పెరగనున్న  వడగాడ్పులు

పెరగనున్న  వడగాడ్పులు

పెరగనున్న  వడగాడ్పులు
హీట్ వేవ్స్ రెడ్​ జోన్​లో తెలంగాణ
తొలి ఈహెచ్ఎఫ్ ఇండెక్స్​లో ఐఎండీ హెచ్చరిక   
ఏపీ సహా పలు రాష్ట్రాల్లోనూ వడగాడ్పులు తీవ్రం  
టెంపరేచర్లు 40 డిగ్రీలు దాటితే హీట్ వేవ్స్ ముప్పు 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో హీట్​వేవ్స్​(వడగాడ్పులు) పెరుగుతున్నయా? రానురాను అవి మరింత తీవ్రమవుతున్నయా? అంటే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అవుననే అంటున్నది. దేశవ్యాప్తంగా ఎండాకాలంలో హీట్​స్ట్రెస్​ను అంచనా వేసేందుకు ఐఎండీ ఇటీవల ఎక్సెస్ హీట్ ఫ్యాక్టర్(ఈహెచ్ఎఫ్) ఇండెక్స్​ను ప్రారంభించింది. దీనికి సంబంధించి తొలి ఈహెచ్ఎఫ్ ఇండెక్స్​ను కూడా విడుదల చేసింది. ఈ ఇండెక్స్ ప్రకారం హీట్ వేవ్స్​కు సంబంధించి తెలంగాణ ‘రెడ్​జోన్’లో ఉంది. 40 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదైన రాష్ట్రాలను ఈహెచ్ఎఫ్​ తీవ్రంగా ఉన్న రాష్ట్రాలుగా ఐఎండీ పేర్కొంది. రెడ్ జోన్ జాబితాలో తెలంగాణతో పాటు ఏపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, చత్తీస్​గఢ్, హిమాచల్​ప్రదేశ్, యూపీ, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ ఉన్నాయి. 

వివిధ కారణాలతో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నందున రాబోయే రోజుల్లో వేడి తీవ్రత, వడగాడ్పుల ప్రభావం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈహెచ్ఎఫ్ సిస్టమ్​ను ఆస్ట్రేలియాలో మొదటిసారిగా 2014 నుంచి అమలు చేస్తున్నారు. ఆ తర్వాత అమెరికా సహా పలు దేశాలు దీనిని ఫాలో అవుతున్నాయి. తాజాగా మన దేశంలోనూ ఐఎండీ దీనిని ప్రారంభించింది. 

ఏమిటీ ఈహెచ్ఎఫ్? 

ఎక్సెస్ హీట్ ఫ్యాక్టర్(ఈహెచ్ఎఫ్)ను రెండు రకాలుగా లెక్కిస్తారు. మొదటి విధానంలో.. ఒక ప్రాంతంలో నమోదైన మూడు రోజుల(త్రీ డే పీరియడ్: టీడీపీ) సగటు ఉష్ణోగ్రతను గడిచిన ఏడాది కాలంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చి చూస్తారు. రోజువారీ ఉష్ణోగ్రతలు టీడీపీ సగటు కన్నా ఎక్కువగా, ఏడాది కాలంలో నమోదైన ఉష్ణోగ్రతల్లో 95 పర్సంటైల్ కన్నా ఎక్కువగా నమోదైతే ఆ ప్రాంతంలో హీట్​వేవ్స్ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు నిర్ధారిస్తారు. రెండో విధానంలో గడిచిన 30 రోజుల ఉష్ణోగ్రతలతో పోలిస్తే.. టీడీపీ థ్రెషోల్డ్ ఎంత ఉందన్నది లెక్కిస్తారు. టీడీపీ థ్రెషోల్డ్ ఎక్కువగా వస్తే హీట్​వేవ్స్ ఉన్నట్టుగా నిర్ధారిస్తారు. అంటే టీడీపీ థ్రెషోల్డ్ లిమిట్​ సున్నా కన్నా ఎక్కువగా నమోదైనా.. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకన్నా ఎక్కువగా రికార్డ్​ అయినా ఆ ప్రాంతంలో హీట్​వేవ్స్ ముప్పున్నట్టు పరిగణిస్తారు. థ్రెషోల్డ్​ లిమిట్ మైనస్​లో వస్తే ముప్పు లేనట్టు అర్థం. ఈ లెక్కన ఈహెచ్ఎఫ్​ థ్రెషోల్డ్ లిమిట్​తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా, కర్నాటక, చత్తీస్ గఢ్​లలో సున్నా కన్నా ఎక్కువగా రికార్డ్ అవుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. 

ఎందుకీ మోడల్? 

ఇటీవలి కాలంలో వడదెబ్బ వల్ల మరణాలు పెరుగుతున్నాయి. మన రాష్ట్రంలోనే ఒక్క నెలలో 20 మంది దాకా మరణించారు. అనధికారిక లెక్కల ప్రకారం వడదెబ్బ తగిలి మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. ఆస్ట్రేలియాలో కార్చిచ్చులు, తుఫాన్లు, వరదల కన్నా ఎక్కువగా వడదెబ్బతోనే జనం చనిపోతున్నారట. అందుకే.. హీట్​వేవ్స్​పై ప్రజల్లో అవగాహన కల్పించి, వారిని అలర్ట్ చేసేందుకే అక్కడి ప్రభుత్వం ఈహెచ్ఎఫ్ మోడల్​ను ఎంచుకుంది. దీనిద్వారా ఎప్పటికప్పుడు హీట్​వేవ్స్ కండిషన్స్​ను అంచనా వేస్తూ ప్రజలకు జాగ్రత్తలను చెప్తున్నది. ఇప్పుడు మన దేశంలోనూ ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఐఎండీ ఈహెచ్ఎఫ్​ మోడల్​ను తీసుకొచ్చింది.