రాజకీయాల్లో రాకముందు, వచ్చాక ఆస్తులపై చర్చకి సిద్ధమా?

రాజకీయాల్లో రాకముందు, వచ్చాక ఆస్తులపై చర్చకి సిద్ధమా?
  • మంత్రి జగదీశ్‌‌ రెడ్డికి రాజగోపాల్‌‌రెడ్డి సవాల్‌‌
  • చండూరులోని చేనేత కార్మికుల దీక్షకు మద్దతు తెలిపిన రాజగోపాల్ రెడ్డి

చండూరు, వెలుగు: చేనేత కార్మికుల బాధలు తెలిసిన నాటి నుంచే తన రాజకీయ ప్రస్థానం మొదలైందని, వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చండూరులో మార్కండేశ్వర స్వామి గుడిలో చేనేత వస్త్రాలపై జీఎస్టీ, కార్మికులకు రూ.5 లక్షల జీవిత బీమా తదితర సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన దీక్షకు గురువారం రాజగోపాల్ రెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు.

తమ ఇంటి పక్కన చేనేత తల్లీ లక్షమ్మ తనను కొడుకులా పెంచిందని, అప్పుడే కార్మికుల బాధలను చూశానన్నారు. చేనేత కుటుంబాలు ఆత్మహత్య చేసుకుంటుంటే అప్పటి సీఎం వైఎస్‌‌ రాజశేఖరరెడ్డితో సమస్యలను పరిష్కారం చేయించానని గుర్తుచేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజల బాధలు చెప్పడానికి మూడున్నర ఏండ్లుగా ఎంతో ఆవేదనకు గురయ్యాయని, ప్రభుత్వం కనికరించలేదని, తన రాజీనామా దెబ్బకు కొత్త పింఛన్లు, మూడో విడత గొర్లు వస్తున్నాయన్నారు. 

రాజకీయం చేసేందుకు రాలే..

మీతో రాజకీయం చేయడానికి తాను ఇక్కడికి రాలేదని, మీకు న్యాయం జరిగేంత వరకు మీ తోనే ఉంటానని రాజగోపాల్‌‌రెడ్డి అన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు మునుగోడు ప్రజల కోసం పోరాడుతానని చెప్పారు. అప్పుల పాలైన తెలంగాణను కాపాడుకోవాల్సిన టైమ్‌‌ వచ్చిందని, ఇప్పుడు మీరిచ్చే తీర్పు తెలంగాణ బంగారు భవిష్యత్‌‌కు పునాది కావాలని పేర్కొన్నారు. కుటుంబ, రాచారిక పాలనకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. 

జగదీశ్‌‌రెడ్డి.. ఆస్తులపై చర్చకు సిద్ధమా..?

రాజకీయాల్లోకి రాకముందు, వచ్చాక ఆస్తులపై చర్చకి సిద్ధమా? అని మంత్రి జగదీశ్‌‌ రెడ్డికి రాజగోపాల్‌‌రెడ్డి సవాల్‌‌ విసిరారు. అప్పుడు, ఇప్పుడు తన ఆస్తులు ప్రకటిస్తానని, దమ్ముంటే మీరు కూడా ప్రకటించాలని, ఈ సవాల్‌‌లో తాను వెనక్కి పోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. తన పదవి త్యాగం వృధా కాకూడదని, నాయ్యం, ధర్మం నిలబడి ఈ ఉప ఎన్నికలో చారిత్రక తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు. తర్వాత మండలంలోని శిర్డపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 100 మంది రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.