- జెనరిక్ వెర్షన్లకు మాత్రం మినహాయింపు
- ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- ఇండియా కంపెనీలకు ప్రస్తుతం ఇబ్బందులు లేనట్టే..
- భవిష్యత్లో సమస్యలు రావొచ్చంటున్న నిపుణులు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫార్మాపై మరోసారి టారిఫ్స్ కొరడా ఝళిపించారు. ఈ తాజా నిర్ణయంతో భారత ఫార్మా రంగం వార్తల్లో నిలిచింది. అమెరికా ధరల ఒప్పందాలకు అంగీకరించని లేదా ఉత్పత్తిని అక్కడికి తరలించని కంపెనీలు తయారు చేసే పేటెంట్ మందులపై, ఏపీఐలపై ఇక నుంచి 100 శాతం వరకు సుంకాలు విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మందుల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని అమెరికా భావించడమే ఇందుకు కారణం. జెనరిక్ మందులకు ప్రస్తుతం ఈ సుంకాల నుంచి మినహాయింపు లభించడం భారత ఫార్మా ఎగుమతిదారులకు ఊరటనిచ్చే అంశం. అయితే ఈ మినహాయింపు తాత్కాలికమే కావచ్చుననే సంకేతాలు కూడా అందుతున్నాయి. వచ్చే ఏడాది కాలంలో జెనరిక్ దిగుమతులను నిశితంగా పరిశీలిస్తామని అమెరికా వాణిజ్యశాఖ ప్రకటించడం గమనార్హం.
భారత్ ఇప్పటివరకు అమెరికా వాణిజ్య విభాగంతో రీషోరింగ్ ఒప్పందం చేసుకోలేదు. అలాగే ఆరోగ్య విభాగంతో మోస్ట్ ఫేవర్డ్నేషన్ (ఎంఎఫ్ఎన్) ధరల ఒప్పందం కూడా కుదుర్చుకోలేదు. ఎంఎఫ్ఎన్ దేశాల ఎగుమతులపై సుంకం ఉండదు. అమెరికాలో తయారీకి మొగ్గు చూపే కంపెనీలకు మొదట 20 శాతం సుంకం విధించి 2030 ఏప్రిల్ నాటికి దానిని 100 శాతానికి పెంచుతారు. భారత్ ఈ ఒప్పందాల్లో లేకపోవడం వల్ల పేటెంట్ మందుల ఎగుమతులపై భవిష్యత్తులో భారం పడే అవకాశం ఉందని ఫార్మా ఎక్స్పర్టులు అంటున్నారు.
యూఎస్ ఎగుమతుల్లో 34 శాతం వాటా మనదే
భారత ఫార్మా ఎగుమతుల్లో అమెరికా వాటా 34 శాతం ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో మనదేశ ఫార్మా ఎగుమతులు 30.47 బిలియన్ డాలర్లకు చేరి 9.4 శాతం వృద్ధి నమోదు చేశాయి. అమెరికాకు ఎగుమతుల విలువ 20 శాతం పెరిగి 10.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో ఎక్కువగా జెనరిక్ మందులు ఉన్నాయి. వీటి ధరలు తక్కువగా ఉంటాయి. జెనరిక్ మందులు, బయోసిమిలర్ ఉత్పత్తులను ప్రస్తుతానికి సెక్షన్ 232 సుంకాల నుంచి మినహాయించినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఈ సుంకాలు పెద్ద కంపెనీలకు జులై 31 నుంచి, చిన్న కంపెనీలకు సెప్టెంబర్ 29 నుంచి వర్తిస్తాయి.
ఈ సుంకాల ప్రకటనలో మార్పులు జరిగే అవకాశం ఉండటం కంపెనీలకు ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తులో తన దిగుమతి విధానాలను మార్చుకుంటే జెనరిక్ మందులపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉంది. దీనివల్ల భారత ఫార్మా కంపెనీలపై అమెరికా నియంత్రణ సంస్థల నిఘా మరింత పెరగనుంది. భారత కంపెనీలు తమ వ్యాపార పరిమాణాన్ని కాపాడుకోవడానికి అక్కడి నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడే ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాల విషయంలో కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలి.
