
కష్టపడితే పని చేస్తేనే కొన్ని సార్లు లక్షల్లో సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఏ పనీ చేయకుండా నెల నెలా లక్షల రూపాయలు వస్తే ఎలా ఉంటుంది..? ఇది వినడానికి బాగానే ఉంటుంది. కానీ నిజమవడం సాధ్యమేనా అనుకుంటున్నారా..? ఈ విషయంలో ఎలాంటి సంకోచం వద్దు. ఎందుకంటే ఇది సాధ్యమేనని ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి నిరూపించాడు. అతనికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నెల నెలా రూ.5.5లక్షలు వచ్చే అదృష్టం దక్కింది. అంతే కాదు ఇలా అతను 25 సంవత్సరాల పాటు పొందగలుగుతాడట. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మొహమ్మద్ ఆదిల్ అనే వ్యక్తి కొంత కాలంగా దుబాయ్ లోని ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాడు. అయితే యూఏఈ.. ఫాస్ట్ - 5 అనే పేరుతో ఇటీవల ఓ లాటరీ నిర్వహించగా.. మొహమ్మద్ మొదటి విజేతగా నిలిచాడు. ఈ విషయాన్ని నిర్వాహకులు అతనితో జూలై 27న వెల్లడించారు. వారు చెప్పిన దాని ప్రకారం అతను నెల నెలా రూ.5 లక్షల 59వేల 822 చొప్పున 25ఏళ్ల పాటు అందుకోనున్నాడు.
ఇంత పెద్ద మొత్తంలో జాక్ పాట్ తగలడంతో మొహమ్మద్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తాను డ్రాలో విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని, తనకు ముఖ్య సమయంలో డబ్బులు రాబోతున్నాయని ఈ సందర్భంగా చెప్పాడు. తన కుటుంబంలో తానొక్కడినే సంపాదించేవాడినని, కొవిడ్ సమయంలో తన అన్న చనిపోయాడాడన్నాడు. అతని కుటుంబాన్ని కూడా తానే పోషిస్తున్నానని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, తన ఐదేళ్ల పాప పోషణ కూడా తనదేనని చెప్పాడు. ఈ సమయంలో తనకు డబ్బు చాలా అవసరమన్నాడు. ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానని ఆదిల్ ఆనందం వ్యక్తం చేశాడు.
తక్కువ సమయంలో ఓ వ్యక్తి మల్టీ మిలీయనీర్ చేసేందుకే తాము ఫాస్ట్ 5ను తీసుకువచ్చామని, విజేత ప్రయోజనాలను ఆశించే నగదు మొత్తాన్ని ఒకేసారి కాకుండా నెల నెలా ఇచ్చే ఆలోచన చేశామని ఎమిరైట్స్ లాటరీ నిర్వహించే టైచెరస్ మార్కెటింగ్ హెడ్ తెలిపారు.