంగా నిరాశపరిచింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో టాప్ ప్లేస్‌తో ఆకట్టుకున్న అభిషేక్ వర్మ, మధుర జోడీ తొలి రౌండ్‌లో151–-154 తేడాతో సౌత్ కొరియాకు చెందిన బలహీన ప్రత్యర్థి మూన్ యూన్– లీ యూన్హో ద్వయం చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. కొరియన్లు తొలి ఎండ్‌ను 38-–37తో ముగించి రెండో ఎండ్‌లో అన్ని పాయింట్లూ అందుకున్నారు.
ఇండియా ఆర్చర్లు కేవలం 37తో సరిపెట్టి నాలుగు పాయింట్లు వెనకబడ్డారు. మూడో ఎండ్‌లో 37–37తో సమంగా నిలిచారు. ఫైనల్ ఎండ్‌ను అభిషేక్–మధుర 40–39తో ముగించినా ఓటమి తప్పించుకోలేకపోయారు. 2028 ఒలింపిక్స్‌లో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ భాగం కానుంది. వరల్డ్ గేమ్స్‌లో కేవలం రెండు విజయాలు సాధిస్తే పతకం సాధించే అవకాశం ఉండగా.. ఇండియా మిక్స్‌డ్ టీమ్ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించడం ఆందోళన కలిగిస్తోంది. ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, వ్యూహాత్మక లోపాలను ఈ ఓటమి ఎత్తిచూపిస్తోంది.