వెలుగు ఓపెన్ పేజీ.. టీచర్ చేతిలో బెత్తం పోయి.. స్టూడెంట్ చేతిలోకి కత్తి వచ్చింది

వెలుగు ఓపెన్ పేజీ.. టీచర్ చేతిలో బెత్తం పోయి.. స్టూడెంట్ చేతిలోకి కత్తి వచ్చింది

మనం ఎటు వెళ్తున్నాం?  మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం?  ఎలాంటి తరాన్ని తయారు చేస్తున్నాం? ఈ  ప్రశ్నలకు సమాధానం ఎవరిని అడగగలం.  సాంకేతికత నిమిషాల్లో ప్రపంచాన్ని మన చేతుల్లోకి  తెస్తోంది.  కానీ, అదే వేగంతో  మనుషుల మధ్య దూరాన్ని కూడా పెంచింది.  సౌకర్యాలు పెరిగాయి.  అదే సమయంలో  సంబంధాల విలువ తగ్గింది.  సమాచార వేగం పెరిగింది.  సంస్కారం తగ్గింది.  హక్కులను భుజాలకు ఎత్తుకుని, బాధ్యతల కాడి ఎత్తేస్తున్నాం!   గత  పదేళ్లుగా  మన  కళ్లముందే ఎన్నో  పరిణామాలు, దుష్పరిణామాలు  శరవేగంగా  మారుతూ వస్తున్నాయి.  తాజాగా  కొండ మల్లేపల్లి రూపారెడ్డి  హత్య తర్వాత ప్రస్తుత దారుణ పరిస్థితులను  కళ్లకు  కట్టినట్లు అయ్యింది.  

పిల్లల్లో  నేరప్రవృత్తి ఏ స్థాయిలో  పెరుగుతోందనే  చర్చ మొదలయ్యింది.  ఓ వైపు ఆవేదన, మరోవైపు ఆందోళన వ్యక్తమవుతోంది.  కానీ,  పిల్లల్లో ఈ మార్పు ఇప్పటికప్పుడు రాలేదు.  గత  కొన్నేళ్లుగా పిల్లల్లో హింసాత్మక ధోరణులు,  మొండితనం,  క్రమశిక్షణ లేమి, చట్టాన్ని లెక్కచేయని వైఖరి పెరుగుతున్న అనేక ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.  కరోనా సమయంలో  పిల్లలు ఇళ్లకే  పరిమితమై ఒకరకమైన  విపరీత భావన పెరిగింది.  అది ఏస్థాయికి చేరిందంటే,  తల్లిదండ్రులపై దాడి చేసిన ఘటనలు కూడా చూశాం.  పిల్లల తీరును తట్టుకోలేక  హాస్టల్‌‌‌‌కు పంపిస్తే బాగుండని కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులూ ఉన్నారు.

తప్పంతా పిల్లల మీదికే నెట్టేద్దామా?

ఇప్పుడు జరుగుతున్న  విపరీత  పరిస్థితులకు కేవలం  పిల్లలను బాధ్యులను చేస్తే  సరిపోతుందా?  పెద్దల తప్పేమీ లేదా?  వారిని పెంచే విధానంలో తల్లిదండ్రులు ఎక్కడో  విఫలమయ్యారనేది కాదనలేని వాస్తవం.  పిల్లలు అడిగింది ఇవ్వకపోతే కోపం.  కోరింది  నెరవేరకపోతే  ఆగ్రహం.  ఎదురు చెప్పినవారిపై  ద్వేషం. తప్పు చేసినా ప్రశ్నించకూడదు.  శిక్షిస్తే  హక్కుల పేరుతో అడ్డుకోవాలి. మరి ఇలాంటి  వాతావరణంలో  పిల్లలు క్రమశిక్షణ ఎలా నేర్చుకుంటారు?  ఇంట్లో  తల్లిదండ్రులు మద్యం మత్తులో కనిపిస్తే  పిల్లలు ఏం నేర్చుకుంటారు?  తల్లిదండ్రులే ఒకరినొకరు గౌరవించుకోకపోతే  పిల్లలు గౌరవం ఎక్కడ  నేర్చుకుంటారు?  ఉమ్మడి  కుటుంబ బంధాల విలువ పెద్దలకే  లేకపోతే పిల్లలకు బంధుత్వాల  విలువ ఎలా 
తెలుస్తుంది?  డబ్బు,  హోదా, పలుకుబడే పరమావధిగా మారితే  నీతి, న్యాయం గురించి పిల్లలకు ఎవరు చెబుతారు?  

తప్పుచేస్తే చెప్పలేని పరిస్థితి వస్తే..  భవిష్యత్తుకు ప్రమాదం

ఒకప్పుడు పాఠశాలలో  తప్పుచేస్తే టీచర్ మందలించేవారు.  అవసరమైతే తల్లిదండ్రులను పిలిచేవారు.  ఇప్పుడు  ప్రతి చర్యను వివాదంగా మార్చే పరిస్థితి వచ్చింది.  శిక్ష వద్దు.  మందలింపు వద్దు.  ప్రశ్నించవద్దు. తప్పు చెప్పవద్దు. చివరకు టీచర్‌‌‌‌కు  మిగిలేది  కేవలం పాఠాలు చెప్పే బాధ్యత మాత్రమే.  కానీ, విద్య అంటే  పాఠాలు చెప్పడం మాత్రమే కాదు. విద్య అంటే  మనిషిని  తయారు చేయడం.  క్రమశిక్షణ నేర్పడం.  విద్యార్థి తప్పు చేస్తే  తల్లిదండ్రులకు  చెప్పలేని పరిస్థితి వస్తే అది పిల్లలకు స్వేచ్ఛ కాదు.  భవిష్యత్తుకు ప్రమాదం.

