ఎండా కాలం కోడి గుడ్లు తినకూడదా..? తింటే ఒంట్లో వేడి పెరుగుతుందా..? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

ఎండా కాలం కోడి గుడ్లు తినకూడదా..? తింటే ఒంట్లో వేడి పెరుగుతుందా..? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

ఎండా కాలం కోడి గుడ్లు తినకూడదని.. శరీరంలో వేడి మరింత పెరుగుతుందని చాలా మంది సమ్మర్లో ఎగ్స్ను పక్కన పెట్టేస్తుంటారు. వాస్తవానికి.. కోడి గుడ్లు మంచి ప్రోటీన్‌ ఫుడ్. అయితే గుడ్లు తింటే వేడి పెరుగుతుందనే అపోహ మాత్రం ఎప్పటి నుంచో ఉంది. ఈ నమ్మకం ఎంతగా జనాల్లో పాతుకుపోయిందంటే.. కొంతమంది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉద్దేశపూర్వకంగానే కోడి గుడ్లు తినడం మానేస్తారు.

అయితే.. ఎండా కాలం కోడి గుడ్లు తింటే ఒంట్లో వేడి పెరుగుతుందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్‌ను జీర్ణం చేసుకునేటప్పుడు శరీరంలో కొంత మొత్తంలో వేడి పుట్టడం సహజం. అది ఒక సాధారణ జీవ ప్రక్రియ. ఆరోగ్యంగా ఉండే వారు గుడ్డు తినడం వల్ల శరీర అంతర్గత ఉష్ణోగ్రతలో భారీ మార్పులేమీ జరగవు.

గుడ్లను పూర్తిగా మానేయడానికి బదులుగా.. అప్పుడప్పుడు తినొచ్చు. రోజూ తినడం వల్ల ఇబ్బంది అనిపిస్తే వారానికి రెండు రోజులు గుడ్లు తినండని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కోడి గుడ్లు తిన్నాక నీరు తాగడంపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. గుడ్లు శరీర వేడిని పెంచుతాయనే భావన చాలావరకు సాంప్రదాయ ఆహార నమ్మకాల నుంచి వచ్చింది. గుడ్లలో ప్రోటీన్, పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల.. వాటిని తరచుగా వేడిని పెంచే స్వభావం ఉన్న ఫుడ్ లిస్ట్లో చేర్చుతుంటారు. గుడ్లు తిన్న తర్వాత కడుపు బరువుగా అనిపిస్తే.. అది గుడ్ల తప్పు కాదు.

ALSO READ : ఏసీలో ఎక్కువసేపు ఉంటే తలనొప్పి వస్తుందా..?

కోడి గుడ్ల కూరలో వాడిన అధిక నూనె, మసాలాలు లేదా కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అనిపిస్తుంది. ఏ కాలంలోనైనా గుడ్లు విలువైన పోషకాలను అందిస్తూనే ఉంటాయని ఆరోగ్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. అవి నాణ్యమైన ప్రోటీన్, విటమిన్ బి12, విటమిన్ డి, ఐరన్, కోలిన్, ఆరోగ్యకరమైన కొవ్వులకు మూలం. అందువల్ల.. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే కాలాలతో సంబంధం లేకుండా గుడ్లు తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.