ఇంట్లో ఫుడ్​కి సేఫ్టీ ఉందా?

ఇంట్లో ఫుడ్​కి  సేఫ్టీ ఉందా?

ఇంటి వంట తింటే తృప్తిగా ఉంటుంది అంటారు చాలామంది. కానీ, దాన్ని ప్రిపర్​ చేసేముందు జాగ్రత్తలు పాటిస్తున్నారా?ఫుడ్​ సేఫ్టీ గురించి పట్టించుకుంటున్నారా? ఎందుకంటే ఇంట్లో అయినా, బయటైనా ఫుడ్​ సేఫ్టీ ముఖ్యం. కానీ, ఈ విషయం తెలియక పొరపాట్లు చేస్తుంటారు చాలామంది. ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుని, ఫుడ్ సేఫ్టీ పాటించమంటున్నారు ఎక్స్​పర్ట్స్. 

గత ఐదేండ్ల నుంచి జూన్ 7న ‘వరల్డ్​ ఫుడ్​ సేఫ్టీ డే’గా సెలబ్రేట్ చేస్తోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఒక్కో ఏడాది ఇక్కో థీమ్​తో జరిగే ఈ వేడుకలో ఈసారి థీమ్​ ఏంటంటే... ఫుడ్ స్టాండర్డ్స్, సేవ్ లైవ్స్. అంటే.. ఆహార ప్రమాణాలే జీవితాల్ని కాపాడతాయి అని అర్థం. ఆహార ప్రమాణాలంటే కేవలం ఫుడ్ ఇండస్ట్రీలు పాటించాల్సినవే కాదు. ​ఇంట్లోనూ సేఫ్టీ పాటించాల్సిందే. డబ్ల్యూహెచ్​వో 2019 రిపోర్ట్​ ప్రకారం, ప్రపంచంలో ఏటా 600 మిలియన్లకు పైగా ఆహార సంబంధిత వ్యాధులు నమోదవుతున్నాయి. అంటే ప్రపంచంలోని దాదాపు10 మందిలో ఒకరికి ఫుడ్ పాయిజన్ అవుతోంది. ఐదేళ్లలోపు పిల్లలు ప్రతి సంవత్సరం 40 శాతం ఫుడ్​ వల్ల ఎఫెక్ట్​ అయినవాళ్లే చనిపోయినవాళ్లే. కాబట్టి, ఫుడ్​ సేఫ్టీపై అవేర్​నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో జూన్ 7, 2019న తొలిసారిగా ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా ప్రకటించారు. నిజానికి, ఈ డేని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సభ్య దేశాలు, ఇతర వాటాదారుల మద్దతుతో కలిసి ప్రారంభించాయి. ఈ దినోత్సవం సందర్భంగా, డబ్ల్యూహెచ్​వో తన అధికారిక వెబ్‌‌సైట్‌‌లో ఆన్‌‌లైన్ చర్చలను కూడా నిర్వహిస్తుంది. తినే తిండి వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా కొన్ని రూల్స్ పాటించాలి. అవేంటంటే.. ఫుడ్​ని శుభ్రంగా ఉంచడం, పచ్చిగా ఉండే వాటిని ఉడికించడం, రకరకాల పదార్థాలను వేటికవే సపరేట్​ చేయడం, ఫ్రిడ్జ్​లో దాచడం వంటివి. ఇవి పాటిస్తే సగం రోగాలు దరిచేరవు అంటున్నారు ఎక్స్​పర్ట్స్. మరి వాటి గురించి వివరంగా తెలుసుకోండి.

వేరుగా ఉంచాలి

మామూలుగా ఫ్రిడ్జ్​​లో లేదా షాపింగ్ చేసేటప్పుడు కార్ట్​లో లేదా మార్కెట్​కి తీసుకెళ్లిన సంచిలో ఫుడ్​ ఐటమ్స్​అన్నీ కలిపి వేస్తుంటారు. కానీ, అలా చేయడం మంచిది కాదు. పచ్చి మాంసం, చేపలు, కోడిగుడ్లను ఇతర ఫుడ్ ఐటమ్స్​కు దూరంగా ఉంచాలి. ఒకవేళ వాటితోపాటు అలా కలిపి తీసుకొస్తే,  ముందు వాటిని వేడి నీళ్లలో మరిగించాలి. పచ్చిమాంసాన్ని పసుపు, ఉప్పు, కారం, నూనె వంటివి వేసి కలిపి పక్కన ఉంచుతారు. అలా మ్యారీనేట్ చేసిన తర్వాత మిగిలిన మసాల మిశ్రమాన్ని మళ్లీ వాడకూడదు. అంతేకాకుండా.. ఏదైనా పచ్చి మాంసం​ కోసం మాత్రమే సపరేట్​గా కటింగ్​ బోర్డ్​ లేదా ప్లేట్​ను వాడాలి. 

ఉడికించాలి

 ఫుడ్​ ఎప్పుడూ వేడిగా ఉండాలి. అప్పుడే దాని మీద ఎలాంటి క్రిములు ఉండవు. ఉడికించేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. బీఫ్​, పోర్క్, మేక మాంసం, చేపలయితే 145 డిగ్రీల ఫారిన్​ హీట్​లో, ఖైమా చేసినవైతే165 డిగ్రీల ఫారిన్ హీట్​లో ఉడకబెట్టాలి. వేట, మేక మాంసం, చికెన్ అయితే165 డిగ్రీల ఫారిన్​ హీట్​లో ఉడికిస్తే బెటర్. అలాగే, ప్రతిసారి ఉడికిందో లేదో చూడటానికి మూత తీసి పెట్టడం కాకుండా థర్మామీటర్​తో కూడా తెలుసుకోవచ్చు. 

శుభ్రత

తినడానికి ముందు, తర్వాత కనీసం చేతులకు సబ్బు రాసుకుని 20 సెకన్ల పాటు వెచ్చని నీటిలో కడిగేయాలి. వంట కోసం వాడిన వస్తువులు కటింగ్​ బోర్డ్​లు, గిన్నెలు, స్పూన్లు, చాకులను వేడి నీళ్లతో కడగాలి. మాంసం, చేపలు, గుడ్లను కిచెన్​ సింక్​లో నేరుగా కడగొద్దు. అలా చేస్తే సింక్​లో నుంచి నీళ్లు చిందిపడితే అక్కడ బ్యాక్టీరియా వ్యాప్తిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి లేదా తరగాలి. 

ఫ్రిడ్జ్​లో పెట్టాలి

వండిన వంట లేదా స్టోర్ నుంచి తెచ్చిన ఫుడ్​ని రెండు గంటల్లోపు ఫ్రిడ్జ్​లో పెట్టాలి. ఒకవేళ బయట 90 డిగ్రీలు అంతకంటే ఎక్కువ వేడి ఉంటే గంటలోపే ఫ్రిడ్జ్​లో పెట్టాలి.