మీరు మమ్మల్ని జంతువులుగా మార్చారు

మీరు మమ్మల్ని జంతువులుగా మార్చారు

ఆస్పత్రిలో కరోనా పేషెంట్స్ కు నీళ్ల ఇక్కట్లు
అధికారులపై పేషెంట్స్ మండిపాటు
లక్నో: కరోనా పేషెంట్స్ కు ఆహారం, నీళ్లు అందించకపోవడంలో ఓ ఆస్పత్రి అధికారులు ఆలస్యం చేయడంతో రోగులు నిరసనకు దిగిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ ప్రస్తుతం మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, ప్రయాగ్ రాజ్ లోని ఆస్పత్రిలో జరిగింది. నీళ్లు అందించకపోవడంలో అధికారులు విఫలమవడంతో గురువారం ఆస్పత్రిలో కరోనా పేషెంట్స్ నిరసనలకు దిగారు. చాలా మంది పేషెంట్స్ ఆస్పత్రి బిల్డింగ్ నుంచి బయటికొచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. అందులో ఒక పేషెంట్ ‘మీరు (ఆస్పత్రి అధికారులను ఉద్దేశించి) మమ్మల్ని జంతువులుగా మార్చారు. మేం జంతువులమా? మాకు నీళ్లు అవసరం లేదా’ అని అరుస్తూ కనిపించాడు. వీడియో తీస్తున్న వ్యక్తి పేషెంట్స్ ను కొన్ని ప్రశ్నలు వేయగా వాళ్లు సమాధానాలు చెప్పారు.

మీకు సరైన భోజనం అందుతోందా అని ప్రశ్నించగా.. ‘లేదు, అదంతా ఉడికీ ఉడకని భోజనం’ అని మరో పేషెంట్ బదులిచ్చాడు. మంచి ఏర్పాట్ల కోసం అధికారులకు కొందరు డబ్బులు చెల్లించడానికి కూడా తాము సిద్ధమేనని పేషెంట్స్ పేర్కొన్నారు. ‘మీ (అధికారులు) వద్ద డబ్బులు లేకుంటే మా నుంచి తీసుకోండి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మేం ఇక్కడి నుంచి వెళ్లిపోతాం’ అని ఓ మహిళా పేషెంట్ చెప్పింది. దీనిపై ప్రయాగ్ రాజ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఓ ప్రకటనలో స్పందించారు. ‘ఎలక్ట్రికల్ తప్పిదం వల్ల ఫ్రెష్ వాటర్ సప్లయిలో సమస్య ఏర్పడింది. మేం ఎలక్ట్రిషియన్ ను పిలిపించాం. అతడు రెండు గంటల్లో దీన్ని పరిష్కరించారు. ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఎప్పుడూ వాటర్ ఉంటుంది. కానీ, తమ స్నానాలకు ఫ్రెష్ వాటర్ ను వాడటానికే పేషెంట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఈ సమస్యను మేం తొందరగానే పరిష్కరించాం’ అని చెప్పారు.