మార్కులు తక్కువ వస్తే ..టీచర్‌‌‌‌ను నిలదీసే తల్లిదండ్రులు 

తప్పుచేస్తే  తమ పిల్లలను అడిగే  ప్రయత్నం ఎందుకు  చేయడం లేదు?  చదువుతున్నావా? అనే కాదు,  స్కూల్లో ఎలా ఉంటున్నావు?  ఎవరితో  తిరుగుతున్నావు?  తోటి  విద్యార్థులతో ఎలా ఉంటున్నావు?  ఏం చేస్తున్నావు? ఎవరినైనా ఇబ్బంది  పెడుతున్నావా?  అనే ప్రశ్నలు కూడా అడగాల్సిందే.  మైనర్ బైక్ నడిపి ప్రమాదం చేశాడు.  మద్యం సేవించి గొడవ చేశాడు.  పోలీస్ స్టేషన్‌‌‌‌కు వెళ్లాడు.  కేసు నమోదైంది.  అక్కడితో  సమస్య  పరిష్కారం కాకపోగా,  నేరవృత్తికి బీజం పడుతోంది.  

పైరవీకారులు,  ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగుతారు.  పలుకుబడి  ఉపయోగిస్తారు.  తప్పుచేసిన వ్యక్తిని  బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు.  ఇలా చేయడం ముమ్మాటికీ తప్పును  ప్రోత్సహించడమే అవుతుంది.  ఈరోజు ఒక కేసులో తప్పు చేసిన వ్యక్తిని కాపాడితే,  రేపు మరింత  పెద్ద తప్పు చేయడానికి ధైర్యం తెచ్చుకునే అవకాశముంది.

డబ్బు, పలుకుబడి ముందు న్యాయం ఎందుకు బలహీనపడాలి?

అక్రమార్కుడిని వెనకేసుకొస్తే,  దాని ప్రభావం సమాజమంతా అనుభవిస్తుంది.  మానవ హక్కులు, విద్యార్థుల హక్కులకు  చట్టపరమైన రక్షణ అవసరం.  కానీ,  హక్కుల పేరుతో  బాధ్యతను చంపకూడదు.  పిల్లలను కొట్టమని కాదు.  అన్యాయంగా శిక్షించమని కాదు.  చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని అసలు కాదు.  కానీ, తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పే ధైర్యం కావాలి.   తల్లిదండ్రులు  ప్రశ్నించాలి.  టీచర్లు బాధ్యతగా మందలించాలి.  పోలీసులు  చట్టప్రకారం  వ్యవహరించాలి.  ప్రజాప్రతినిధులు పైరవీలకు దూరంగా ఉండాలి. అధికారులు 
నిష్పక్షపాతంగా పనిచేయాలి.  సమాజం తప్పును  తప్పుగానే చూడాలి.  లేకపోతే  మనం పిల్లలను పెంచడం కాదు,   భవిష్యత్తు సమస్యలను పెంచుతున్నట్టే.  పిల్లలను మాత్రమే నిందించేముందు.. పెద్దలు ఆలోచించాలి.  పిల్లలు ఎక్కడి నుంచి  నేర్చుకుంటున్నారు?  ఇంటి నుంచి,  స్కూల్ నుంచి.  స్నేహితుల నుంచి, సమాజం నుంచి.  సోషల్ మీడియా నుంచి, మన ప్రవర్తన నుంచి. అందుకే  పిల్లల్లో నేరప్రవృత్తి  కనిపించిన ప్రతిసారి వారినే నిందించకుండా,  అసలు కారణాలను  శోధించడం మంచిది!

సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలి

గతంలో  పాఠశాలల్లో  ‘మోరల్ సైన్స్’ అనే ప్రత్యేక సబ్జెక్టు ఉండేది.  కానీ ఇప్పుడు  చాలామంది  పిల్లలకు  కనీస స్థాయిలో  కూడా మోరల్ వ్యాల్యూస్‌‌‌‌పై  అవగాహన లేకుండా పోతోంది.  అందుకే   మళ్లీ  నైతిక విలువలకు సంబంధించిన  పాఠాలను విద్యలో  భాగం చేస్తే మరింత మంచిది.  మన  కుటుంబ వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?  ఉమ్మడి కుటుంబాల్లో ఉండే అనుబంధాలు, పెద్దలను గౌరవించడం, బంధుత్వాల విలువ,  ఒకరికి ఒకరు అండగా నిలవడం వంటి  విషయాలను విద్యార్థులకు ప్రత్యేకంగా వివరించాలి.  పిల్లలకు  పుస్తకాలలోని పాఠాలతోపాటు సమాజాన్ని అర్థం చేసుకునే  పాఠాలు కూడా అవసరం. తప్పు-ఒప్పుల  మధ్య  తేడా తెలుసుకునే సామర్థ్యం చిన్న వయసులో  నేర్పితేనే  భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులను తయారుచేయగలం.

- శేఖర్ కంభంపాటి, సీనియర్ జర్నలిస్ట్
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.